ఆ ప్రాజెక్ట్ భవితవ్యం బాలయ్య చేతిలోనే ఉందా?
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Dec 2024 8:30 PM GMTనందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 'హను-మాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా నటసింహం వారసుడి ఎంట్రీ ఉంటుందని ప్రకటించారు. మోక్షు పుట్టినరోజు సందర్భంగా ఓ స్టైలిష్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. 'సింబా వస్తున్నాడు' అంటూ దర్శకుడు అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ వచ్చాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని భావిస్తుండగా.. అసలు ఈ సినిమా ఉంటుందో లేదో అనే రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రశాంత్ వర్మ - మోక్షజ్ఞ సినిమాని డిసెంబర్ 4వ తేదీనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించాలని అనుకున్నారు. దీనికి బాలయ్యే ముహూర్తం నిర్ణయించారట. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ, అనివార్య కారణాల వల్ల ముందుగా అనుకున్న తేదీకి ఈ చిత్రానికి క్లాప్ కొట్టలేకపోయారు. దీంతో ఈ సినిమా అటకెక్కిందనే ప్రచారం మొదలైంది. ఈ మూవీకి ఆదిలోనే పుల్ స్టాప్ పడిందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, కచ్చితంగా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా ఉంటుందా లేదా? అనే చర్చలు జరుగుతున్నాయి.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ ప్లాన్ చేయబడింది. మోక్షుని దృష్టిలో పెట్టుకునే ప్రశాంత్ ఈ కథను సిద్ధం చేశారట. అంతేకాదు బాలకృష్ణ కోసం ఓ స్పెషల్ క్యారెక్టర్ ను కూడా డిజైన్ చేశాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని అంటున్నారు. ఓపెనింగ్ కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు చేయగా.. సడన్‌గా ముహూర్తం కాన్సిల్ అయ్యింది. దీంతో చిత్ర బృందం విలువైన సమయం, డబ్బు వృధా అయ్యాయి. అయితే హీరోకి ఒంట్లో బాగా లేకపోవడం వల్లనే ఈ సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడిందని బాలయ్య తెలిపారు.
ఇటీవల కాకినాడలో ఓ ఆభరణాల షోరూం ఓపెనింగ్ లో పాల్గొన్న బాలకృష్ణ.. ఈ సందర్భంగా మోక్షజ్ఞ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. రెండు రోజులుగా కుమారుడికి ఒంట్లో బాగాలేదని, అయినా సరే కొబ్బరికాయ కొడదామని అనుకున్నామని, కానీ ముందు రోజు రాత్రి ఫ్లూ ఎక్కువ అవ్వడంతో ఓపెనింగ్ పోస్ట్ పోన్ చేశామని తెలిపారు. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలని అన్నారు. మోక్షజ్ఞకి ప్రజల ఆశీస్సులు, అభిమానుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. బాలయ్య చెప్పిన తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
'హనుమాన్' తర్వాత దానికి సీక్వెల్ గా 'జై హనుమాన్' చిత్రాన్ని ప్రకటించిన ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చెయ్యాల్సిన ఈ ప్రాజెక్ట్ చేతిదాకా వచ్చి క్యాన్సిల్ అయింది. దర్శక హీరోల మధ్య వచ్చిన సృజనాత్మక విబేధాలే దీనికి కారణమని టాక్ నడిచింది. అయితే నందమూరి వారసుడి డెబ్యూ మూవీ చేతికి రావడంతో ఆ విషయాన్ని అంతా మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా ఉంటుందో లేదో అనే పుకార్లు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే, బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమా క్యాన్సిల్ అవ్వడం అనేది ఏ దర్శకుడికైనా నిరుత్సాహానికి గురి చేసే విషయమే. ఆయన కష్టమంతా వృథాగా పోయినట్లే అవుతుంది.
అయితే ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌పై బాలకృష్ణ చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మంచి సబ్జెక్ట్ అవ్వడంతో దాన్ని వదులుకోడానికి ఆయన సిద్ధంగా లేరని అంటున్నారు. కాకపోతే బాలయ్య సెంటిమెంట్లు, ముహూర్త బలాన్ని బాగా నమ్ముతుంటారనే సంగతి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇప్పుడు తనయుడి డెబ్యూ కోసం అనుకున్న ముహూర్తానికి కొబ్బరికాయ కొట్టలేదు. మరి బాలయ్య త్వరలో మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్ కోసం మరో ముహూర్తం చూస్తారా? లేదా ఈ సినిమాని తర్వాత ఎప్పుడైనా చేద్దామని పక్కన పెడతారా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో డిస్కషన్లు చేసుకుంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో!