ఏజ్‌లెస్ మెగాస్టార్‌కి బర్త్ డే శుభాకాంక్షలు
కాలం గడిచే కొద్దీ వయసు `నంబర్` మారుతూ ఉంటుంది. కానీ మెగాస్టార్ చిరంజీవికి ఇది వర్తించదు
By: Tupaki Desk | 22 Aug 2024 3:48 AM GMTకాలం గడిచే కొద్దీ వయసు `నంబర్` మారుతూ ఉంటుంది. కానీ మెగాస్టార్ చిరంజీవికి ఇది వర్తించదు. ఆయన ఏజ్‌లెస్ హీరోగా టాలీవుడ్ ని ఏల్తున్నారు. పరిశ్రమలో కమర్షియల్ సినిమాల రారాజుగా కొనసాగుతున్నారు. 150 చిత్రాల తర్వాత కూడా డబుల్ సెంచరీ వైపు వేగంగా కెరీర్‌ని పరిగెత్తిస్తున్న స్పీడ్ ఆయనకు మాత్రమే సొంతం. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు.. కొన్ని అపజయాలు.. వాటన్నిటినీ మించి గొప్ప గొప్ప ప్రశంసలు.. పురస్కారాలు..
వీటన్నిటినీ మించి ఆయన దశాబ్ధాలుగా ప్రజా సేవలో నిమగ్నమై సేవలందిస్తూనే ఉన్నారు. తనకు అన్నం పెట్టిన పరిశ్రమలో ఎవరు ఏ కష్టంలో ఉన్నా ఆయన గుప్తధానాలు చేయడానికి వెనకాడడం లేదు. ఇప్పటికే ఎందరికో ఆర్టిస్టులు కష్టంలో ఉన్నవారికి ఆర్థిక విరాళాలు అందించి ఆదుకున్నారు. ప్రకృతి విపత్తులు, కాలంతో పాటు వచ్చి పడే ప్రమాదాలు, కష్టాల నుంచి చాలా మంది కళాకారులు, అభిమానులు, ప్రజలను ఆయన ఆదుకున్నారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వస్తోంది అంటే కేవలం మెగాభిమానులకు మాత్రమే కాదు, సాధారణ ప్రజలను సైతం అది ఒక పండగ లాంటిది. 22 ఆగస్ట్ 1955 .. భారతీయ సినిమా లెజెండ్ చిరంజీవి పుట్టిన తేదీ.
నేటితో ఆయన వయసు 69. అయినా ఇంకా 29లోనే ఆగిపోయారు. ఇంకా అదే జోష్ ఆయనలో కనిపిస్తోంది. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు రోజులను ఆయన రిపీట్ చేస్తున్నారు. నేటితరం హీరోలతో పోటీపడుతూ చిరు ఫిట్ నెస్ కోసం శ్రమిస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. లుక్ విషయంలో ఆయన శ్రద్ధ యువహీరోలకు తీసిపోదంటే అతిశయోక్తి కాదు. ఆయనలో ఎప్పటికీ అదే ఎనర్జీ.. అదే ఉత్సాహం.. ప్రస్తుతం సోషియో ఫాంటసీ చిత్రం `విశ్వంభర`Mega 157)లో చిరు యంగ్ లుక్ తో కనిపించేందుకు చాలా తపిస్తున్నారని టీమ్ చెబుతోంది. చిరు కెరీర్ బెస్ట్ హిట్ చిత్రం `జగదేక వీరుడు అతిలోక సుందరి` లైన్స్ లో వస్తున్న సినిమా కావడంతో అందరిలో ఒకటే ఆసక్తి నెలకొంది. ఫాంటసీ చిత్రంలో చిరు తనదైన అద్భుత నట ప్రదర్శనతో మరోసారి నాటి రోజుల్లోకి తీసుకెళతారని అభిమానులు భావిస్తున్నారు.
చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఇప్పటికే మెగా ఫ్యాన్స్ లో ఒకటే సందడి నెలకొంది. నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్లు జరుగుతున్నాయి చిరు తన 69వ బర్త్ డే సందర్భంగా నేటి వేకువ ఝామున తిరుమల తిరుపతి వెంకటేశుని సన్నిధానంలో పూజలాచరించారు. సతీసమేతంగా స్వామివారి సందర్శనంలో ఉన్న వీడియో ఇప్పటికే అంతర్జాలంలోకి విడుదలైంది. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న పద్మభూషణుడు.. పద్మవిభూషణుడు మనందరి అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి `తుపాకి` తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.