Begin typing your search above and press return to search.

చిరు వ్యాఖ్యలపై మోహన్ బాబు స్పందిస్తాడా?

ఐతే కాల క్రమంలో వజ్రోత్సవాల వివాదాన్ని అందరూ మరిచిపోయారు.

By:  Tupaki Desk   |   29 Oct 2024 10:30 PM GMT
చిరు వ్యాఖ్యలపై మోహన్ బాబు స్పందిస్తాడా?
X

2007లో తెలుగు సినిమా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి కానీ.. చివర్లో ఓ వివాదం తెలుగు ఫిలిం ఇండస్ట్రీని కుదిపేసింది. మెగాస్టార్ చిరంజీవికి ‘లెజెండ్’ అనే బిరుదు ఇచ్చి సన్మానించడం, తనకు ‘సెలబ్రెటీ’ అనే బిరుదుతో సన్మానం చేయడం పట్ల దిగ్గజ నటుడు మోహన్ బాబు అభ్యంతరం వ్యక్తం చేయడం.. దీని మీద చిరు బాధ పడి ‘లెజెండ్’ గౌరవాన్ని తిరస్కరించడం.. దీంతో మొత్తంగా వాతావరణం గంభీరంగా మారడం తెలిసిందే. మంచి స్నేహితులుగా ఉన్న చిరు, మోహన్ బాబు మధ్య ఆ సమయంలో దూరం పెరిగింది. తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసినా ఒకప్పటి స్థాయిలో అయితే సన్నిహితంగా లేరు. ఐతే కాల క్రమంలో వజ్రోత్సవాల వివాదాన్ని అందరూ మరిచిపోయారు. కానీ తాజాగా ఏఎన్నార్ అవార్డును స్వీకరించిన సందర్భంగా చిరు ఈ వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు తనకు అర్హత లేదని, ఇంట గెలవలేదనే ఉద్దేశంతో ‘లెజెండ్’ అవార్డును తిరస్కరించానని.. కానీ ఇప్పుడు ఏఎన్నార్ అవార్డును స్వీకరించడం ద్వారా తాను ఇంట గెలిచినట్లు భావిస్తున్నానని చెప్పాడు.

ఈ వ్యాఖ్యలతో మళ్లీ అందరూ వజ్రోత్సవ వేడుకల వివాదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మోహన్ బాబు, చిరు ప్రసంగాల వీడియోలు మళ్లీ తవ్వి తీస్తున్నారు. సోషల్ మీడియాలో అవి తిరుగుతున్నాయి. చిరు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో మోహన్ బాబు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరం. మోహన్ బాబు అయితే ఏఎన్నార్ అవార్డు వేడుకకు హాజరు కాలేదు. ఆయన సినిమాలు తగ్గించేశారు. మీడియాకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ శివార్లకు మకాం మార్చేయడం వల్ల సినిమా కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. ఐతే చిరు వ్యాఖ్యల మీద స్పందించాలనుకుంటే వీడియో బైట్ లాంటిది ఇస్తే ఇవ్వచ్చు. లేదా ‘కన్నప్ప’ ప్రమోషన్ల టైంలో ప్రమోషన్లకు వచ్చినపుడు మీడియా వాళ్లు దీని గురించి అడిగినా అడగొచ్చు. మరి కొంచెం ఆవేశంగా మాట్లాడే మోహన్ బాబు.. చిరుకు కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తారా, పాత వివాదాన్ని ఇప్పుడు కెలుక్కోవడం ఎందుకని శాంతంగా స్పందిస్తారా అన్నది చూడాలి.