కుంభమేళా సెన్సేషన్.. పలక బలపం పట్టి బడికి ఛలో
అయితే మోనాలిసా గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. మోనాలిసా పూర్తిగా నిరక్షరాస్యురాలు. తాను ఏనాడూ స్కూల్ కి వెళ్లలేదు.
By: Tupaki Desk | 12 Feb 2025 12:30 PM GMTమహా కుంభమేళా- 2025 కేవలం సాధువులు, సాధు జీవితాన్ని, అఘోరాల్ని పరిచయం చేయడంలోనే కాదు, ప్రతిభావంతులను గుర్తించడంలోను సహకరించింది. ఈసారి కుంభమేళా సాక్షిగా మోనాలిసా భోంస్లే అనే పూసలమ్మే అమ్మాయిలో ప్రతిభను గుర్తించేలా చేసింది. కనీస అక్షర జ్ఞానం లేకపోయినా, తన తేనెకళ్ల అందంతో ప్రపంచాన్ని శాసించే సత్తా ఈ బ్యూటీకి ఉందని ప్రూవ్ చేస్తోంది.
యూనిక్ క్వాలిటీస్ తో అందరినీ ఆకర్షించిన మోనాలిసాను వెండితెరకు పరిచయం చేసేందుకు, నటనలో అవకాశాల్ని కల్పించేందుకు ఫిలింమేకర్స్ వెంటపడుతున్నారు. ఇటీవల ఓ కమర్షియల్ ప్రకటనలో నటించేందుకు అవకాశం అందుకున్న మోనాలిసా, `ది డైరీ ఆఫ్ మణిపూర్` అనే చిత్రంలో నటించేందుకు అవకాశం దక్కించుకుంది. బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పటికే మోనాలిసాను ముంబైకి పిలిచారు. అక్కడ తనకు అవసరమైన నటశిక్షణను ఇస్తున్నారని తెలిసింది. మధ్య ప్రదేశ్ ఇండోర్ నుంచి ముంబైకి వెళ్లి ఇప్పుడు మోనాలిసా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
అయితే మోనాలిసా గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. మోనాలిసా పూర్తిగా నిరక్షరాస్యురాలు. తాను ఏనాడూ స్కూల్ కి వెళ్లలేదు. తనకు కనీస అక్షర జ్ఞానం లేకపోవడంతో అది రంగుల ప్రపంచంలో సమస్యగా మారింది. అందుకే కనీసం ఇప్పుడు అయినా అక్షరాలు నేర్చుకోవాలనుకుంది. ప్రస్తుతం పలక బలపం పట్టుకుని పట్టుదలగా నేర్చుకునే పనిలో పడిందని తెలిసింది. దర్శకుడు తనోజ్ మిశ్రా స్వయంగా మోనాలిసాకు అక్షరాలు నేర్పించే పనిలో పడ్డారు. మోనాలిసా పలక బలపం పట్టుకుని అక్షరాలు రాసేందుకు సిద్ధమైన వీడియోని కూడా ఆయన షేర్ చేసారు. చూస్తుండగానే మోనాలిసా జాతకం మారిపోతోంది. ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారి మీడియా దృష్టిని ఆకర్షించిన ఈ భామపై ప్రతిరోజూ ఏదో ఒక కొత్త కథనం వెలువడుతూనే ఉంది.