Begin typing your search above and press return to search.

ది వన్ అండ్ ఓన్లీ కలెక్షన్స్ కింగ్..!

హీరోగా సక్సెస్ అవ్వడమే కాదు నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు.

By:  Tupaki Desk   |   19 March 2024 2:12 PM GMT
ది వన్ అండ్ ఓన్లీ కలెక్షన్స్ కింగ్..!
X

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. ఆయన డైలాగ్ చెబితే థియేటర్ దద్దరిల్లి పోవాల్సిందే. క్రమశిక్షణకు మారుపేరు గా మారిన ఆయన ముందు చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత నెగిటివ్ రోల్స్ లో మెప్పించి ఆ క్రేజ్ తో లీడ్ రోల్స్ సంపాదించారు. హీరోగా మోహన్ బాబుకి ఉన్న స్టైలే వేరు. హీరోగా సక్సెస్ అవ్వడమే కాదు నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు.


మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. ఆయన చిత్తూరు జిల్లా లో మంచు నారాయణ స్వామి, లక్ష్మమ్మలకు జన్మించారు. మోహన్ బాబు తండ్రి నారాయణ స్వామి స్కూల్ టీచర్ గా చేస్తుండే వారు. పెద్ద కొడుకు అవడం వల్ల కుటుంబ బాధ్యత మీద వేసుకున్న మోహన్ బాబు చెన్నై వెళ్లి అక్కడ వై.ఎం.సి.ఏ కాలేజ్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ స్ట్రక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత అది నచ్చక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

దాసరి నారాయణ రావు మోహన్ బాబుని ముందు స్క్రిప్ట్ అసిస్టెంట్ గా పెట్టుకున్నారు. అప్పటికే అల్లూరి సీతారామరాజు, కన్నవారి కలలు సినిమాల్లో చిన్న వేషం వేశారు మోహన్ బాబు. అయితే దాసరి నారాయణ రావు చేసిన స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబుకి అవకాశం ఇచ్చారు. అది సక్సెస్ అవ్వడంతో వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చారు. కామెడీ విలన్ గా సూపర్ సక్సెస్ అయిన మోహన్ బాబు లీడ్ రోల్ కి ప్రమోట్ అయ్యారు.

ఓ పక్క లీడ్ రోల్ లో చేస్తూనే సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ వచ్చారు. తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో దాసరి దృష్టిని ఆకర్షించిన మోహన్ బాబు ఆయన ప్రియ శిష్యుడిగా మారి ఆయనతో చాలా సినిమాలు చేశారు. అంతేకాదు భక్తవత్సలం నాయుడిగా ఉన్న పేరును మోహన్ బాబుగా దాసరి గారు మార్చారు. విలన్ నుంచి హీరోగా మారి అక్కడ సక్సెస్ అందుకున్న మోహన్ బాబు ఆ తర్వాత లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అంటూ సొంత బ్యానర్ నిర్మించి అందులోనూ సక్సెస్ అయ్యారు.

ఓ పక్క సినిమాల్లో నటిస్తూ మరో పక్క సినిమాలు నిర్మిస్తూ హీరో కమ్ ప్రొడ్యూసర్ గా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవరు క్రియేట్ చేయని రికార్డుని తన సొంతం చేసుకున్నారు మోహన్ బాబు. దాదాపు 40కి పైగా సినిమాలు నటించి నిర్మించిన ఏకైక హీరో ఆయనే. ఇప్పటికీ ఆ రికార్డు ఆయన పేరు మీదే ఉండటం విశేషం.

మంచు మోహన్ బాబు సూపర్ హిట్ సినిమాల్లో అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, ఎం ధర్మరాజు ఎం.ఏ, మేజర్ చంద్రకాంత్, బ్రహ్మ, కుంతి పుత్రుడు లాంటి సినిమాలు ఉన్నాయి. హీరోగా కాస్త వెనుకపడ్డ మోహన్ బాబు మళ్లీ స్పెషల్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నారు. తెలుగులోనే కాదు తమిళ సినిమాల్లో కూడా నటించారు. ఇప్పటివరకు మంచు మోహన్ బాబు 500 పైగా సినిమాల్లో నటించారు. మంచు మోహన్ బాబు నట వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ లతో పాటుగా మంచు లక్ష్మి కూడా సినీ తెరంగేట్రం చేశారు.

నటుడిగా నిర్మాతగా రాణించిన మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ అనే స్కూల్ ని స్థాపించి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నారు. ప్రస్తుతం మంచు మోహన్ బాబు మంచు విష్ణు నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు. భక్త కన్నప్ప కథతో వస్తున్న కన్నప్ప సినిమాలో మోహన్ బాబు మరోసారి తన సత్తా చాటనున్నారు. స్వయంకృషితో ఎదిగిన ఆయన ప్రతిభ తన ఆయుధంగా.. క్రమశిక్షణ తన బలంగా చేసుకుంటూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్న పాత్రలు వేస్తూ వచ్చి గొప్ప నటుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.నేడు 72వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది తుపాకి.కామ్.