Begin typing your search above and press return to search.

మిషన్ రాణిగంజ్ ట్రైలర్: బొగ్గు గనిలో రెస్క్యూ ఆఫీస‌ర్ సాహ‌సాలు

దర్శకుడు టిను సురేశ్ దేశాయ్ మాట్లాడుతూ -''ఒక ఫిలింమేక‌ర్ గా మిషన్ రాణిగంజ్ ట్రైలర్‌ను విడుద‌ల చేస్తున్నందుకు సంతోషంగా, చాలా గర్వంగా ఉంది.

By:  Tupaki Desk   |   25 Sep 2023 11:11 AM GMT
మిషన్ రాణిగంజ్ ట్రైలర్: బొగ్గు గనిలో రెస్క్యూ ఆఫీస‌ర్ సాహ‌సాలు
X

పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్‌లో చేపట్టిన భారతదేశపు మొట్టమొదటి బొగ్గు గనుల రెస్క్యూ మిషన్ ఆధారంగా రూపొందుతున్న సినిమా -మిషన్ రాణిగంజ్. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ మిష‌న్ కి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పరిణీతి చోప్రా క‌థానాయిక‌. 'మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ' అక్టోబర్ 6న థియేటర్లలోకి రానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. బొగ్గు గ‌నిలో ప్రాణాల‌ను ర‌క్షించుకోవ‌డం కోసం పోరాడే కార్మికులను కాపాడేందుకు మైనింగ్ ఇంజనీర్ జస్వంత్ సింగ్ గిల్ ఎలాంటి మిష‌న్ చేప‌ట్టార‌న్న‌దే ఈ సినిమా క‌థాంశం. గిల్ పాత్ర‌లో అక్ష‌య్ నటించారు. ఇక ఈ ట్రైల‌ర్ వీక్షించ‌గానే క‌థాంశం న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 'నిప్పుర‌వ్వ' సినిమాకి ద‌గ్గ‌ర పోలిక‌ల‌తో క‌నిపించింది. సింగ‌రేణి బొగ్గుగ‌ని కార్మికుల వెత‌ల నేపథ్యంలో రూపొందిన నిప్పుర‌వ్వ ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా సాగింది. త‌వ్వ‌కాల్లో జ‌ల‌పాతం ముంచుకొచ్చిన‌ప్పుడు కార్మికుల్ని కాపాడేందుకు బాల‌య్య చేసిన సాహ‌సాలు ఎంతో ర‌క్తి క‌ట్టించాయి. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో రెస్క్యూ ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో మిష‌న్ రాణిగంజ్ రూపొందింది. ఇది పూర్తిగా భూగ‌ర్భంలో జ‌ల‌పాతంలో చిక్కుకున్న కార్మికుల్ని కాపాడే మిష‌న్ చుట్టూ తిరిగే సినిమా.

నిజ జీవితంలో 1989లో రాణిగంజ్‌లోని వరదల్లో బొగ్గు గనిలో జ‌ల‌పాతంలో చిక్కుకున్న‌ మైనర్లను రక్షించాడు ఆఫీస‌ర్ గిల్. గిల్ (అక్షయ్) పాత్ర‌లోని ఇంటెన్సిటి.. గ‌నిలో కార్మికులు మునిగిపోతున్న‌ వాటర్ సీక్వెన్స్ ప్ర‌ధానంగా ట్రైల‌ర్ లో హైలైట్ గా నిలిచాయి. వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో గ‌నిలో చిక్కుకున్న 65 మంది కార్మికుల ప్రాణాలను రక్షించడంలో సహాయపడిన అధికారి సాహ‌సాల నేప‌థ్యంలో సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. గ‌నిలో చిక్కుకున్న‌వారి కోసం వారి కుటుంబీకుల ఆవేద‌న‌ను ఎంతో హృద్యంగా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించారు.

దర్శకుడు టిను సురేశ్ దేశాయ్ మాట్లాడుతూ -''ఒక ఫిలింమేక‌ర్ గా మిషన్ రాణిగంజ్ ట్రైలర్‌ను విడుద‌ల చేస్తున్నందుకు సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. ఇది రాజీ అన్న‌దే లేని అధికారి సంకల్పం గురించిన సినిమా. ట్రైల‌ర్ కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూసాను. పెద్ద తెరపై ప్రేక్షకుల‌ను థ్రిల్ కి గురి చేసే స్ఫూర్తిదాయకమైన కథతో తెర‌కెక్కింది'' అని తెలిపారు.

ఈ చిత్రంలో కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా, రవి కిషన్, మిషన్ రాణిగంజ్ త‌దిత‌రులు న‌టించారు. అక్షయ్ కుమార్‌కి మొదటి జాతీయ అవార్డును అందించిన 'రుస్తుం' తర్వాత టిను సురేష్ దేశాయ్ రూపొందిస్తున్న చిత్ర‌మిది. యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన 'రుస్తుం' విమర్శకుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే గాక బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించింది. ఇప్పుడు మిషన్ రాణిగంజ్ మైనింగ్ ఇంజనీర్ దివంగత జస్వంత్ సింగ్ గిల్ వీరత్వం నుండి స్ఫూర్తి పొంది తీసిన సినిమా. ఇది భారతదేశపు మొట్టమొదటి బొగ్గు గనుల రెస్క్యూగా పాపుల‌రైంది. గిల్ చారిత్రాత్మక ధైర్య సాహసానికి గుర్తుగా నవంబర్ 16ని కోల్ ఇండియా లిమిటెడ్ రెస్క్యూ డేగా సెల‌బ్రేట్ చేస్తున్నారు.