Begin typing your search above and press return to search.

అజ్ఞాతం వీడిన మోహన్ బాబు.. సంక్రాంతి సంబరాల్లో ఇలా..!

జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో విల‌క్ష‌ణ న‌టుడు మంచు మోహ‌న్‌ బాబుపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Jan 2025 11:14 AM GMT
అజ్ఞాతం వీడిన మోహన్ బాబు.. సంక్రాంతి సంబరాల్లో ఇలా..!
X

జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో విల‌క్ష‌ణ న‌టుడు మంచు మోహ‌న్‌ బాబుపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మోహన్ బాబు.. తాజాగా కెమెరాల ముందు ప్రత్యక్షమయ్యారు. రంగంపేటలోని తన విద్యానికేతన్‌ స్కూల్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఆయన నటించిన 'రాయలసీమ రామన్న చౌదరి' సినిమాలోని ఓ డైలాగ్ ను గుర్తు చేసుకున్నారు. నిన్న జరిగింది మరిచిపోవాలని, రేపు గొప్పగా ఏం చేయాలనే దాని గురించే ఆలోచించాలని అన్నారు.

''నిన్న జరిగింది మర్చిపోను.. నేడు జరగాల్సింది వాయిదా వెయ్యను.. రేపటి గురించి ఆలోచించను అని 'రాయలసీమ రామన్న చౌదరి' సినిమాలో ఓ డైలాగ్ చెప్పాను. కానీ గతం గతః. నిన్న జరిగింది మార్చిపోవాలి.. ఈరోజు ఏం చేయాలో అనుకోవాలి.. రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలో ఆలోచించుకోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు'' అని మోహన్ బాబు మాట్లాడారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇటీవల కాలంలో మంచు ఫ్యామిలీలో తలెత్తిన వివాదం, మీడియా ప్రతినిధిపై దాడి, పోలీసు కేసు, తదనంతర పరిణామాలు.. ఇవన్నీ మర్చిపోయి రేపటి గురించే ఆలోచించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

చిన్న కొడుకు మంచు మనోజ్ తో గొడవ జరుగుతున్న నేపథ్యంలో, మీడియా కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసారు. మీడియా ప్రతినిధి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవ్వడంతో, మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో ఆయ‌న‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. హైకోర్టు ఆదేశాల్ని స‌వాల్ చేస్తూ, సుప్రీంకోర్టులో మోహ‌న్‌బాబు బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ప్రస్తుతం త‌న వయస్సు 78 ఏళ్ల‌ని, గుండె సంబంధిత స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నాన‌ని, బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషనల్ లో కోరినట్లు తెలుస్తోంది. వచ్చే గురువారం దీనిపై విచారణ జరగనుంది.

ఇదిలా ఉంటే ఓవైపు కోర్టు ఇచ్చిన గడువు పూర్తవ్వడం, మరోవైపు పోలీసులు ఇచ్చిన గడువు ముగియడం, ఇంకో పక్క హైకోర్టు బెయిల్ పిటిషన్ ను రిజెక్ట్ చేయడంతో మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. చాలా రోజులుగా మీడియా ముందు కనిపించకపోవడంతో, సీనియర్ నటుడు పరారీలో ఉన్నారంటూ రూమర్లు కూడా చక్కర్లు కొట్టాయి. మంచు మోహన్ బాబు ప్రస్తుతం ఇండియాలో లేరని, అరెస్ట్ భయంతో ఇప్పటికే విదేశాలకు వెళ్లి పోయారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా తన స్కూల్ లో ఘనంగా జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మోహన్ బాబు.. తాను ఎక్కడికీ వెళ్లలేదని చెప్పకనే చెప్పారు. కూతురు మంచు లక్ష్మి కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.