మీర్జాపూర్ S3 ట్రైలర్: వయోలెన్స్ ఈజ్ మై USP
వయోలెన్స్ ఈజ్ మై USP అంటూ గుడ్డూ చెప్పే డైలాగ్ అతడి పాత్ర తీరుతెన్నులను తెలియజేస్తుంది. తన ఎంపికలకు తగ్గట్టుగానే ఈ సిరీస్ అతడికి మంచి పేరు తెస్తుందనడంలో సందేహం లేదు.
By: Tupaki Desk | 20 Jun 2024 11:52 AM GMTతెర నిండుగా రక్తపాతం, వయోలెన్స్ లేకుండా మిర్జాపూర్ సిరీస్ ని ఆశించలేం. గ్యాంగ్ స్టర్ల గొడవల నడుమ ఎమోషన్ తుపాకుల మోతతో పట్టణం దద్దరిల్లాల్సిందే. ఈసారి సీజన్ 3లో ఇలాంటి కంటెంట్ కి కొదవేమీ లేదు. ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా ముగించిన మేకర్స్ ఇప్పుడు మూడో సీజన్ కోసం రక్తి కట్టించే కొనసాగింపు కథతో వస్తున్నారని అర్థమవుతోంది. ట్రైలర్ ఆద్యంతం ఎంతో క్యూరియస్ గా ప్రజలు వేచి చూసే ఎలిమెంట్స్ ఉన్నాయి.
మీర్జాపూర్ సీజన్ 3 కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న అభిమానులకు ట్రైలర్ తోనే ట్రీట్ మొదలైంది. గుడ్డు పండిట్ ప్రయాణాన్ని గౌరవించేలా తన బ్లాక్‌బస్టర్ ఫుక్రే ఫ్రాంచైజీ నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న అలీ ఫజల్ ఇప్పుడు మిర్జాపూర్ 3 ట్రైలర్‌లో ఎక్కువ భాగం ఆధిపత్యం చెలాయించాడు. వయోలెన్స్ ఈజ్ మై USP అంటూ గుడ్డూ చెప్పే డైలాగ్ అతడి పాత్ర తీరుతెన్నులను తెలియజేస్తుంది. తన ఎంపికలకు తగ్గట్టుగానే ఈ సిరీస్ అతడికి మంచి పేరు తెస్తుందనడంలో సందేహం లేదు. పంకజ్ త్రిపాఠి కలీన్ భయ్యా కూడా చివరిలో కొన్ని సెకన్ల పాటు కనిపించడం అభిమానులకు ట్రీట్ గా మారింది.
మున్నా భయ్యా సీన్ నుండి తప్పుకోవడంతో, అధికారానికి కేంద్రమైన మిర్జాపూర్ ని గుప్పిట పట్టడానికి ప్రయత్నాలు ఎలా సాగాయి? అన్నది సిరీస్ లో చూడబోతున్నాం. ఇది షో డైహార్డ్ అభిమానుల కోసం స్పెషల్ ట్రీట్‌గా రూపొందించిన కొత్త సీజన్ అనడంలో సందేహం లేదు. వాస్తవానికి దివ్యేందు మున్నా ముగింపును చూడగలిగే సీజన్ 2 క్లైమాక్స్ కి కొనసాగింపు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ''అమర్ తిరిగి వస్తాడు. మేరా దిల్ కెహతా హై మున్నా భయ్యా జిందా హై'' అనే వ్యాఖ్యలో చాలా డెప్త్ ఉన్న అర్థం దాగి ఉంది. ఇందులో దివ్యేందు తన ఐకానిక్ పాత్రను మళ్లీ చేయబోతున్నాడో లేదో కాలమే నిర్ణయిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికే చనిపోయిన పాత్రలు తిరిగి రావడానికి సంబంధించిన ఫ్యాన్స్ ఊహాగానాలకు ఈ ట్రైలర్ లో చెక్ పెట్టారు.
'మిస్సింగ్ మున్నా' అనేది దాదాపు ప్రతి మీర్జాపూర్ అభిమానికి సంబంధించిన ఒక ఎమోషన్ అయితే, సిరీస్ వారసత్వాన్ని బెటర్ మెంట్ చేయడం కోసం మూడవ సీజన్ వస్తోందని అందరూ ఆశపడుతున్నారు. ట్రైలర్‌లో కేవలం నిమిషం మాత్రమే కనిపించినా కానీ పంకజ్ త్రిపాఠి కలీన్‌గా తిరిగి రావడం ఉత్కంఠను పెంచింది. ఇందులో గుడ్డు పండిట్ పాత్ర ఆద్యంతం రక్తి కట్టిస్తోంది.