క్రిస్మస్ కానుకగా సూపర్ స్టార్ మూవీ..!
ఈ సినిమాను 3డిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.
By: Tupaki Desk | 30 Nov 2024 6:20 PM GMTమలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన 'బరోజ్' విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఎట్టకేలకు సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. బరోజ్ సినిమా పూర్తిగా పిల్లల ఫాంటసీ సినిమాగా మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. 'బరోజ్ : గార్డియన్ ఆఫ్ ది గామాస్ ట్రెజర్ అనే నవల కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు మోహన్‌లాల్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాను 3డిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.
పున్నూస్ స్క్రీన్‌ప్లే అందించిన ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కి దాదాపు ఏడాది సమయం పట్టింది. 2019లో ఈ సినిమాను మోహన్‌లాల్ ప్రకటించారు. ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఎక్కువ సమయం తీసుకుంది. షూటింగ్ ఎక్కువ శాతం గ్రీన్ మ్యాట్ పై షూట్ చేయడం జరిగిందట. ఈ సినిమాను భారీ మొత్తంతో నిర్మించారు. కోవిడ్ కారణంగా మొదటి సారి ఆలస్యం అయిన ఈ సినిమా తర్వాత పలు సార్లు వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఆలస్యం కావడంతో వాయిదా వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో మోహన్ లాల్ నటించిన పలు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల అయ్యాయి.
సూపర్ స్టార్ మోహన్ లాల్ వంటి పెద్ద హీరో పిల్లల కోసం సినిమా చేయడం చాలా పెద్ద విషయం. అది కూడా 3డిలో చేయడం చాలా గొప్ప విషయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2019 నుంచి మోహన్ లాల్ నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆయన ఫ్యాన్స్ తో పాటు, పాన్ ఇండియా సినీ వర్గాల వారు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా కేవలం మలయాళంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లోనూ విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
సౌత్‌లోని అన్ని భాషలతో పాటు, హిందీ, ఇంగ్లీష్‌లోనూ సినిమా విడుదల చేస్తామని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఎక్కడా రాజీ పడకుండా హాలీవుడ్ రేంజ్‌లో చేయించారు. 3డి వర్క్ సైతం హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సూపర్ స్టార్ మోహన్ లాల్ బరోజ్ మూవీ పిల్లలతో పాటు పెద్దలకు నచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. తెలుగులో మోహన్‌లాల్‌కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుందనే వార్తలు వస్తున్నాయి.