Begin typing your search above and press return to search.

'అమ్మ' సంఘానికి అధ్య‌క్షుడు మోహ‌న్ లాల్ రాజీనామా

న‌టీమ‌ణులంతా మీడియా ముందుకొచ్చి లైంగిక దాడుల‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Aug 2024 12:05 PM GMT
అమ్మ సంఘానికి అధ్య‌క్షుడు మోహ‌న్ లాల్ రాజీనామా
X

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ సమర్పించిన నివేదిక దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న‌టీమ‌ణులంతా మీడియా ముందుకొచ్చి లైంగిక దాడుల‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌(అమ్మ) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వికి సిద్దిఖీ ఇప్ప‌టికే రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా అధ్య‌క్షుడిగా కొన‌సాగుతోన్న మోహన్‌లాల్ కూడా రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆయనతో పాటు 17 మంది సభ్యులు కూడా పదవుల నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని 'అమ్మ' సంఘం అధికారికంగా ప్ర‌క‌టించింది.

అయితే కమిటీలోని కొంతమంది సభ్యులపైనే లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని, అందులో భాగంగానే నైతిక బాధ్యతగా వీళ్లందరూ రాజీనామా చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ మూకుమ్మడి రాజీనామాల వల్ల మలయాళ చిత్రమండలిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త పాలక మండలిని రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.

'అమ్మ' సంఘుంలో సభ్యులు వీరే. ఇప్పటివరకు 'అమ్మ' సంఘానికి మోహన్‌లాల్ అధ్యక్షత వహించగా, నటులు జయన్‌ చేర్తలా, జగదీశ్‌, బాబురాజ్‌, సూరజ్‌ వెంజారమూడు, టొవినో థామస్‌, కళాభవన్‌ షాజన్‌ తదితరులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. అయితే జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక తర్వాత డైరెక్టర్ రంజిత్‌, నటులు సిద్ధిఖీ, జయసూర్య, బాబురాజ్‌, ముకేశ్‌, సూరజ్‌ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.