అదే జరిగితే గాయకులు ఖాళీగానే!
ఇప్పటికే మ్యూజిక్ పరంగా ఈ టెక్నాలజీ వాడితో చాలా పెద్ద నష్టమే జరుగుతుందని పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Aug 2024 5:57 AM GMTఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) అన్ని రంగాల్ని ఏల్తోంది. సినిమా పరంగా చూసుకుంటే! ఏఐ మాయాజాలం ఇప్పుడు సినిమాకి ఓ వరంగా మారింది. చనిపోయిన నటుల్ని సైతం ఏఐ టెక్నాలజీతో తెరపైకి తెస్తున్నారు. నటీనటులు షూటింగ్ కి అందుబాటులో లేకపోతే అత్యవసరం అనుకుంటే? వాళ్ల అనుమతితో పాత్రల్ని సృష్టిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ నటుడు సెట్స్ లో అందుబాటులో లేకపోయినా? ఏఐతో తన పని పూర్తి చేయగల్గుతున్నాడు.
ఇంకా చెప్పాలంటే నటుడు లేకపోయినా పర్వాలేదు. అతడి అనుమతి ఉంటే? చాలు ఏఐ సాయంతో అతడి లేని లోటును భర్తీ చేయోచ్చు అని ప్రూవ్ అయింది. ఇప్పటికే చాలా సినిమాలు నటుల విషయంలో ఈ టెక్నాలజీని వినియోగించారు. ఇంకా ఏఐని సరిగ్గా వినియోగించుకోగల్గితే సినిమా ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఏఐ సహాయంతో గాత్రాల్ని సైతం పున సృష్టిస్తున్నారు. నచ్చిన గాత్రాన్ని సృష్టించి తమకు నచ్చినట్లు సంగీత దర్శకులు పాడించుకునే పరిస్థితి కనిపిస్తుంది.
తాజాగా ఈ అంశంపై సంగీత దర్శకుడు మిక్కీజే మేయర్ అందోళన వ్యక్తం చేసారు. `ఏఐకి నేను అభిమానిని కాదు. సంగీతంలోనే కాదు ఏరంగంలోనూ దాని వినియోగాన్ని ప్రోత్సహించను. ఇది శ్రామిక శక్తిని దెబ్బ తీస్తుంది. నిరుద్యోగానికి కారణమవుతుంది. ముఖ్యంగా ఏఐతో ప్రముఖుల గాత్రాల్ని సృష్టించడం ఏమాత్రం సరికాదు. ఇది పూర్తిగా వినియోగం లోకి వస్తే ఇప్పుడున్న గాయకులకు అవకాశాలు లేకుండా పోతాయి` అని అన్నారు.
ఇప్పటికే మ్యూజిక్ పరంగా ఈ టెక్నాలజీ వాడితో చాలా పెద్ద నష్టమే జరుగుతుందని పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఇంకా ఏఐ ద్వారా స్టార్ హీరోయిన్ల పేరిట న్యూడ్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఏఐతో మంచి తో పాటు అంతకు మించి చెడు కూడా కనిపిస్తుందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.