మిడ్ రేంజ్ హీరోల పాట్లు.. హిట్టు దక్కేదెప్పుడో?
వీరి సినిమాలు ఫ్లాప్ అవడంతో మార్కెట్ కూడా తగ్గుతోంది.
By: Tupaki Desk | 16 March 2025 11:00 PM ISTటాలీవుడ్‌లో చిన్న కథల సినిమాలు హిట్ అవుతున్నాయి, భారీ బడ్జెట్ చిత్రాలు కూడా సక్సెస్ సాధిస్తున్నాయి. కానీ మిడ్ రేంజ్ హీరోలు మాత్రం ఈ రెండు మధ్య చిక్కుకుని సతమతమవుతున్నారు. విజయ్ దేవరకొండ, గోపీచంద్, నితిన్, వరుణ్ తేజ్, అక్కినేని అఖిల్.. వీరందరూ హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. వీరి సినిమాలు ఫ్లాప్ అవడంతో మార్కెట్ కూడా తగ్గుతోంది.
విజయ్ దేవరకొండ: అర్జున్ రెడ్డి, గీత గోవిందం.. లాంటి హిట్స్‌తో దూసుకెళ్లిన విజయ్, ఆ తర్వాత డియర్ కామ్రేడ్, లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి ఫ్లాప్‌లతో ఇబ్బంది పడ్డాడు. ఖుషి కాస్త ట్రాక్ లోకి తెచ్చినప్పటికి ‘ఫ్యామిలీ స్టార్’ (2024) బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు అతని నెక్స్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ (మే 30, 2025) స్పై థ్రిల్లర్‌గా రాబోతోంది. దీనిపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో నిలబెడుతుందని అతను ఆశిస్తున్నాడు.
గోపీచంద్: లక్ష్యం, శౌర్యం, లౌక్యం లాంటి హిట్స్‌తో ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ ఇటీవల ‘రామబాణం’ ‘భీమా’ సినిమాలతో నిరాశపరిచాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. అయితే రీసెంట్ గా ‘విశ్వం’ సినిమా కమర్షియల్ గా కొంత ఊరట కలిగించింది. ఇప్పుడు తన 33వ చిత్రం ‘గోపీచంద్ 33’తో బిజీగా ఉన్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఈ హిస్టారికల్ డ్రామా ఇటీవల ప్రారంభమైంది.
నితిన్: ‘భీష్మ’ (2020) తర్వాత నితిన్ సినిమాలు ‘మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, రంగ్ దే.. వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ‘రాబిన్‌హుడ్’ (2025)తో రాబోతున్నాడు. ఈ సినిమా అతని కెరీర్‌ని మళ్లీ ట్రాక్‌లో పెట్టాల్సి ఉంది. భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మంచి అంచనాలు ఉన్నాయి.
వరుణ్ తేజ్: గని, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా లాంటి ఫ్లాప్‌లతో వరుణ్ తేజ్ సంకటంలో ఉన్నాడు. ‘మట్కా’ భారీ బడ్జెట్‌తో తీసినా విఫలమైంది. అతని తదుపరి కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక హారర్ కామెడీ సినిమా చేస్తున్నాడు. అలాగే మరో రెండు కథలపై చర్చలు జరుపుతున్నారు.
అక్కినేని అఖిల్: అఖిల్ ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ ఒక్కటి కూడా చూడలేదు. ‘ఏజెంట్’ (2023) డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు అతని ఫోకస్ కొత్త సినిమాలపై ఉంది, కానీ ఇంకా క్లారిటీ లేదు. వినరో భాగ్యము విష్ణు కథ మురళి కిషోర్ తో ఒక మాస్ సినిమాను లైన్ లో పెట్టాడు. అలాగే మరికొందరు దర్శకులు కూడా లైన్ లో ఉన్నారు. మరి అఖిల్ బిగ్ హిట్ ఎప్పుడు అందుకుంటాడో చూడాలి.