Begin typing your search above and press return to search.

నెలల వారీగా అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాలు ఇవే!

ఈరోజుకి టాలీవుడ్ లో నెలల వారీగా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

By:  Tupaki Desk   |   2 Nov 2024 9:45 AM GMT
నెలల వారీగా అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాలు ఇవే!
X

ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయి. అన్ని భాషల్లోనూ వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. 'బాహుబలి 2' ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించగా.. 'ఆర్.ఆర్.ఆర్', 'కల్కి 2898 ఏడీ' లాంటి సినిమాలు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. అయితే రికార్డులు అనేవి శాశ్వితం కాదు.. ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంటాయి. ఈరోజుకి టాలీవుడ్ లో నెలల వారీగా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

జనవరి నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా 'హను-మాన్' నిలిచింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో రూపొందిన ఈ చిత్రం.. 2024 సంక్రాంతికి విడుదలై, బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల గ్రాస్ రాబట్టింది. అప్పటి వరకూ ఉన్న 'అల వైకుంటపురములో' (2020) రికార్డును బ్రేక్ చేసింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లా నాయక్' (2022) మూవీ రూ. 97 కోట్ల షేర్ తో ఫిబ్రవరిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా నటించిన RRR సినిమా ఎలాంటి హిట్టు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2022లో వచ్చిన ఈ మల్టీస్టారర్.. మార్చి సినిమాలలో టాప్ ప్లేస్ సాధించింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి తీసిన 'బాహుబలి 2' (2017) ఏప్రిల్ నెలలో అధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 2022 సమ్మర్ లో వచ్చిన మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట'.. మే నెలలో మంచి వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

ఈ ఏడాదిలో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన 'కల్కి 2898 AD' జూన్ సినిమాల జాబితాలో అగ్ర స్థానం సంపాదించింది. తెలుగు చిత్ర పరిశ్రమకు పాన్ ఇండియా దారి చూపించిన 'బాహుబలి: ది బిగినింగ్'(2015) జూలైలో హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టింది. ఇక 2019లో ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ఆగస్టులో అధిక వసూళ్లు అందుకుంది. ఇటీవల ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందిన 'దేవర 1' చిత్రం సెప్టెంబర్ నెలాఖరున విడుదలై, బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అంతకముందు 'జనతా గ్యారేజ్' చిత్రం సెప్టెంబర్ నెలలో టాప్ లో ఉండేది.

2019లో చిరంజీవి నటించిన పాన్ ఇండియా మూవీ 'సైరా నరసింహా రెడ్డి' అక్టోబరు నెలలో అధిక వసూళ్లు రాబట్టింది. అక్కినేని నాగార్జున నటించిన సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ 'ఢమరుకం' నవంబర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇది 2012లోనే బాక్సాఫీస్ వద్ద రూ.28 - 30 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక 2023 చివర్లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన 'సలార్ 1' చిత్రం డిసెంబరు నెలలో టాప్ లో నిలిచింది. అప్పటి వరకూ ఉన్న 'పుష్ప 1' మూవీ రికార్డును బ్రేక్ చేసింది.

*టాలీవుడ్ లో నెలల వారీగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలు...

జనవరి - హనుమాన్

ఫిబ్రవరి - భీమ్లా నాయక్

మార్చి - RRR

ఏప్రిల్ - బాహుబలి 2

మే - సర్కారు వారి పాట

జూన్ - కల్కి 2898 AD

జూలై - బాహుబలి 1

ఆగస్ట్ - సాహో

సెప్టెంబర్ - దేవర 1

అక్టోబర్ - సైరా నరసింహారెడ్డి

నవంబర్ - ఢమరుకం

డిసెంబర్ - సలార్ 1

నవంబరు నెల విషయానికొస్తే.. 12 ఏళ్లు గడుస్తున్నా 'ఢమరుకం' సినిమా రికార్డ్ చెక్కుచెదరకుండా అలానే ఉంది. అయితే ఈ రికార్డ్ ఇన్నేళ్లు బ్రేక్ అవ్వకపోవడానికి కారణం, ఈ నెలలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ అవ్వకపోవడమే అనే కామెంట్లు వస్తుంటాయి. ఎందుకంటే నవంబర్ ను డ్రై సీజన్ గా భావించే మన స్టార్ హీరోలు.. ఈ నెలలో తమ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆసక్తి చూపించరు. నాగార్జున 'ఢమరుకం' సైతం ఎన్నో వాయిదాల తర్వాత చివరకు నవంబరులో వచ్చింది. ఈ సినిమా నెలకొల్పిన రికార్డ్ నేటికీ కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఈ ఏడాదిలో బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఈ నెలలో 'మట్కా', 'మెకానిక్ రాకీ' లాంటి క్రేజీ మూవీస్ విడుదలకు సిద్ధం అవుతున్నాయి కాబట్టి, కింగ్ నాగ్ రికార్డ్ ఈసారి చెరిగిపోతుందని అనుకుంటున్నారు. చూడాలి.. ఏం జరుగుతుందో!