ఆఫీస్ బోయ్ సలహాతో సినిమా స్టోరీ మార్చిన నిర్మాత!
అయితే ఈ సినిమా కథ విషయంలో జరిగిన మార్పుల గురించి మోహన్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
By: Tupaki Desk | 29 Aug 2024 9:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'హిట్లర్' అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అన్నా-చెల్లెళ్ల సెంటిమెంట్ స్టోరీ నేపథ్యంలో ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన చిత్రమిది. ఇది మలయాళ సినిమాకి రీమేక్. ఎడిటర్ కం నిర్మాత మోహన్ ఈ సినిమా రైట్స్ దక్కించుకుని చిరుతో పట్టాలెక్కించి సంచలనం చేసారు. అయితే ఈ సినిమా కథ విషయంలో జరిగిన మార్పుల గురించి మోహన్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అవేంటో ఆయన మాటల్లోనే.. 'హిట్లర్' సినిమా మలయాళంలో మమ్ముట్టి చేశారు. ఆ సినిమాను రిలీజ్ కి ముందు నాకు చూపించారు. ఆ సినిమా ఆడుతుందా ? లేదా? అనే సందేహంలోనూ ఉంది. అప్పుడు నేను ఈ సినిమా మలయాళంలో తప్పకుండా ఆడుతుంది. తెలుగు హక్కులను నేను తీసుకుంటానని చెప్పా. అన్నట్టుగానే మలయాళంలో ఆ సినిమా పెద్ద హిట్ అయింది. తెలుగు హక్కులను నేను తీసుకున్నాను.
మలయాళంలో మమ్ముట్టి డాన్సులు , ఫైట్లు చేయలేదు. తెలుగులో అవి లేకపోతే ఆ సినిమా చూడరు. అందువలన నేను అవి ఉండేలా చూసుకున్నాను. ఓ రోజు మలయాళ సినిమా గురించి నేను మా ఆఫీసులో మాట్లాడుతున్నాను. అదే సమయంలో గెస్టులకు టి - బిస్కెట్లు ఇస్తూ మా బాయ్ నా దగ్గరికి వచ్చాడు. 'తెలుగులో ఈ సినిమా ఆడదు సార్' అన్నాడు. ఆ మాటకి ఒక్కసారిగా కంగారు పడ్డాను.
ఎందుకు ఆడదు? అక్కడ పెద్ద హిట్ అయింది అని చెప్పాను. దానికి మావాడు చెల్లెళ్ల పట్ల హీరోకి ప్రేమ ఉంది .. కానీ వాళ్లకి పెళ్లిళ్లు చేయడు. ఎవరైనా వాళ్లని ప్రేమిస్తే కొడతాడు . మరి ఎట్లా ఆడుతుంది? సార్ అని అన్నాడు. దీంతో నేను కూడా ఆలోచనలో పడ్డాను. కథలో అదే మెయిన్ పాయింట్. ఆ మాట నన్ను ఆలోచింపజేసింది. దీంతో కథలో కొన్ని రకాల మార్పులు చేసాను. మా బోయ్ చెప్పింది నిజమేనని నాకు అర్దమైంది. అలాగే రిలీజ్ చేస్తే ఫలితం మరోలా ఉండేది' అని అన్నారు.