Begin typing your search above and press return to search.

మీర్జాపూర్-3 సాగదీతగా ఉన్నా.. క్లైమాక్స్ మాత్రం!

అయితే రెండో సీజన్ లో మున్నా (దివ్యెందు) చనిపోగా.. కాలిన్ భయ్యా తీవ్ర గాయాలతో కనిపించకుండా పోతాడు.

By:  Tupaki Desk   |   7 July 2024 10:20 AM GMT
మీర్జాపూర్-3 సాగదీతగా ఉన్నా.. క్లైమాక్స్ మాత్రం!
X

మీర్జాపూర్.. ఈ వెబ్ సిరీస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తొలి రెండు సీజన్లు సూపర్ హిట్ కావడంతో మూడో సీజన్ పై మంచి హైప్ క్రియేట్ అయింది. మీర్జాపూర్-3లో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తి నెలకొంది. అయితే సుమారు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత మీర్జాపూర్ మూడో సీజన్ వచ్చేసింది. జులై 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. పది ఎపిసోడ్లతో అందుబాటులోకి వచ్చింది.

అయితే రెండో సీజన్ లో మున్నా (దివ్యెందు) చనిపోగా.. కాలిన్ భయ్యా తీవ్ర గాయాలతో కనిపించకుండా పోతాడు. ఇప్పుడు మూడో భాగం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీర్జాపూర్‌ సింహాసనాన్ని దక్కించుకోవాలని.. కాలీన్‌ భాయ్‌ గుర్తులు లేకుండా చెరిపేసేందుకు ప్రయత్నిస్తాడు గుడ్డు. మాధురి యాదవ్ సీఎం అవుతుంది. శరద్‌ శుక్లా కుర్చీని దక్కించుకోవాలనుకుంటాడు. మరి వీరిలో ఎవరు కింగ్‌ ఆఫ్‌ మీర్జాపూర్‌ అయ్యారన్నదే మూడో సీజన్ కథ.

గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించిన మీర్జాపూర్ మూడో సీజన్.. మొదటి రెండు సీజన్లు ఆకట్టుకున్న స్థాయిలో మాత్రం మెప్పించలేకపోయింది. పలు విషయాల్లో ఓటీటీ లవర్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎపిసోడ్ల రన్‍ టైమ్ చాలా ఎక్కువగా ఉందని అని చెబుతున్నారు. ఎపిసోడ్లు సాగదీసినట్టు అనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా.. సాగదీత వల్ల బోర్ ఫీలింగ్ వస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు.

అనవసరమైన సీన్లు తీసేస్తే.. సీజన్ మరింత థ్రిల్లింగ్ గా ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్ గా మూడో సీజన్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. సీజన్ మొత్తం ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో మేకర్స్ ఈసారి కాస్త తడబడ్డారని తెలుస్తోంది. మీర్జాపూర్‌ కుర్చీ కోసం గుడ్డు, శుక్లా పోరాటం అంత ఆసక్తిగా లేదని, క్లాష్ ఆశించినంత స్థాయిలో పండలేదని అంటున్నారు. ఎనిమిదో ఎపిసోడ్‌ నుంచి అసలు కథ మొదలవుతుందని చెబుతున్నారు.

ఎనిమిది, తొమ్మిది ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయని ఓటీటీ లవర్స్ అంటున్నారు. పదో ఎపిసోడ్‌ మొత్తం సిరీస్‌ కే మెయిన్ హైలెట్ గా చెబుతున్నారు. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్టులు ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. నాలుగో సీజన్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారని, అయితే ఈసారిలా సాగదీత ధోరణి అస్సలు వద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి నాలుగో సీజన్ ఎప్పుడు వస్తుందో, ఓటీటీ లవర్స్ ను ఎలా ఆకట్టుకుంటుందో అంతా వేచి చూడాలి.