కాంగ్రెస్ పై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు... అయోధ్యకు వెళ్లడం లేదు!
ఏమి మాట్లాడినా ముక్కు సూటిగా మాట్లాడతారనే పేరు ఉన్న విలక్షణ నటుడు మోహన్ బాబు ఇటీవల ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Jan 2024 11:20 AM GMTఏమి మాట్లాడినా ముక్కు సూటిగా మాట్లాడతారనే పేరు ఉన్న విలక్షణ నటుడు మోహన్ బాబు ఇటీవల ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఈ ఫిల్మ్ నగర్ టెంపుల్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరగుతున్న నేపథ్యంలో ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో జనవరి 14 నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 22 వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు... చిత్ర పరిశ్రమకు ఏం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని.. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం అలా కట్టినదేనని, చిత్రపురి కాలనీని అలానే వచ్చిందని తెలిపారు!
ఈ సందర్భంగా ఫిల్మ్ నగర్ టెంపుల్ ఔనత్యాన్ని మోహన్ బాబు వెల్లడించారు. ఇందులో భాగంగా... ఈ దేవాలయంలో 18 మూర్తులు, 15 మంది బ్రాహ్మణోత్తములున్నారని.. ఈ దైవ సన్నిధానంలో కోరిన కోరికలన్నీ తీరుతున్నాయని ఎంతోమది చెప్పారని.. తిరుపతి వెంకటేశ్వర స్వామి, సాయి బాబా, శ్రీరాముడు, లక్ష్మీనరసింహస్వామి.. ఇలా 18 మంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారని అన్నారు.
ఇదే సమయంలో... ఇది సినిమా దేవాలయం కాదని నొక్కి వక్కానించిన మోహన్ బాబు.. ఇక్కడ జరిగే కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే అని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి కోసం కమిటీ ఎంతగానో కృషి చేస్తున్నారని.. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని.. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో... ఈ నెల 22న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి ఊరూ వాడా తరలివెళ్తున్నారని చెప్పిన మోహన్ బాబు... తనకు కూడా ఆహ్వానం అందిందని తెలిపారు. అయితే రద్దీతో పాటు కొన్ని చెప్పుకోలేని కారణాల వల్ల తాను వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు! అయితే తన మనసంతా అక్కడే ఉందని.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్తున్న తన అభిమానులకు తనవంతు సహాయం చేసినట్లు తెలిపారు మోహన్ బాబు!