కాలేయ మార్పిడి.. ప్రముఖ నటి మరణంపై దర్యాప్తు
ఇటీవల కాలేయ మార్పిడి చేయించుకున్న ట్రాచ్టెన్‌బర్గ్ సహజ సిద్ధంగానే మరణించినట్లు భావిస్తున్నారు. ఆమె మరణంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
By: Tupaki Desk | 27 Feb 2025 8:21 AM GMTప్రముఖ హాలీవుడ్ నటి, గాసిప్ గర్ల్ చిత్రాలలో తన పాత్రలతో పాపులరైన నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ 39 సంవత్సరాల వయసులో మరణించారు. పోలీసు వర్గాల ప్రకారం, బుధవారం ఉదయం కొలంబస్ సర్కిల్ సమీపంలోని తన న్యూయార్క్ నగర అపార్ట్‌మెంట్‌లో మిచెల్ మృతి చెంది కనిపించారు.
ఇటీవల కాలేయ మార్పిడి చేయించుకున్న ట్రాచ్టెన్‌బర్గ్ సహజ సిద్ధంగానే మరణించినట్లు భావిస్తున్నారు. ఆమె మరణంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. మరణానికి అధికారిక కారణాన్ని నిర్ధారించడానికి న్యూయార్క్ నగర పోలీస్ శిభిర వైద్య పర్యవేక్షకుల కార్యాలయం శవపరీక్ష నిర్వహిస్తుంది.
1985లో జన్మించిన ట్రాచ్టెన్‌బర్గ్ నటనా జీవితం చిన్న వయసులోనే ప్రారంభమైంది. నికెలోడియన్ -ది అడ్వెంచర్స్ ఆఫ్ పీట్ అండ్ పీట్, 1996 చిత్రం హ్యారియెట్ ది స్పై పాత్రలతో మొదట బాలనటిగా గుర్తింపు పొందింది. 2000లో `బఫీ ది వాంపైర్ స్లేయర్`లో సారా మిచెల్ గెల్లార్ టైటిల్ పాత్ర చెల్లెలు డాన్ సమ్మర్స్‌గా నటించి అందరి మన్ననలు అందుకుంది. 2003లో ఆమె ఆ షో ముగిసే వరకు షోలోనే కొనసాగింది. తన నటనకు టీన్ ఛాయిస్ అవార్డు నామినేషన్‌ను సంపాదించింది.
ట్రాచ్టెన్‌బర్గ్ గాసిప్ గర్ల్ (2008-2012)లో జార్జినా స్పార్క్స్ పాత్ర తో బుల్లితెర రంగంలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ సిరీస్ లో మోసపూరితమైన సామాజికవేత్త పాత్రలో అభిమానాన్ని పొందింది. 2022లో హెచ్.బి.వో మాక్స్ -గాసిప్ గర్ల్ రీబూట్‌లో ఆ పాత్రను తిరిగి పోషించింది. యూరోట్రిప్ (2004), ఐస్ ప్రిన్సెస్ (2005), 17 ఎగైన్ (2009)లలో జాక్ ఎఫ్రాన్‌తో కలిసి నటించింది. ఈ పాత్రలన్నీ మంచి పేరు తెచ్చాయి. ట్రాచ్టెన్‌బర్గ్ మరణం గురించి తెలుసుకుని సహచరులు, అభిమానులు నివాళులు అర్పించారు.