అందరూ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న సీక్వెల్ ఏదంటే?
ఈ నేపథ్యంలో త్వరలో టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ సీక్వెల్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
By: Tupaki Desk | 6 Dec 2024 5:04 PM GMTఇండియన్ సినిమాలో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలకు కొనసాగింపుగా మరికొన్ని సినిమాలు చేయడం, లేదా ఒకే కథను రెండు భాగాలుగా చెప్పడం అనేది రివాజుగా మారిపోయింది. ఒక విధంగా 'బాహుబలి' తర్వాతనే ఈ సీక్వెల్స్ ఊపందుకున్నాయని చెప్పాలి. తెలుగులో ఇటీవల కాలంలో 'సలార్' 'కల్కి', 'దేవర' వంటి పెద్ద సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించబడ్డాయి. ఇప్పుడు లేటెస్టుగా 'పుష్ప' చిత్రాన్ని కూడా ఫ్రాంచైజీగా మార్చారు. ఈ నేపథ్యంలో త్వరలో టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ సీక్వెల్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''పుష్ప 2: ది రూల్''. ఇది మూడేళ్ళ క్రితం ఘన విజయం సాధించిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి రెండో భాగం. భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లు వసూలు చేసి, ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండియన్ ఓపెనర్‌గా నిలిచిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ అతికొద్ది రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కల్కి 2898 AD, RRR, KGF-2 సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
'పుష్ప' ప్రాంచైజీలో మూడో భాగం కూడా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు సుకుమార్ తెలివిగా 'పుష్ప 2: ది రూల్' ఎండింగ్ లోనే 'పుష్ప 3'కి లీడ్ ఇచ్చారు. ''పుష్ప 3: ది ర్యాంపేజ్'' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. 'పుష్ప 2' బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న తరుణంలో, పార్ట్-2 పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాకపోతే ఇప్పుడప్పుడే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదు. దర్శకహీరోల ఇతర కమిట్మెంట్స్ పూర్తైన తర్వాత భవిష్యత్ లో వీరిద్దరూ ఈ క్రేజీ సీక్వెల్ కోసం చేతులు కలపబోతున్నారు. ఎప్పుడొచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్‌చూపించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందిన 'కల్కి 2898 AD' చిత్రానికి కూడా పార్ట్-2 తీస్తున్నారు. మొదటి భాగం రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో, రెండో భాగంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ లో కేవలం ప్రధాన పాత్రధారులను పరిచయం చేయడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు కాబట్టి, సెకండ్ పార్ట్ లో అసలు కథ చెప్పబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తయింది. ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో పెట్టుకొని 'కల్కి 2' చిత్రాన్ని అంచనాలు తగ్గకుండా రూపొందించడానికి నాగి ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి స్టార్ క్యాస్టింగ్ తో రానున్న ఈ సైన్స్ ఫిక్షన్స్ ఫాంటసీ సీక్వెల్.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో 'దేవర' చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేసారు. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయినప్పటికీ కథ విషయంలో అనేక కంప్లెయింట్స్ వచ్చాయి. సెకండ్ పార్ట్ మీద పెద్దగా ఆసక్తి కలిగించేలా 'దేవర 1' ను ఎండ్ చేయలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కేవలం ఎన్టీఆర్ స్టార్ పవర్ కారణంగానే ఈ సినిమా రూ. 500 కోట్ల క్లబ్ లో చేరిందనే కామెంట్స్ కూడా వచ్చాయి. అందుకే ఇప్పుడు 'దేవర 2' కోసం ఏమంత ఎగ్జైటింగ్ గా ఎదురు చూడటం లేదని తెలుస్తోంది. మిగతా సీక్వెల్స్ తో కంపేర్ చేసి చూస్తే, దీనిపై అంచనాలు కాస్త తక్కువగానే ఉన్నాయని అనుకోవాలి. కొరటాల ప్రస్తుతం రెండో భాగం కథ మీద వర్క్ చేస్తున్నారు. తారక్ ఇతర కమిట్మెంట్స్ పూర్తైన తర్వాత, అప్పటి పరిస్థితులను బట్టి భవిష్యత్తులో పార్ట్-2 వస్తుందేమో చూడాలి.
డార్లింగ్ ప్రభాస్ నటించిన 'సలార్' సినిమాకి కూడా సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన మొదటి భాగం 'సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్'.. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీనికి కొనసాగింపుగా 'సలార్ పార్ట్-2: శౌర్యంగ పర్వం' చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మెయిన్ స్టోరీ అంతా సెకండ్ పార్ట్ లోనే ఉంటుందని మేకర్స్ చెబుతన్నారు. కాకపోతే ప్రభాస్, ప్రశాంత్‌ల ఇతర కమిట్‌మెంట్స్ పరిగణనలోకి తీసుకుంటే, 'సలార్ 2' సెట్స్ మీదకు వెళ్ళడానికి కొంత సమయం పట్టవచ్చు. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ తో నీల్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే, ప్రభాస్ మూవీ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు.
ఇలా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి నాలుగు సీక్వెల్స్ ప్రకటించబడ్డాయి. 'పుష్ప 3: ది ర్యాంపేజ్', 'దేవర' పార్ట్ 2, 'కల్కి 2' 'సలార్ పార్ట్-2: శౌర్యంగ పర్వం' టైటిల్స్ తో అనౌన్స్ చేయబడ్డాయి. ఎప్పుడు ఏ సినిమా వస్తుందనేది పక్కన పెడితే.. వీటిల్లో రెండు సీక్వెల్స్ పై సినీ ప్రియులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తునట్లు తెలుస్తోంది.