గాయకుడు చనిపోయినా ఏడాదికి 800 కోట్ల ఆదాయం
సంగీత దర్శకులు, గాయకులు, రచయితలు చనిపోయాక కూడా రాయల్టీ అందుకుంటున్నారు.
By: Tupaki Desk | 16 Dec 2024 2:45 AM GMTసంగీత దర్శకులు, గాయకులు, రచయితలు చనిపోయాక కూడా రాయల్టీ అందుకుంటున్నారు. వారి సృజనాత్మక ప్రక్రియలకు చావు లేదు. బౌతికంగా దేహం లేకపోయినా కానీ, వారి ఆదాయం కుటుంబీకులకు అందుతోంది. అలా ఇప్పటికీ కోట్లాది రూపాయల రాయల్టీ అందుకుంటున్న మేటి పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్.
మైఖేల్ జాక్సన్ 2009లో మరణించినప్పటికీ అతని ఎస్టేట్ రాయల్టీల నుండి డబ్బు సంపాదిస్తూనే ఉంది. సంగీతం, పాటలు, ఆల్బమ్‌లు, సినిమాల కారణంగా జాక్సన్ కుటుంబానికి భారీ ఆదాయం అందుతోంది. 2023-24 సంవత్సరాల అంచనాల ప్రకారం.. ఆ కుటుంబీకులు రూ. 5,044 కోట్లు రాయల్టీ అందుకున్నారు. జాక్సన్ కుటుంబం ప్రతి సంవత్సరం సుమారు 800 కోట్లు (100 మిలియన్ డాలర్లు) అందుకుంటున్నారు. మూన్‌వాక్స్, డాన్స్ మోషన్, బ్లాంక్ పేజీ పాటలు..జాక్సన్ పబ్లిషింగ్ రైట్స్ ద్వారా ఈ ఆదాయం కొనసాగుతోంది.
2023 లో జాక్సన్ రాయల్టీల నుండి 115 మిలియన్ డాలర్లు (820 కోట్లు) సంపాదించాడు. ఆ సంవత్సరం అత్యధిక పారితోషికం పొందిన డెడ్ సెలబ్రిటీగా నిలిచాడు. 2016 లో జాక్సన్ ఎస్టేట్ వార్షిక స్థూల సంపాదన 825 మిలియన్ డాలర్లుగా అంచనా వేసారు. ఇది ఒక సెలబ్రిటీ రెవెన్యూలో ది బెస్ట్ గా రికార్డులకెక్కింది. 2018 లో ఆదాయం తగ్గింది.. జాక్సన్ ఎస్టేట్ వార్షిక ఆదాయం 400 మిలియన్ డాలర్లుగా ఉంది.
జాక్సన్ ఎస్టేట్ తన సంగీత హక్కులను సోనీకి 1.2 బిలియన్ డాలర్లకు విక్రయించింది. ఆస్తులలో మాస్టర్ రికార్డింగ్‌లు, పబ్లిషింగ్ , మర్చండైజ్ , థియేట్రికల్ షోల నుండి రాబడి వస్తోంది. జాక్సన్ సంగీతానికి ప్రజాదరణ క్రమంగా పెరిగింది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఆదరణ మరింతప పెరిగింది. 2023లో జాక్సన్ సంగీతం వినియోగం 38.3 శాతం పెరిగి 6.5 బిలియన్ ఆన్-డిమాండ్ స్ట్రీమ్‌లకు పెరిగింది. ఇది 2021లో 4.7 బిలియన్ స్ట్రీమ్‌ల నుండి పెరిగింది. యునైటెడ్ స్టేట్స్‌లో జాక్సన్ సంగీతం అమ్మకాలు ప్రసారాలు 2020 నుండి 2023 వరకు 37శాతం పెరిగాయి. జాక్సన్ ఎస్టేట్ తాలూకా ట్రస్ట్ జాక్సన్ ముగ్గురు పిల్లలను ప్రధాన లబ్ధిదారులుగా పేర్కొంటుంది. క్యాథరీన్ ఉప-ట్రస్ట్ జీవితకాల లబ్ధిదారునిగా ఉంటుంది. అది ఆమె మరణం తర్వాత ప్రధాన ట్రస్ట్‌కి తిరిగి వస్తుంది.
జాక్సన్ తరహాలో చనిపోయాక తమ వారసులకు రాయల్టీ అందిస్తున్న మేటి సెలబ్రిటీలు పలువురు ఉన్నారు. వివరాల్లోకి వెళితే... ఎల్విస్ ప్రెస్లీ వారసత్వం ఏడాదికి సుమారు 400 కోట్లు (50 మిలియన్ డాలర్లు) రాయల్టీ అందుకుంటోంది. మ్యూజిక్ రైట్స్, సినిమాలు, మ్యూజిక్ పబ్లిషింగ్ రైట్స్ ద్వారా ఈ ఆదాయం అందుతోంది. 2023-24 సంవత్సరాల అంచనాల ప్రకారం రూ. 420 కోట్లు రాయల్టీ వారి వారసులు అందుకున్నారు. పాపులర్ సంగీతకారుడు ప్రిన్స్ మరణించిన తర్వాత కూడా అతడి ప్రతిభ కారణంగా వారసులకు ప్రతి సంవత్సరం 160 కోట్ల వరకూ రాయల్టీ దక్కుతోంది. 2023-24 సీజన్ అంచనాల ప్రకారం రూ. 294 కోట్లు అందుకున్నారు. ప్రఖ్యాత డ్యాన్సర్ కం నటుడు ఫ్రెడ్ అస్టైర్ వారసత్వం మ్యూజిక్, డ్యాన్స్ హక్కుల ద్వారా సుమారు 80 కోట్ల (5-10 మిలియన్ డాలర్లు) మేర ఆదాయం పొందుతున్నారు. హాలీవుడ్ నటుడు జేమ్స్ డీన్ వారసులు ఏడాదికి 40 కోట్లు రాయల్లీ ద్వారా అందుకుంటున్నారు. ప్రఖ్యాత రచయిత్రి ఆగాథా క్రిస్టీ పుస్తకాలు, రచనలు మరణించిన తర్వాత కూడా ఏడాదికి సుమారు 80 కోట్ల (10 మిలియన్ డాలర్లు) మేర ఆదాయాన్ని వారసులకు అందిస్తున్నాయి.