'ఛావా' థియేటర్‌లో నవ్విన ఆకతాయిలకు తగిన బుద్ది...!
ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను మరాఠీ జనాలు మాత్రమే కాకుండా మొత్తం సౌత్ ఇండియా వారు దైవ సమానులుగా ఆరాధిస్తారు.
By: Tupaki Desk | 4 March 2025 11:22 AM ISTఛత్రపతి శివాజీ మహారాజ్‌ను మరాఠీ జనాలు మాత్రమే కాకుండా మొత్తం సౌత్ ఇండియా వారు దైవ సమానులుగా ఆరాధిస్తారు. శివాజీ మహారాజ్‌ను దేవుడిగా కొలిచే వారు ఎంతో మంది ఉంటారు. అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన 'ఛావా' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా రూ.700 కోట్లు రాబట్టిందని, లాంగ్ రన్‌లో ఈజీగా రూ.1000 కోట్ల వసూళ్లను నమోదు చేయబోతుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమాకు మూడో వారంలోనూ విపరీతమైన ప్రేక్షక ఆధరణ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఛావా సినిమా థియేటర్‌లలో క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఇటీవల నార్త్‌లోని ఒక థియేటర్‌లో ఛావా సినిమా క్లైమాక్స్‌ను ప్రేక్షకులు అంతా లీనం అయ్యి సీరియస్‌గా చూస్తున్నారు. కొందరు ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ థియేటర్‌లోనే కొందరు ఆకతాయిలు సినిమా ఆరంభం నుంచి జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సమయంలో ఏడుస్తున్న ప్రేక్షకులను చూసి ఆ ఆకతాయిలు నవ్వారు. ఎగతాళిగా మాట్లాడారు. దాంతో సినిమా పూర్తి అయిన తర్వాత వారిని బయటకు తీసుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వారితో క్షమాపణలు చెప్పించారు. చెంపలు వేయించారు. అంతే కాకుండా జై శివాజీ మహారాజ్, జై శంభాజీ మహారాజ్ అంటూ నినాదాలు చేయించారు.
నార్త్ ఇండియాలోని ఛావా థియేటర్‌లలో పిల్లల నుంచి పెద్ద వారి వరకు క్లైమాక్స్ చూసి ఎమోషన్ కావడంతో పాటు, చివర్లో శివాజీ మహారాజ్ ను ఉద్దేశించి పాటలు పాడుతున్న వారు, నినాదాలు చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతగా ప్రేక్షకులు ఛావా సినిమాను ఆధరిస్తూ ఉంటే, కొందరు ఆకతాయిలు అలా చేయడం చాలా పెద్ద తప్పు అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారిని మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించడం అనేది మంచి పని అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన వారికి, ఎగతాళి చేసిన వారికి ఇదే విధంగా శిక్ష పడాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఛావా సినిమాను తెలుగులో చూడటం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బన్నీ వాసు ఈ సినిమాను డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న తెలుగు ఛావా సినిమాను మార్చి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇటీవల తెలుగు ఛావా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. గతంలో గీతా ఆర్ట్స్ డబ్బింగ్ చేసి విడుదల చేసిన కాంతార సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఛావా సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు ధీమాగా ఉన్నారు. హిందీలో విడుదలైన మూడు వారాల తర్వాత ఛావా తెలుగులో రాబోతుంది. మరి ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో చూడాలి.