ముంబైలో అడుగుపెడుతున్న కుంభమేళా సెన్సేషన్ మోనాలిసా
అయితే ఈ సంవత్సరం మహాకుంభోత్సవం ఇతర కారణాలతోను మార్మోగింది.
By: Tupaki Desk | 3 Feb 2025 7:46 AM GMT2025 మహాకుంభమేళా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రయాగ్ రాజ్-యూపీలో స్వామీజీలు, అఘోరీలు, భక్తజన కోటిని మీడియా హైలైట్ చేసింది. అయితే ఈ సంవత్సరం మహాకుంభోత్సవం ఇతర కారణాలతోను మార్మోగింది. ఇండోర్‌కు చెందిన 16 ఏళ్ల పూసల దండల సేల్స్ గర్ల్ మోనాలిసా భోంస్లే తన అందచందాలు, ఆకర్షణ కారణంగా సంచలనంగా మారింది. పూసల దండల అమ్మాయి ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారింది. మోనాలిసా బోయ్స్ కలల రాణిగా గుండెల్లో నిదురించింది. తనతో సెల్ఫీలు, ఫోటోల కోసం జనం ఎగబడ్డారు. దీంతో అర్థాంతరంగా కుంభమేళాలో తన వ్యాపారాన్ని వదిలేసి ఇండోర్‌కి వెళ్లాల్సి వచ్చింది.
తమ జీవనోపాధి సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది మోనాలిసా.. ఆమె కుటుంబం. ఇక మోనాలిసా కుటుంబంలో తన సోదరీమణుల అందచందాల గురించి మీడియా ఆరాలు తీసింది. ప్రస్తుతం మోనాలిసా ప్రధాన మీడియా, యూట్యూబ్ చానెళ్ల ఇంటర్వ్యూలతో పెద్ద సెలబ్రిటీ హోదాను ఆస్వాధిస్తోంది. ఇంతలోనే పది రోజుల్లో 10 కోట్లు ఆర్జించింది అంటూ మోనాలిసాపై ప్రచారం సాగడం.. దానిని మోనాలిసా ఖండించడం తెలిసిన విషయాలే.
అనూహ్యంగా సెలబ్రిటీ కావడం తన జీవనోపాధికి గండి కొట్టిందని మోనాలిసా ఆవేదన చెందిన క్రమంలోనే తనకు సినిమా అవకాశాలు వచ్చాయని కూడా కథనాలొచ్చాయి. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా మోనాలిసాకు ఆఫర్ ఇచ్చారని సోషల్ మీడియాల్లో కథనాలొచ్చాయి. అలాగే ఈ నేచురల్ బ్యూటీకి ముంబై పరిశ్రమ ఆహ్వానం పలుకుతోందని ప్రచారం సాగింది. ఇటీవల దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసాకు తన సినిమాలో ఒక పాత్రను ఆఫర్ చేశారని కథనాలొచ్చాయి. సనోజ్ మిశ్రా .. ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్, రామ్ కీ జన్మభూమి వంటి చిత్రాలను తెరకెక్కించారు. `ది డైరీ ఆఫ్ మణిపూర్` చిత్రంలో నటించాల్సిందిగా మోనాలిసాకు అతడు ఆఫర్ ఇచ్చారని, అయితే మోనాలిసా దీనికి స్పందించలేదని కూడా కథనాలొచ్చాయి.
ఇంతలోనే మోనాలిసా తన ఇన్ స్టా వేదికగా ఒక పోస్టర్‌ని షేర్ చేసి, ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. దాని ప్రకారం....``ఈరోజు పోస్టర్ బయట, రేపు పోస్టర్ లోపల, ఇది కాలచక్రం.. త్వరలో ముంబైలో కలుద్దాం - మోనాలిసా`` అని రాసి ఉంది. పుష్పరాజ్ అల్లు అర్జున్ కనిపిస్తున్న పోస్టర్ వెలుపల మోనాలిసా ఫోటో దిగి కనిపిస్తోంది. బహుశా పోస్టర్ లో కనిపిస్తానని మోనాలిసా ఆశాభావం వ్యక్తం చేసింది. మొట్టమొదటిసారి మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలను అమ్ముతూ మోనాలిసా భోంస్లే కనిపించింది. రేపు పోస్టర్ గాళ్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. మోనాలిసా పెద్ద స్టార్ అవ్వాలని దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.