దర్శకుడికి తెలియకుండా సినిమాలో వేరే ఫుటేజ్
మలై పిడిక్కాద మనిదన్ చిత్రాన్ని శుక్రవారం ఉదయం విజయ్ మిల్టన్ జర్నలిస్టులతో కలిసి ప్రెస్ షో చూశాడు.
By: Tupaki Desk | 4 Aug 2024 5:15 AM GMTబిచ్చగాడు సినిమాతో బిజీ హీరోగా మారిపోయాడు సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ. ఐతే బిచ్చగాడు కంటే ముందే అతను కొన్ని హిట్లు కొట్టాడు కానీ.. ఈ చిత్రంతో అంచనాలు పెరిగాక మాత్రం తన నుంచి సరైన సినిమాలు రావడం లేదు. వరుసగా ఫ్లాపులు వస్తున్నా విజయ్ నుంచి సినిమాలు మాత్రం ఆగట్లేదు. తాజాగా విజయ్ హీరోగా మలై పిడిక్కాద మనిదన్ అనే సినిమా రూపొందింది. ఒకప్పుడు గోలీసోడా అనే సెన్సేషనల్ మూవీ తీసిన సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. శుక్రవారమే తమిళంలో ఈ సినిమా రిలీజైంది. మంచి థ్రిల్లర్ కథాంశమే అయినా.. సరిగా తీయలేదని అంటున్నారు క్రిటిక్స్. సినిమాకు ఓవరాల్‌గా మిక్స్డ్ టాకే ఉంది. ఐతే రివ్యూలు, టాక్ సంగతి పక్కనపెడితే.. ఈ సినిమా ఫైనల్ కాపీ విషయంలో దర్శకుడే తనకు తెలియకుండా ఏదో చేశారని ఆవేదన చెందుతుండడం హాట్ టాపిక్‌గా మారింది.
మలై పిడిక్కాద మనిదన్ చిత్రాన్ని శుక్రవారం ఉదయం విజయ్ మిల్టన్ జర్నలిస్టులతో కలిసి ప్రెస్ షో చూశాడు. ఐతే ఆరంభంలో వచ్చిన ఒక నిమిషం ఫుటేజ్ చూసి తాను షాకైపోయినట్లు తర్వాత మీడియాకు రిలీజ్ చేసిన ఓ వీడియోలో చెప్పాడు విజయ్. తాను తీసిన థ్రిల్లర్ సినిమా కథలో అనేక ట్విస్టులుంటాయని.. సస్పెన్స్ ఉంటుందని.. ఐతే ఆ ట్విస్టులు, సస్పెన్స్ అంతా రివీల్ చేసేలా ఈ నిమిషం ఫుటేజ్ ఉందని.. ఈ ఫుటేజ్ సినిమాలోకి ఎలా వచ్చిందో తనకు తెలియదని.. దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ చెప్పాడు. హీరో ఎవరు.. తన కథేంటి అని ముందే ఈ ఫుటేజ్‌లో చెప్పేశారని.. దీని వల్ల కథలో సస్పెన్స్ ఫ్యాక్టర్ మిస్ అయిపోతుందని.. ప్రేక్షకులు తర్వాత సినిమా చూస్తూ ఇదంతా ముందే తెలుసుకదా అని తేలిగ్గా తీసుకుంటారని.. ఇది సినిమాను దెబ్బ తీసే విషయమని.. దీని లోతుల్లోకి తాను వెళ్లదలుచుకోలేదని.. ప్రేక్షకులు మాత్రం ఆ నిమిషటం ఫుటేజ్ సంగతి మరిచిపోయి సినిమా చూడాలని విన్నవించాడు మిల్టన్.