Begin typing your search above and press return to search.

జర్నలిస్టును కొట్టిన కేసులో మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్

సీనియర్ నటుడు మోహన్ బాబు గత కొన్ని రోజులుగా ఒక కేసు కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Feb 2025 7:15 AM GMT
జర్నలిస్టును కొట్టిన కేసులో మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్
X

సీనియర్ నటుడు మోహన్ బాబు గత కొన్ని రోజులుగా ఒక కేసు కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన వివాదంతో ఆయనపై యత్యాయత్నం కేసు నమోదైంది. ఓ జర్నలిస్టుపై మైక్‌తో దాడి చేసినట్టు ఆరోపణలు రావడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ నిరాకరణ ఎదురైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయనకు, ఎట్టకేలకు ఊరట లభించింది.

గత ఏడాది డిసెంబర్ 10న జరిగిన ఈ ఘటనలో.. హైదరాబాద్‌లోని జల్ పల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసం వద్ద ఓ జర్నలిస్టుతో వివాదం ఏర్పడింది. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆరోపిస్తూ మోహన్ బాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫిర్యాదును పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేయడంతో, పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు ముందుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఈ దరఖాస్తును తిరస్కరించింది. దీంతో, ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో మోహన్ బాబు అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా, మోహన్ బాబు తన వాదనలు వినిపించారు. తాను కావాలని జర్నలిస్టుపై దాడి చేయలేదని, కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా వివాదం తలెత్తిందని స్పష్టం చేశారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయని, తాను ఆ జర్నలిస్టుకు నష్టపరిహారం చెల్లించేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఇదిలా ఉంటే, మోహన్ బాబు కుటుంబంలో గత కొంతకాలంగా అంతర్గత వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఆయన తనయుడు మంచు మనోజ్‌తో ఆయనకున్న విభేదాలు వెలుగులోకి వచ్చాయి. సంక్రాంతి సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీలో జరిగిన ఉదంతం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇరు వర్గాల బౌన్సర్లు గొడవకు దిగడంతో, అక్కడ భారీగా ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం మోహన్ బాబు పరువు నష్టం కేసు నుంచి బయటపడినప్పటికీ, కుటుంబం నుంచి బయటకొచ్చిన వివాదాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇకపోతే, ముందస్తు బెయిల్ లభించినప్పటికీ, విచారణ కొనసాగనుంది. ఈ కేసుపై ఇంకా కీలకమైన పరిణామాలు వెలుగు చూడనున్నాయి.