పంపిణీదారులకు నష్టాలొస్తే హిట్ అంటారా?
నిజానికి పంపిణీ వర్గాలకు నష్టాన్ని తెచ్చిపెట్టే ఏ సినిమా అయినా హిట్ అని చెప్పలేమని యువనిర్మాత నాగ వంశీ అన్నారు
By: Tupaki Desk | 28 Dec 2023 4:37 AM GMTసినీపరిశ్రమ వ్యాపారం ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతోంది. ఓటీటీ-శాటిలైట్ వ్యాపారం.. రీమేక్ రైట్స్ అమ్మకాలు వంటి అదనపు వ్యాపారాలు నిర్మాతలకు కలిసొస్తున్నాయి. ఈ రంగంలో అనుభవం ఉన్న నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉంటున్నారు. ఏదైనా సినిమాని మంచి రిలీజ్ డేట్ కి విడుదల చేయడంతో పాటు తొలి మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్ ని రాబట్టి సేఫ్ జోన్ కి చేరుకోవాలనే మంత్రాంగం నడుస్తోంది. ఇలాంటి రకరకాల కారణాలతో సినిమాలతో ఆదాయ నమూనా ఇటీవల గణనీయంగా మారిపోయింది. నిర్మాతలు నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే చాలావరకూ సేఫ్ జోన్‌లోకి వచ్చేస్తున్నారు. కానీ ఒక చిత్రం బాగా ఆడకపోతే నష్టాన్ని భరించేది పంపిణీదారులేననడంలో సందేహం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, నిర్మాతలు నాగ వంశీ, దిల్ రాజు, మైత్రి రవిశంకర్ లను ఇదే ప్రశ్న అడిగినప్పుడు బిజినెస్ గురించి కొత్త విషయాలు మాట్లాడారు.
నిజానికి పంపిణీ వర్గాలకు నష్టాన్ని తెచ్చిపెట్టే ఏ సినిమా అయినా హిట్ అని చెప్పలేమని యువనిర్మాత నాగ వంశీ అన్నారు. అంటే రకరకాల మార్గాల్లో నిర్మాత తన సినిమాని అమ్ముకుని లాభాలు సంపాదించినా.. దానిని రిలీజ్ చేసే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వాలనేది ఆయన ఉద్ధేశం. ఇదే అంశంపై దిల్ రాజు మాట్లాడుతూ 'ఇక్కడ కొన్ని వర్గాలు ఉన్నాయి. నిర్మాత లాభపడి సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు అమ్మితే హిట్ అంటాం. భవిష్యత్ లావాదేవీలు సంబంధాలను దృష్టిలో ఉంచుకుని, పంపిణీదారులు డబ్బును పోగొట్టుకుంటే ఎవరూ ఏదీ వ్యాఖ్యానించరు. ఇక్కడ సినిమా విజయం సాధించిందని మనస్పూర్తిగా చెప్పుకోవడం లేదు' అని అన్నారు.
దిల్ రాజు ఇంకా మాట్లాడుతూ-'నేను ఒక ప్రాజెక్ట్‌లో డబ్బు పోగొట్టుకోవచ్చు .. దానిని పంపిణీదారునికి అమ్మవచ్చు. డిస్ట్రిబ్యూటర్ లాభం పొంది ఉండవచ్చు. మేము ఇప్పటికీ దీనిని విజయవంతమైన చిత్రం అనే పిలుస్తాము. బలగం, సంక్రాంతి విడుదలలు వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలు విజయాలు సాధించాయి. ఈ సినిమాలు నిర్మాతలు, పంపిణీదారులకు లాభాలను తెచ్చిపెట్టాయి. చివరికి ప్రేక్షకులు కూడా సంతోషించారు. అవి నిజమైన సూపర్‌హిట్‌లు' అని అన్నారు. సంక్రాంతి బరిలో విడుదలవుతున్న పలు క్రేజీ చిత్రాలను దిల్ రాజు నైజాం సహా ఉత్తరాంధ్రలో పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.