మన హీరోల్లో ఎవరైనా ఇలా ఉంటారా..!
అయ్యప్ప స్వామిని దర్శించుకున్న సమయంలో మోహన్ లాల్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
By: Tupaki Desk | 19 March 2025 2:01 PM ISTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇటీవల శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆయన కాలి నడకన శబరిమల సన్నిధానం చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. మలయాళ స్టార్స్ కాలినడకన శబరిమల అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడం అరుదుగా చూస్తూ ఉంటాం. త్వరలో మోహన్ లాల్ తన ఎల్ 2 సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ విషయాన్ని మోహన్ లాల్ చెప్పుకొచ్చారు. ఎల్ 2 సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ తాను అయ్యప్పను దర్శించుకున్నట్లు తెలియజేశాడు.
అయ్యప్ప స్వామిని దర్శించుకున్న సమయంలో మోహన్ లాల్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పుడే తన కుటుంబ సభ్యులతో పాటు తన ఆప్త మిత్రుడు మమ్ముట్టీ పేరు మీద పూజ చేయించాడట. మమ్ముట్టీ అసలు పేరు మహ్మద్ కుట్టి పేరు చెప్పడంతో పాటు, ఆయన నక్షత్రం విశాఖ అని చెప్పి ప్రత్యేకంగా పూజ చేయించాడు. మమ్ముట్టీ ఆరోగ్యం గత కొన్నాళ్లుగా బాగుండటం లేదనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మోహన్ లాల్ శబరిమల అయ్యప్ప సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించడం చర్చనీయాంశం అయింది. మోహన్ లాల్, మమ్ముట్టీ ల మధ్య స్నేహం ఇప్పటిది కాదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వీరి స్నేహం కొనసాగుతూ ఉంటుంది.
వీరిద్దరు కలిసి నటించడంతో పాటు, ఎన్నో కార్యక్రమాలకు కలిసి హాజరు కావడం మనం చూస్తూ ఉంటాం. ఎన్నో సార్లు వీరిద్దరూ ఒకరి గురించి ఒకరు గొప్పగా మాట్లాడుకోవడం మనం చూశాం. ఇప్పుడు మోహన్ లాల్ ఏకంగా శబరిమల అయ్యప్ప సన్నిదిలో మమ్ముట్టీ పేరు మీద ప్రత్యేక పూజలు చేయించడం ద్వారా ఇద్దరి మధ్య ఎంతటి గొప్ప అనుబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మలయాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది. మోహన్ లాల్, మమ్ముట్టీని మరోసారి వెండి తెరపై కలిపి చూడాలని చాలా మంది ఆశ పడుతున్నారు. అది ఎప్పటికి సాధ్యం అనేది చూడాలి.
టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు ఎప్పుడో ఒక సారి స్టేజ్ షేర్ చేసుకోవడం గొప్ప విషయం. సీనియర్ స్టార్ హీరోల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుందని అంతా అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే మన తెలుగు హీరోల్లో ఎవరైనా మరో హీరో గురించి అలా దేవాలయానికి వెళ్లిన సమయంలో ప్రత్యేక పూజలు చేయిస్తారా అంటే కచ్చితంగా డౌటే అనే సమాధానం వస్తుంది. సీనియర్ హీరోలు మాత్రమే కాకుండా యంగ్ హీరోలు సైతం మలయాళ సినిమా ఇండస్ట్రీలో చాలా స్నేహంగా ఉంటారు. సూపర్ స్టార్ మోహన్ లాల్, మెగాస్టార్ మమ్ముట్టీ మధ్య ఉండే స్నేహంను చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుందని చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. పలు సందర్భాల్లో మమ్ముట్టీ సైతం తనకు మోహన్ లాల్‌పై ఉన్న అభిమానంను చాటుకున్న విషయం తెల్సిందే.