ట్రెండీ స్టోరి: ఉరుమెల్లి పడ్డట్టు అంతా ఆ డేట్‌పైనే..!
మేకర్స్ లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్‌ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించినా కానీ తెలుగు సినిమాలకు వీటన్నిటి వల్లా ముప్పు తప్పదు
By: Tupaki Desk | 9 Sep 2023 3:30 PM GMTఉరుమెల్లి పడ్డట్టు అంతా ఒకే డేట్ పై పడ్డారు! దీంతో సెప్టెంబర్ మాసం కరువు పట్టిపోయింది. సెప్టెంబర్ 28వ తేదీని క్రేజ్ ఉన్న సినిమాలన్నీ లాక్ చేయడంతో ఇప్పుడు నెలంతా బోసి పోయింది. ఈ రెండు వారాలు ఆశించిన వినోదం సినీప్రియులకు థియేటర్లలో లభించే అవకాశం లేదు. ఇంతకుముందు సలార్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అసలు ఈ సినిమా సెప్టెంబర్ రేసు నుంచి బయటకు వెళ్లిపోయింది. సలార్ వాయిదాతో వరుసగా తమిళం, హిందీ, మలయాళ చిత్రాలు విడుదల తేదీల్ని సర్ధుబాటు చేసుకున్నాయి.
'సలార్' వాయిదా పడడంతో కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ (సెప్టెంబర్ 28), శ్రీకాంత్ అడ్డాల పెదకాపు (సెప్టెంబర్ 29), సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మ్యాడ్ (సెప్టెంబర్ 28) కూడా ఈ నెలాఖరున విడుదల కానున్నాయి. వివేక్ అగ్నిహోత్రి పాన్ ఇండియన్ చిత్రం 'ది వ్యాక్సిన్ వార్' కూడా సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇది కాకుండా హిందీ చిత్రం ఫుక్రే 3 కూడా సెప్టెంబర్ 28న విడుదలవుతోంది. ఫుక్రే 3కి హైదరాబాద్ వంటి నగరాల్లో పెద్ద సంఖ్యలో షోలు ఉంటాయి. ఇది తెలుగు విడుదలలపై ప్రభావం చూపుతుంది. మేకర్స్ లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్‌ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించినా కానీ తెలుగు సినిమాలకు వీటన్నిటి వల్లా ముప్పు తప్పదు. బాక్స్ ఆఫీస్ వద్ద రద్దీ నిస్సందేహంగా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుంది.
ఇంతలోనే ఇది చాలదు అన్నట్టు.. రామ్ పోతినేని నటించిన స్కంద సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 28కి వాయిదా పడింది. సలార్ వాయిదాతోనే ఈ నిర్ణయం. 'స్కంద' టీమ్ ఈ బిగ్ వీకెండ్ ని ఎన్ క్యాష్ చేసుకోవాలని భావించింది. అలాగే నెల మిడిల్ లోనే వస్తుందనుకున్న చంద్రముఖి 2ని సెప్టెంబర్ 28కి వాయిదా వేయడం వల్ల సెప్టెంబర్ నెలాఖరులో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. ఇప్పుడు అనూహ్య వాయిదాలతో క్రేజ్ ఉన్న సినిమాలన్నీ ఒకదానితో ఒకటిగా పోటీపడాల్సిన పరిస్థితి.
మధ్యస్థంగా ఆదుకునేది ఎవరు?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విశాల్ నటించిన 'మార్క్ ఆంటోని' ఒక్కటే సెప్టెంబర్ మిడిల్ లో విడుదలకు వస్తోంది. ఈ సినిమా వచ్చే వారం (సెప్టెంబర్ 15) విడుదల కానుంది. గణేష్ చతుర్థి సెప్టెంబర్ 18 (సోమవారం)న వస్తుంది. అంటే మార్క్ ఆంటోని విడుదలైన మూడు రోజులకు గానీ ఈ సెలవులు రావు. అందుకే డేవన్ లో పాజిటివ్ టాక్ వస్తేనే 'మార్క్ ఆంటోనీ' సుదీర్ఘమైన వారాంతపు ప్రయోజనాన్ని పొందగలడు. ఇక సెప్టెంబర్ మూడో వారంలో ఏదైనా సందడి ఉందా? అని వెతికితే.. మరింత విస్మయానికి గురిచేసే అంశం ఏమిటంటే సెప్టెంబర్ 21న చెప్పుకోదగ్గ విడుదలలు లేవు. కాబట్టి ఈ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అయితే విందు లేకపోతే కరువుగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 28న వరుస పెట్టి క్రేజీ సినిమాలన్నీ వస్తున్నాయి, కానీ నెలంతా డ్రైగానే ఉంటుంది. కాబట్టి ఒకే డేట్ కి వరుస సినిమాలు వస్తున్నాయి కాబట్టి, వాటికి థియేటర్ల సర్ధుబాట్ల విషయలో గందరగోళం నెలకొంటుందని అంతా భావిస్తున్నారు.