Begin typing your search above and press return to search.

సలార్, కల్కి, దేవర, పుష్ప.. రాజమౌళిని నిందిస్తున్న సినీ ప్రియులు!

ఇప్పుడు 'పుష్ప 2' సినిమా నార్త్ బెల్ట్ లో బీభత్సం సృష్టించడానికి బాటలు వేసింది రాజమౌళినే అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   9 Dec 2024 6:52 AM GMT
సలార్, కల్కి, దేవర, పుష్ప.. రాజమౌళిని నిందిస్తున్న సినీ ప్రియులు!
X

తెలుగు సినిమాలకు పాన్ ఇండియా మార్గం సుగమం చేసిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. 'బాహుబలి' సినిమాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటి, భాషా ప్రాంతీయత అడ్డంకులను చేరిపేసారు. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారంటే, దాని వెనుక జక్కన్న కృషి ఉందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు 'పుష్ప 2' సినిమా నార్త్ బెల్ట్ లో బీభత్సం సృష్టించడానికి బాటలు వేసింది రాజమౌళినే అని చెప్పాలి. అలాంటి దర్శక ధీరుడిని కొన్ని విషయాల్లో మాత్రం సినీ అభిమానులు తప్పుబడుతున్నారు.

టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన దర్శకత్వంలో 'మనీ', 'మనీ మనీ', 'రక్త చరిత్ర', 'రక్త చరిత్ర-2' వంటి చిత్రాలు వచ్చాయి. అయితే ఈ ట్రెండ్ ను పాన్ ఇండియా వైడ్ గా తీసుకెళ్ళింది మాత్రం రాజమౌళి అని చెప్పాలి. 'బాహుబలి: ది బిగినింగ్' & 'బాహుబలి: ది కన్ క్లూజన్' సినిమాలతో, ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పాలనే సంస్కృతిని అందరికీ పరిచయం చేసారు. అప్పటి నుండి ప్రతీ పెద్ద సినిమాని పార్ట్స్ గా తీయడం ట్రెండ్ గా మారిపోయింది. దీని కారణంగా ఏ సినిమాకీ సరైన ముగింపు ఉండటం లేదనే కామెంట్లు వస్తున్నాయి.

ఒక సినిమాకి సరైన ముగింపు ఇచ్చి, దానికి సీక్వెల్ గా మరో సినిమా చేయడంపై ఆడియన్స్ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పార్ట్-2 చేయాలనే ఉద్దేశ్యంతో ఫస్ట్ పార్ట్ ను అసంపూర్తిగా ముగించడంపైనే విమర్శలు వస్తున్నాయి. 'సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్', 'కల్కి 2898 ఏడీ' సినిమాలలో సగం స్టోరీనే తెరకెక్కించారు. మిగతా కథను పార్ట్-2లలో చూపిస్తారని చెబుతున్నారు. 'దేవర' చిత్రాన్ని ముందుగా ఒక సినిమాగా చేయాలనే అనుకున్నారు. కానీ చివరకు రెండు భాగాలుగా చేయాలనే నిర్ణయానికి వచ్చి, 'దేవర 1' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఫస్ట్ పార్ట్ ఎండింగ్ సంతృప్తికరంగా లేదనే విమర్శలు వచ్చాయి.

'పుష్ప' సినిమాని కూడా ఫ్రాంచైజీగా మార్చారు. 'పుష్ప: ది రైజ్' క్లైమాక్స్ విషయంలో అనేక కంప్లెయింట్స్ వచ్చాయి. ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నప్పటికీ, క్లైమాక్స్ మాత్రం విమర్శలను ఎదుర్కొంటోంది. 'పుష్ప 3' చేయాలనే అనే ఆలోచనతో, మూడో భాగానికి లీడ్ ఇస్తూ సెకండ్ పార్ట్ కి సరైన ముగింపు ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీక్వెల్ ట్రెండ్ ని ఇంతలా పాపులర్ చేసిన రాజమౌళినే దీనికి మెయిన్ రీజన్ అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళి ఆలోచన తెలుగు సినిమా ముగింపుని నాశనం చేసిందని అంటున్నారు. సలార్, కల్కి, దేవర, పుష్ప.. సినిమాలను సీక్వెల్స్ గా చేయడానికి, క్లైమాక్స్ సంతృప్తికరంగా లేకపోవడానికి ఆయనే ప్రధాన కారణమని నిందిస్తున్నారు. సీక్వెల్ హైప్ కోసం అందరూ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌ని చెడగొడుతున్నారని కంప్లెయింట్ చేస్తున్నారు. థియేటర్ లో మూడు గంటల సినిమా చూసి కూడా, ఇంకా ఏదో మిగిపోయింది అనే అసంతృప్తితో ప్రేక్షకులు బయటకు వచ్చేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మహేశ్ బాబుతో రాజమౌళి చేస్తున్న SSMB29 సినిమాని ప్రాంచైజీగా చేసే ఆలోచన ఉన్నప్పటికీ, పార్ట్-1ను సరెైన రీతిలో ముగించాలని కోరుకుంటున్నారు.