మోహన్ లాల్ 'బరోజ్'.. ఏదో అనుకుంటే ఇంకేదో..
టెక్నికల్ గా బాగున్నా, డల్ గా సాగే మూవీ అంటూ రివ్యూస్ వచ్చాయి. మోహన్ లాల్ తన పాత్రలో ఒదిగిపోయారు. యాక్టింగ్ పరంగా ఎక్కడా తగ్గలేదు.
By: Tupaki Desk | 29 Dec 2024 4:59 AM GMTమాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ రీసెంట్ గా బరోజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాను మోహన్ లాల్ దర్శకత్వం వహిస్తూ యాక్ట్ చేశారు. షూటింగ్ ఎప్పుడో మొదలు కాగా.. కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన థియేటర్లో విడుదలైంది.
మొత్తం త్రీడీ టెక్నాలజీతో రూపొందిన బరోజ్ ను మోహన్ లాల్ సొంత సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరంబవూర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. మలయాళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో విడుదల బాధ్యతలు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుంది.
అయితే రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ తో మేకర్స్.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశారు. హాలీవుడ్ స్థాయిలో మూవీ ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయేలా చేశారు. సినిమాలో అదిరిపోయే రీతిలో విజువల్స్ ఉండనున్నాయని క్లారిటీ ఇచ్చారు. దీంతో డైరెక్టర్ గా మోహన్ లాల్ డెబ్యూతో హిట్ కొడతారని సినీ ప్రియులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
టెక్నికల్ గా బాగున్నా, డల్ గా సాగే మూవీ అంటూ రివ్యూస్ వచ్చాయి. మోహన్ లాల్ తన పాత్రలో ఒదిగిపోయారు. యాక్టింగ్ పరంగా ఎక్కడా తగ్గలేదు. విజువల్స్ పరంగా మోహన్ లాల్ తన విజన్ తో అద్భుతంగా మూవీని ప్రజెంట్ చేశారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉండగా.. ప్రొడక్షన్ విషయంలోనూ ఎక్కడా మేకర్స్ రాజీపడలేదు.
కానీ స్టోరీ పరంగా మాత్రం బరోజ్ ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. సినిమా అంతా చాలా స్లోగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఓవరాల్ గా హిట్ ట్రాక్ ఎక్కలేకపోయింది. రూ.80 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇప్పటివరకు రూ.10 కోట్ల మార్క్ ను కూడా క్లాస్ చేయలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారే అవకాశం కనిపిస్తోంది.
అయితే బరోజ్.. అన్ని భాషల్లో రూ.3.40 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. ఆ తర్వాత వసూళ్లు పడిపోయాయి. రెండో రోజు రూ.1.60 కోట్లు రాబట్టగా.. మూడో రోజు రూ.1.11 కోట్లను వసూలు చేసింది. మూడు రోజులకు గాను రూ.6.11 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దీంతో సినిమాకు నష్టాలు రావడం పక్కా. మొత్తానికి మోహన్ లాల్ కు డైరెక్టర్ గా డెబ్యూ మూవీతో నిరాశ ఎదురైంది.