Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: తెర‌పై `హింస` ఇంకెన్నాళ్లు?

ఇటీవ‌లి కాలంలో హింస పెట్రేగుతోంది. వెండితెర, ఓటీటీ తెర‌పైనా అవే హింసాత్మ‌క స‌న్నివేశాలు.. ర‌క్త‌పాతం.. గొడ్డ‌ళ్ల‌తో రంపాల‌తో ఊచ‌కోత‌..

By:  Tupaki Desk   |   16 Sep 2024 1:30 PM GMT
ట్రెండీ స్టోరి: తెర‌పై `హింస` ఇంకెన్నాళ్లు?
X

ఇటీవ‌లి కాలంలో హింస పెట్రేగుతోంది. వెండితెర, ఓటీటీ తెర‌పైనా అవే హింసాత్మ‌క స‌న్నివేశాలు.. ర‌క్త‌పాతం.. గొడ్డ‌ళ్ల‌తో రంపాల‌తో ఊచ‌కోత‌.. తుపాకుల మోత‌.. మెషీన్ గ‌న్స్ తో పేల్చివేత‌.. దాడులు ప్ర‌తిదాడులు .. మాఫియా క‌థ‌లు... అదంతా స‌రే కానీ ఇలాంటి సినిమాల ట్రెండ్ ఇంకా ఎంత కాలం న‌డుస్తుంది? పెచ్చు మీరిన హింస‌ను ప్ర‌జ‌లు పెద్ద తెర‌పై చూసి చూసి విసిగిపోయి చివ‌రికి వ‌ద్ద‌నుకునే రోజులు వ‌చ్చేస్తాయా? అంటే ఏమో చెప్ప‌లేం.. దీనికి ఇంకెంతో కాలం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు...అనేది కొంద‌రి వాద‌న‌.

ఒక‌ప్పుడు శ్రీ‌నువైట్ల లైట‌ర్ వెయిన్ కామెడీలు చూసిన జ‌నానికి ఆ త‌ర్వాత వాటిపైనే మొహం మొత్తేసింది. అలాగే ఫ్యాక్ష‌న్ యాక్ష‌న్ సినిమాల‌పైనా మోజు త‌గ్గిపోయింది. అది అనూహ్య‌మైన ట్రెండ్. ఆ దెబ్బ‌కు శ్రీ‌నువైట్ల‌, వివి వినాయ‌క్, బి గోపాల్ వంటి వారికి త‌గిలింది. వారు ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో సినిమాలు తీయ‌డం లేదు.

మునుముందు మాఫియా క‌థ‌లు సినిమాల‌కు ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే? అప్పుడు ఏం జ‌రుగుతుంది? ఈ ద‌ర్శ‌కుల స‌న్నివేశం ఎలా మారుతుంది? అంటే.. ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ విష‌యం ఏమంటే.. మాఫియా క‌థ‌ల‌కు హిస్టారిక‌ల్ ట‌చ్.. నేటివిటీ ట‌చ్ ఇస్తూ ఎమోష‌న్ ని ర‌గిలిస్తూ ద‌ర్శ‌కులు తెలివిగా క‌థ‌ల్ని ముందుకు న‌డిపిస్తున్నారు. భారీ యాక్ష‌న్ హింసాత్మ‌క స‌న్నివేశాలు ఉన్నా కానీ ఇటీవ‌ల క‌థా బ‌లం పెరిగింది. క‌థ‌లో ఇన్ డెప్త్ మెటీరియ‌ల్ వారిని కాపాడుతోంది. తేలిక‌పాటి సీన్స్ తీసినా కానీ ఎమోష‌న్స్ డ్రాప్ అవ్వ‌కుండా తెర‌కెక్కించ‌డంలో మ‌న ద‌ర్శ‌కులు స‌ఫ‌ల‌మ‌వుతున్నారు. దీని కార‌ణంగా ఇటీవ‌ల పెచ్చు మీరిన హింసాత్మ‌క స‌న్నివేశాలు ఉన్నా కానీ కేజీఎఫ్‌, స‌లార్, యానిమ‌ల్, విక్ర‌మ్ లాంటి సినిమాలు ఆడాయని గ్ర‌హించాలి.

ఇటీవ‌ల తెలుగు ప‌రిశ్ర‌మ‌లో రాజ‌మౌళి జాన‌ర్ ల‌తో పాటు, ప్ర‌శాంత్ వర్మ(హ‌ను-మాన్), చందు మొండేటి (కార్తికేయ‌), అడివి శేష్ (గూఢ‌చారి) జాన‌ర్ లు కూడా బాగా ఎక్కుతున్నాయి. నేటిత‌రం ద‌ర్శ‌కుల్లో చాలా మంది మంచి క‌థ‌ల‌ను సృజ‌నాత్మ‌క‌త‌తో తెర‌కెక్కిస్తుండ‌డం ఆశావ‌హంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం పాన్ ఇండియా ట్రెండ్ పాన్ వ‌ర‌ల్డ్ ట్రెండ్ వైపు న‌డుస్తోంది. దీనివ‌ల్ల క‌థ‌ల ప‌రంగా ప్ర‌యోగాల‌కు మ‌రింత ఎక్కువ ఆస్కారం క‌నిపిస్తోంది. హార‌ర్ జాన‌ర్ కి డిమాండ్ త‌గ్గ‌లేద‌ని ఇటీవ‌ల బాలీవుడ్ లో విజ‌యం సాధించిన స్త్రీ 2 నిరూపించింది. ఇప్పుడు చందు మొండేటి పాకిస్తాన్ ముష్క‌ర సైన్యానికి చిక్కిన భారతీయ (శ్రీ‌కాకుళం) మ‌త్స్య‌కారుడి నిజ జీవిత‌క‌థ‌తో సినిమా తీస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. బాలీవుడ్ లో మ‌ణిపూర్ అల్ల‌ర్ల నేప‌థ్యంలో హృద్య‌మైన క‌థ‌ను సినిమాగా తీస్తున్నారు. ఇదేవిధంగా కొంద‌రు ద‌ర్శ‌కులు క‌థ‌ల‌తో, జాన‌ర్ల‌తో ప్ర‌యోగాలు చేస్తున్నారు.

మునుముందు ప్ర‌యోగాత్మ‌క క‌థ‌లు, జానర్ బ్లెండ్ క‌థ‌ల‌కు డిమాండ్ పెర‌గ‌బోతోంద‌ని ఈ ప్ర‌య‌త్నాలు చెబుతున్నాయి. ఓటీటీ తెర‌పై ప్ర‌యోగాత్మ‌క సినిమాలు, సిరీస్ లు చూసిన ప్ర‌జ‌ల కోసం ఇప్పుడు పెద్ద‌తెర ద‌ర్శ‌కులు విల‌క్ష‌ణ క‌థ‌ల‌తో ప్ర‌యోగాలు చేయాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు.