ఎన్నికల వేళ మోడీపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా 72వ పడిలో అడుగుపెట్టారు. మార్చి 19న ఆయన తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
By: Tupaki Desk | 20 March 2024 6:10 AM GMTకలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా 72వ పడిలో అడుగుపెట్టారు. మార్చి 19న ఆయన తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు యూనివర్శిటీ (ఎంబీయూ) 32వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ప్రధానంగా రాజకీయాలు, ఎవరికి ఓటు వేయాలి, ఎవరు దేశానికి అవసరమైన నాయకుడు వంటి విషయాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్ గా మారాయి.
అవును... ఏది మాట్లాడిన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారనే పేరున్న నటుడు, నిర్మాత, విద్యాసంస్థల అధినేత, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఒక ఇడ్లీ తింటే చాలు అనుకున్న నాటి రోజులు తనకు ఇంకా గుర్తున్నాయని తెలిపిన ఆయన... మనిషికి క్యారెక్టర్ చాలా ముఖ్యమని తెలిపారు. ఈ సందర్భంగా అంతకంటే ముందు మనోజ్ మాట్లాడిన మాటలను ప్రస్థావిస్తూ.. రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... ఓటు కోసం అందరూ ఎర వేస్తారు.. ఈ సమయంలో రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడను కానీ... వచ్చే ఎన్నికల్లో దేశంలో మాత్రం మళ్లీ ప్రధానిగా మోడీనే రావాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో... తాను మోడీని ఎన్నో సందర్భాల్లో కలిసినట్లు గుర్తుచేసుకున్న ఎంబీ... అలాంటి వ్యక్తి ఆలోచనలు, విధానాలు భారతదేశానికి అవసరమని అన్నారు. ఇదే క్రమంలో... ఎన్నికల్లో ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని మోహన్ బాబు సూచించారు.
ఇదే క్రమంలో ఎన్నికల్లో ఇరుపక్షాల వారూ డబ్బులు ఇస్తారని.. ఆ డబ్బు మనదే అని.. లంచాలు తీసుకున్న మనడబ్బే మనకు ఎన్నికల వేళ ఓట్ల కోసం ఇస్తారని.. ఆ డబ్బు తీసుకోండని.. కానీ ఓటు మాత్రం నచ్చిన వారికే వేసి భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్లడానికి సహకరించాలని.. అందువల్ల ఆలోచించి ఓటు వేయండని మోహన్ బాబు సూచించారు.
కాగా... ఇటీవల ఆన్ లైన్ వేదికగా ఒక లేఖ విడుదల చేసిన మోహన్ బాబు... రాజకీయంగా కొంతమంది తన పేరు వాడుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దయచేసి ఏ పార్టీవారైనా సరే తన పేరును వారి వారి స్వప్రయోజనాల కోశం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చేతనైతే నలుగురికి సాయం చేయడంపై దృష్టిపెట్టాలి కానీ... సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరమని తెలిపారు!