Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : మిస్ యు

ఒకప్పుడు తెలుగులో బ్లాక్ బస్టర్లు అందుకున్న తమిళ నటుడు సిద్దార్థ్.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఇక్కడి నుంచి అదృశ్యమయ్యాడు.

By:  Tupaki Desk   |   13 Dec 2024 11:10 AM GMT
మూవీ రివ్యూ : మిస్ యు
X

'మిస్ యు' మూవీ రివ్యూ

నటీనటులు: సిద్దార్థ్-ఆషికా రంగనాథ్-కరుణాకరన్-శరత్ లోహితశ్వ-జయప్రకాష్ తదితరులు

సంగీతం: జిబ్రాన్

ఛాయాగ్రహణం: వెంకటేష్

నిర్మాత: శామ్యూల్ మాథ్యూ

స్క్రీన్ ప్లే: రాజశేఖర్-అశోక్

కథ-దర్శకత్వం: రాజశేఖర్

ఒకప్పుడు తెలుగులో బ్లాక్ బస్టర్లు అందుకున్న తమిళ నటుడు సిద్దార్థ్.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఇక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. కొన్నేళ్ల నుంచి అతను తమిళ అనువాదాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. కానీ సరైన ఫలితం దక్కడం లేదు. తనకు గతంలో బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీ జానర్లో అతను నటించిన చిత్రం.. మిస్ యు. 'నా సామి రంగ'తో మంచి పేరు సంపాదించిన ఆషికా రంగనాథ్ ఇందులో తనకు జోడీగా నటించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మిస్ యు' ఏమేర మెప్పించిందో చూద్దాం పదండి.

కథ:

వాసు (సిద్దార్థ్) ఒక ప్రమాదంలో మెదడుకు దెబ్బ తగిలి తన గతంలో జరిగిన చాలా విషయాలను మరిచిపోతాడు. అతణ్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంటారు. ఇలాంటి స్థితిలో అనుకోకుండా ఓ మిత్రుడి పరిచయంతో తనతో పాటుగా బెంగళూరుకు వెళ్తాడు వాసు. అక్కడ ఆ ఫ్రెండు అపార్ట్మెంట్లో ఉంటూ తన రెస్టారెంట్లోనే పని చేస్తున్న వాసుకు మంజు (ఆషికా రంగనాథ్)ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తనను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించినా పట్టించుకోదు. కానీ ఒక రోజు ధైర్యం చేసి తన ప్రేమను ఆమెకు చెప్పేస్తాడు. కానీ ఆమె అతడి ప్రేమను అంగీకరించదు. తన తల్లితో పాటు స్నేహితులకు ఆ అమ్మాయి గురించి చెప్పి ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలనుకుంటాడు వాసు. కానీ ఆ అమ్మాయి ఫొటో చూసి వాళ్లంతా షాకవుతారు. అప్పటికే వాసు జీవితంలో ఆమె ఉందని.. తనకున్న మెమొరీ లాస్ సమస్యతో ఆమె గురించి మరిచిపోయాడని తెలుస్తుంది. ఇంతకీ మంజుతో వాసుకున్న సంబంధమేంటి.. వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది.. ఆమె గురించి వాసుకు మళ్లీ ఏమైనా గుర్తొచ్చిందా.. చివరికి వీళ్లిద్దరి బంధం ఏ తీరానికి చేరింది.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

తన సినిమా ప్రమోషన్లకు వచ్చిన ప్రతిసారీ ప్రేమకథ చేయమని ప్రేక్షకులు అడుగుతున్నారని.. వాళ్లు కోరినట్లే ఆ జానర్లో సినిమ ా చేశానని.. ఇప్పుడు దీన్ని ఆదరించకపోతే మళ్లీ ప్రేమకథ చేయను అన్నట్లుగా మాట్లాడాడు 'మిస్ యు' సినిమా ప్రమోషన్లలో హీరో సిద్ధార్థ్. ఐతే 'మిస్ యు' చూశాక ఇది ప్రేమకథ అంటే ఒప్పుకోవడానికి మనసు అంగీకరించదు. అసలు ప్రేమ భావనలే కలిగించని సోల్ లెస్ లవ్ స్టోరీ ఇది. ప్రేమ.. ఎడబాటు.. మళ్లీ ప్రేమ.. ఈ ఫార్మాట్లో చాలా మామూలుగా సాగిపోయే ఈ ప్రేమకథ ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కూడా ప్రేక్షకులకు ఫీల్ కలిగించదు. 'హాయ్ నాన్న'లో ప్రమాదంలో మెమరీ లాస్ కు గురయ్యే హీరోయిన్ పాత్రను హీరోగా మార్చి.. ఒక క్రైమ్ ఎలిమెంట్ ఏదో జోడించి దర్శకుడు ఈ కథతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని చూశాడు కానీ.. తెర మీద ఒక్కటంటే ఒక్క సన్నివేశం ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయలేకపోయింది. తెర మీద ఏదో జరిగిపోతున్నట్లు బ్యాగ్రౌండ్ స్కోర్ ద్వారా ఫీల్ తీసుకురావడానికి ప్రయత్నించారు తప్పితే.. కథాకథనాల్లో ఏమాత్రం ప్రత్యేకత లేని అతి సాధారణమైన సినిమా 'మిస్ యు'.

ఒక లవ్ స్టోరీలో ఓ జంట ఒక్కటవుతుంటే ప్రేక్షకులకు ముచ్చటేయాలి. వాళ్లు విడిపోతుంటే వారి గుండెలు కలుక్కుమనాలి. వాళ్లు మళ్లీ కలవాలనే తపన కలగాలి. 'మిస్ యు' సినిమా ఏ దశలోనూ ఈ రకమైన భావనలు కలిగించదు. అసలు హీరో హీరోయిన్ల మధ్య గొడవతో మొదలయ్యే ఈ ప్రేమకథ అక్కడి నుంచి ముందుకే కదలదు. ఇటు హీరో.. అటు హీరోయిన్ ఒకరినొకరు అసహ్యించుకోవడమే చూస్తాం తప్ప.. వారి మధ్య ప్రేమంటూ ఏమీ కనిపించదు. సడెన్ గా ఇద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. ఇక ఇద్దరూ విడిపోవడానికి అయినా సరైన కారణం చూపిస్తారా అంటే అదీ లేదు. హీరోయిన్ చూసిన ఒక హత్యకు సంబంధించి కేసు పెడదాం రా అంటాడు హీరో. ఆమె నో అంటుంది. అంతే.. విడిపోదాం అంటాడు. విడిపోతారు కూడా. మళ్లీ వీళ్లిద్దరూ తిరిగి కలిసే సన్నివేశాలైనా బలంగా రాసుకున్నారా అంటే అదీ లేదు. తమ మధ్య ఎడబాటుకు కారణమైన హత్య కేసునే ఇద్దరూ టేకప్ చేసి బాధితుడికి న్యాయం జరిగేలా చేయడంతో కథ సుఖాంతం అయిపోతుంది. చివర్లో ఒకరి మీద ప్రేమను ఒకరు ఒలకబోస్తుంటే చాలా కృత్రిమంగా అనిపిస్తుందే తప్ప.. ప్రేక్షకుడు వారి ప్రేమను రవ్వంత కూడా ఫీల్ కాడు.

ఒకప్పుడు ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరో.. సిద్దార్థ్. అలాంటి హీరోతో ఆషికా రంగనాథ్ లాంటి అందమైన అమ్మాయి జోడీ కడితే.. ఓ మోస్తరు కథతో అయినా ప్రేక్షకులను ప్రేమ మైకంలో ముంచెత్తొచ్చు. కానీ 'మిస్ యు' అంటూ డెప్త్ ఉన్న టైటిల్ పెట్టి దర్శకుడు రాజశేఖర్ చాలా సాధారణమైన కథను నరేట్ చేశాడు. హీరోకు మెమొరీ లాస్ ప్రాబ్లం పెట్టి కథలో ఉత్కంఠ రేకెత్తించాలని చూశాడు కానీ.. అది ఏమాత్రం వర్కవుట్ కాలేదు. కథను ముందు వెనుక చెబుతూ .. స్క్రీన్ ప్లేలో వైవిధ్యం చూపించాలని ప్రయత్నిస్తే అది గందరగోళంగా తయారైంది. తెర మీద అసలేం జరుగుతోందో తెలియని అయోమయంలో ప్రేక్షకులు పడిపోతారు. హీరో హీరోయిన్ల మధ్య బంధాన్ని తెలియజేసే ట్విస్టు దగ్గర ప్రేక్షకులు ఆశ్చర్యపోవాలి కానీ.. ఏ స్పందనలూ లేకుండా నిస్తేజంగా మారిపోయారంటే దర్శకుడు ఈ కథను ఎంత నిరాసక్తంగా నరేట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇటు ప్రేమ సన్నివేశాలూ పండక.. అటు క్రైమ్ ఎలిమెంట్ కూడా తేలిపోయి.. 'మిస్ యు' ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. 'చిన్నా' లాంటి సినిమాల్లో మెప్పించిన సిద్ధు.. ఈ సోల్ లెస్ లవ్ స్టోరీలో మాత్రం క్లూ లెస్ గా కనిపించాడు. అతడితో పాటు ఆషికాను కూడా దర్శకుడు వేస్ట్ చేశాడు. సిద్ధును ప్రేమకథల్లో చూడాలనుకుంటే.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలను రివైండ్ చేసుకోవచ్చు కానీ.. 'మిస్ యు' జోలికి మాత్రం వెళ్లకపోతే మంచిది.

నటీనటులు:

'మిస్ యు' చూస్తున్నంతసేపు సిద్ధు ఏం చూసి ఈ కథను ఒప్పుకున్నాడనే సందేహం కలుగుతుంది. తనకేదో ప్రత్యేకమైన టేస్టు ఉన్నట్లుగా అతను మాట్లాడుతుంటాడు. ఒకప్పుడు అది నిజం కూడా. కానీ కథల ఎంపికలో అతడి జడ్జిమెంట్ పూర్తిగా దెబ్బ తిందని 'మిస్ యు' రుజువు చేస్తుంది. నటుడిగా కూడా సిద్ధు కొత్తగా ఏమీ ట్రై చేసింది లేదు. ఇంకా లుక్స్ బాగా మెయింటైన్ చేయడం తప్పితే అతను ఏ రకంగానూ మెప్పించలేదు. తన పాత్ర.. నటన అన్నీ చాలా సాధారణంగా అనిపిస్తాయి. 'నా సామి రంగ'లో ఆషికాను చూసి నోరెళ్లబెట్టిన వాళ్లు.. ఈ సినిమా చూసి షాకవుతారు. ఆమె పాత్ర అంత పేలవంగా అనిపిస్తుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అంత బాగా అనిపించదు. తనను చూపించిన తీరే బాగా లేదు. హీరో స్నేహితుడి పాత్రలో కరుణాకరన్ పర్వాలేదు. జయప్రకాష్.. శరత్ లోహితశ్వ లాంటి ఆర్టిస్టులు ఏమాత్రం తమ ప్రత్యేకతను చూపించలేని విధంగా వారి పాత్రలు తయారయ్యాయి.

సాంకేతిక వర్గం:

విషయం లేని సినిమాకు ఎంత పేరున్న టెక్నీషియన్లు పని చేసినా పెద్దగా ఫలితం ఉండదనడానికి 'మిస్ యు' రుజువు. 'రన్ రాజా రన్'తో ఒక ఊపు ఊపిన జిబ్రాన్.. 'మిస్ యు'లో మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. పాటలు.. నేపథ్య సంగీతం పూర్తిగా తేలిపోయాయి. మంచి పాటలు ఇచ్చే స్కోప్ కూడా ఈ కథ అతడికి ఇవ్వలేదనే అనిపిస్తుంది. వెంటకేష్ ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు ఓకే. కథకుడు-దర్శకుడు రాజశేఖర్.. ఒక నిస్సారమైన స్క్రిప్టును అంతే డల్లుగా తెరపై ప్రెజెంట్ చేశాడు. అతడి రచన-దర్శకత్వ ప్రతిభ గురించి చెప్పడానికి ఏమీ లేదు.

చివరగా: మిస్ యు.. అన్నీ మిస్

రేటింగ్- 1.5/5