మాలీవుడ్‌ని నాశనం చేయొద్దని మోహన్ లాల్ ఆవేదన
''మేమంతా ఇప్పుడు మా పదవులను (అమ్మ) ఎందుకు విడిచిపెట్టాము? అని మీరు అడిగితే .. మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమ దీనికి సమాధానం చెప్పాలి.
By: Tupaki Desk | 31 Aug 2024 1:09 PM GMTమలయాళ సినీ కళాకారుల సంఘం (అమ్మ) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత మలయాళ నటుడు మోహన్‌లాల్ ఆగస్టు 31న తొలిసారి బహిరంగంగా కనిపించారు. హేమ కమిటీ నివేదికపై చొరవ తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని, నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులను వెలుగులోకి తెచ్చిన హేమ కమిటీ నివేదిక ఫలితాలపై అతడు పూర్తిగా తన మౌనాన్ని వీడారు. అదే సమయంలో పరిశ్రమను నాశనం చేయవద్దని ప్రతి ఒక్కరినీ కోరారు.
అమ్మను టార్గెట్ చేయొద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. దయచేసి పరిశ్రమను నాశనం చేయవద్దు! అని మోహన్‌లాల్ ఎమోషనల్ అయ్యారు. సీనియర్ నటుడు మోహన్‌లాల్ ఆగస్టు 27న 'అమ్మా' సంఘం పాలకమండలి సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, ''హేమ కమిటీ నివేదికను మేము స్వాగతిస్తున్నాం. ఆ నివేదికను విడుదల చేయడం ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయం. అన్ని ప్రశ్నలకు 'అమ్మ' సమాధానం ఇవ్వదు. ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరి కోణంలో అడగాలి. ఇది చాలా మంది చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ. ఇందులో తప్పు చేసిన వారిపై విచారణ కొనసాగుతోంది. అన్ని సమస్యలను పరిశీలిస్తున్నాం. దర్యాప్తు సాగుతుంది.
ఈ ప్రక్రియలో మేం అన్నివిధాలా సహకరిస్తాం. పరిస్థితిని సరిదిద్దడానికి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాము'' అని అన్నారు. అంతేకాదు.. కొన్ని పెద్ద శక్తులు తప్పు చేసిన వారిని కాపాడుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి కూడా మోహన్ లాల్ సమాధానమిచ్చారు. అపరాధానికి పాల్పడే శక్తి సమూహం గురించి తనకు తెలియదని, నేను అందులో భాగం కాదని కూడా మోహన్ లాల్ అన్నారు. నేను హేమా కమిటీ నివేదికను చదవలేదని కూడా తెలిపారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక దోపిడీ, వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించిన హేమ కమిటీ నివేదిక అందరిలో ఆగ్రహాన్ని కలిగించిన సంగతి తెలిసినదే. పలువురు నటీమణులు తాము ఎదుర్కొంటున్న వేధింపులు, దోపిడీ గురించి బయటపడ్డారు. 'మాతృభూమి' మీడియాలో వచ్చిన ఒక కథనం గురించి లాల్ ఉటంకిస్తూ మాట్లాడారు. ''మేమంతా ఇప్పుడు మా పదవులను (అమ్మ) ఎందుకు విడిచిపెట్టాము? అని మీరు అడిగితే .. మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమ దీనికి సమాధానం చెప్పాలి. హేమ కమిటీ నివేదిక కేవలం ఒక సమస్యను మాత్రమే కాకుండా అనేక అంశాలను హైలైట్ చేసింది. అసలు అవి ఏమిటో నాకంటే మీకు బాగా తెలుసు'' అని వ్యాఖ్యానించారు.
మోహన్‌లాల్ మాత్రమే కాదు, మలయాళ పరిశ్రమలోని 'అమ్మ' పాలకమండలి మొత్తం తమ పదవులకు రాజీనామా చేసింది. అసోసియేషన్ నుండి ప్రకటన సారాంశం ఇలా ఉంది. ''అసోసియేషన్‌ను పునరుద్ధరించే, బలోపేతం చేసే సామర్థ్యం గల కొత్త నాయకత్వం AMMAకి వస్తుందని మేం ఆశిస్తున్నాము. విమర్శించిన వారికి, అలాగే సరిదిద్దినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు'' అని ప్రకటన వెలువరించింది. అలాగే కొత్త పాలకవర్గాన్ని ఎంపిక చేసేందుకు రెండు నెలల్లో జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అసోసియేషన్ అందరికీ తెలియజేసింది.