తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో మోహన్ లాల్!
మలయాళం నటుడు మోహన్ లాల్ అస్వస్తతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం రావడంతో కొచ్చిలోని అమృతా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు
By: Tupaki Desk | 18 Aug 2024 10:57 AM GMTమలయాళం నటుడు మోహన్ లాల్ అస్వస్తతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం రావడంతో కొచ్చిలోని అమృతా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆయనకు శ్వాసకోశ ఇన్పెక్షన్ కూడా ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. దీంతో వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించినట్లు ఆసుపత్రి అధికారులే వెల్లడించారు.
రద్దీ ప్రదేశాలతోపాటు షూటింగ్స్ కు కొన్నిరోజులపాటు దూరంగా ఉండాలని మెడికల్ బులెటిన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, మోహన్ లాల్ కోలుకుంటున్నారని మెడికల్ బులెటిన్ పేర్కొంది.
మోహన్‌లాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్త తెలియగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. `బరోసిన్` పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసి కొచ్చికి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు జ్వరం వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇక మోహన్ లాల్ సినిమాల కోసం ఎంతగా శ్రమిస్తారో చెప్పాల్సిన పనిలేదు. మూడు షిప్టులు పనిచేసే నటుడాయన. ఏడాదికి కనీసం ఆరేడు సినిమాలైనా రిలీజ్ చేస్తుంటారు. అవిగాక ఇతర భాషల్లో కీలక పాత్రలు పోషిస్తుంటారు. నాలుగేళ్లగా తెలుగు సినిమాలు కూడా ఎక్కువగా చేస్తున్నారు. దీంతో మోహన్ లాల్ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం మోహన్ లాల్ ఎంపురాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు.