ఆ సినిమా విషయంలో సూపర్ స్టార్ ఆవేదన
మోహన్ లాల్ కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ సినిమా ఫ్లాప్ పై మోహన్‌లాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
By: Tupaki Desk | 20 Dec 2024 11:30 PM GMTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ ఏడాది ఆరంభంలో 'మలైకోట్టై వాలిబన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా విడుదలకు రెండు మూడు నెలల ముందు నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. దాదాపుగా వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. మోహన్ లాల్ కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ సినిమా ఫ్లాప్ పై మోహన్‌లాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఏ సినిమా చేసినా, ఏ కథకి ఓకే చెప్పినా ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ని మెప్పించే విధంగా ఉంటుందా అని ఆలోచిస్తాం. మొదట మనకు నచ్చిందా, ఆ నచ్చిన కథ ప్రేక్షకుల ముందుకు వెళ్లిన సమయంలో స్పందన ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తాం. ప్రతి సినిమాను నూటికి నూరు శాతం మెప్పిస్తుందనే నమ్మకంతో చేస్తాం. కానీ సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తాయి. ప్రతి సినిమా ఫ్లాప్‌కి హీరోను బాధ్యుడిని చేస్తారు. కేవలం నటుడి వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది అంటూ చెప్పే వారు చాలా మంది ఉన్నారు. హీరోల కథల ఎంపిక విషయంలో తప్పు జరిగింది అంటూ విశ్లేషకులు సైతం అంటారని మోహన్‌లాల్ పేర్కొన్నారు.
మలైకోట్టై వాలిబన్ సినిమా కథ నా మనసుకు నచ్చడంతోనే చేసేందుకు ఒప్పుకున్నాను. కథను చాలా నమ్మడం వల్లే భారీ బడ్జెట్‌తో చేశాం. సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని చేస్తే ఫలితం తారు మారు అయ్యింది. ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించక పోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ సినిమా ఫ్లాప్ నా కంటే నా అభిమానులకు ఎక్కువ నిరాశను కలిగించింది. వారు సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూశారు, చాలా అంచనాలు పెట్టుకుని ఎదురు చూసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి కోసం మరో మంచి సినిమా చేయడం కోసం ఎదురు చూస్తున్నాను.
మోహన్ లాల్ నటించి దర్శకత్వం వహించిన 'బరోజ్ 3డి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ పిల్లల మూవీపై మోహన్‌లాల్ చాలా నమ్మకంగా ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా కోసం మోహన్‌లాల్ చాలా కాలంగా కష్టపడుతున్నారు. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సినిమా చాలా ఆలస్యం అయ్యింది. ఆకట్టుకునే అంశాలతో పాటు విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుంది అంటూ తాజా ప్రమోషనల్ ఈవెంట్‌లో మోహన్‌లాల్ పేర్కొన్నారు.