బాధపెట్టినందుకు క్షమించండి.. మీ ప్రేమాభిమానాలే ముఖ్యం
ఈ విషయంలో తాజాగా మోహన్ లాల్ స్పందిస్తూ, ఆడియన్స్ కు క్షమాపణలు చెప్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
By: Tupaki Desk | 30 March 2025 10:56 AMమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ఎల్2: ఎంపురాన్. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ కు కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. లూసిఫర్ కు దర్శకత్వం వహించిన పృథ్వీరాజ్ సుకుమారనే ఎల్2: ఎంపురాన్ కు కూడా దర్శకత్వం వహించాడు.
భారీ అంచనాల మధ్య రిలీజైన ఎల్2: ఎంపురాన్‌కు మొదటి షో నుంచే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ అనుకోకుండా ఎల్2 సినిమా ఎవరూ ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఎల్2: ఎంపురాన్ లోని కొన్ని సన్నివేశాలు గుజరాత్ అల్లర్లను ఉద్దేశించి ఉండటంతో ఈ సినిమాపై పలువురు అభ్యంతరాలు వెల్లిబుచ్చుతూ చిత్ర మేకర్స్ పై మండిపడుతూ సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ఎల్2 అంటూ ట్రెండ్ చేస్తున్నారు.
ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవడంతో సెన్సారు బోర్డు ఎల్2 సినిమాలో 17 సీన్స్ మార్పులు చేయాలని మేకర్స్ కు సూచించింది. ఈ విషయంలో తాజాగా మోహన్ లాల్ స్పందిస్తూ, ఆడియన్స్ కు క్షమాపణలు చెప్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
ఎల్2: ఎంపురాన్ సినిమాలో వచ్చిన కొన్ని సామాజిక, రాజకీయ అంశాలు ఎంతో మందిని మనోవేదనకు గురిచేయడంతో పాటూ చాలా మంది మనసుల్ని నొప్పించాయని, ఆర్టిస్టుగా నా సినిమాలు రాజకీయ ఉద్యమాలు, భావజాలం, ఓ వర్గం పట్ల ద్వేషాన్ని కలిగించేలా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనకుందని, మా సినిమా మిమ్మల్ని బాధపెట్టినందుకు చింతిస్తూ, ఎంపురాన్ టీమ్ మొత్తం తరపున క్షమాపణలు చెప్తున్నాననంటూ మోహన్ లాల్ పోస్ట్ చేశారు.
ఆడియన్స్ ను బాధ పెట్టే సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని చిత్ర యూనిట్ మొత్తం కలిసి నిర్ణయం తీసుకున్నామని, గత 40 ఏళ్లుగా ఆడియన్స్ లో ఒకడిగా నా సినీ జర్నీని కొనసాగించానని, ఆడియన్స్ ప్రేమ, విశ్వాసమే నా బలమని, ప్రేక్షకుల ప్రేమ కంటే మోహన్ లాల్ కు ఏదీ ఎక్కువ కాదని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు. మోహన్ లాల్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.