మాలీవుడ్ కి పాన్ ఇండియా గుర్తింపు అలా!
అలాగే మాలీవుడ్ కి కూడా ఇంతవరకూ ఒక్క పాన్ ఇండియా సక్సెస్ కూడా లేదు. నిజానికి వాళ్లు అలాంటి ప్రయత్నం కూడా ఇంతవరకూ చేయలేదు.
By: Tupaki Desk | 28 Dec 2024 3:00 AM GMTపాన్ ఇండియా సినిమా అంటే అందరికీ టాలీవుడ్ గుర్తొస్తుంది. ఆ తర్వాత శాండిల్ వుడ్ గుర్తొస్తుంది. సౌత్ లో ఈ రెండు పరిశ్రమల నుంచే పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇదే పాన్ ఇండియా సక్సెస్ కోసం కోలీవుడ్ కిందా మీదా పడుతుంది. చేయని ప్రయత్నం అంటూ లేదు. రకరకాల ప్రయత్నాలు చేస్తుంది గానీ పనవ్వడం లేదు. విక్రమ్ , రజనీకాంత్, సూర్య, విజయ్ ఇలా స్టార్లు అంతా ప్రయత్నాలు ఆపకుండా చేస్తున్నా ఆ గుర్తింపు మాత్రం రావడం లేదు.
అలాగే మాలీవుడ్ కి కూడా ఇంతవరకూ ఒక్క పాన్ ఇండియా సక్సెస్ కూడా లేదు. నిజానికి వాళ్లు అలాంటి ప్రయత్నం కూడా ఇంతవరకూ చేయలేదు. అక్కడ పరిశ్రమ చిన్నది కావడంతో బడ్జెట్ సెట్ అవ్వడం కూడా కష్టం . కానీ జాతీయ, అంతర్జాతీయంగా మాలీవుడ్ సినిమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అవార్డులు ఎక్కువగా మాలీవుడ్ సినిమాలకే వస్తుంటాయి. అస్కార్ నామినేషన్స్ ఏడాదికో సినిమా అక్కడ నుంచి కచ్చితంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో `దృశ్యం` చిత్రం పాన్ ఇండియాలో గొప్ప విజయం సాధించిందంటూ మోహన్ లాల్ ముందు కొచ్చారు. ఓటీటీలో ఈ చిత్రాన్ని చాలా మంది ప్రేక్షకులు వీక్షించారన్నారు. ఇండియాలోని గుజరాత్ ఆడియన్స్ తనని గుర్తు పట్టారన్నారు. `దృశ్యం` సినిమా గురించి మాట్లాడరన్నారు. ఆ విధంగా మలమాళ సినిమాకి పాన్ ఇండియా గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేసారు.
అలాగే `దృశ్యం-3` స్క్రిప్ట్ సిద్దమైందన్నారు. త్వరలోనే ఆ చిత్రం ప్రారంభమవుతుందని తెలిపారు. రెండు భాగాలను మంచి సస్పెన్స్ అంశాలు మూడవ భాగంలో ఉంటాయన్నారు. అయితే వివిధ భాషల్లో వచ్చిన `దృశ్యం` రీమేక్ చిత్రాల్ని మాత్రం తాను చూడలేదన్నారు. తెలుగు, తమిళలోనూ `దృశ్యం` రీమేక్ అయిన సంగతి తెలిసిందే. వాటిలో వెంకటేష్, కమల్ హాసన్ లు నటించారు.