15 రోజుల పరిచయంతో కోట్ల ఆస్తి కొట్టేసేందుకు చంపేశాడు
ఇందులో భాగంగా సెప్టెంబరు 29న అంజిరెడ్డికి ఫోన్ చేసిన రాజేశ్.. రెజిమెంటల్ బజార్ లోని జీఆర్ కన్వెన్షన్ హాలుకు రప్పించాడు
By: Tupaki Desk | 9 Oct 2023 5:19 AM GMTసినీ నిర్మాత అంజిరెడ్డి హత్య ఉదంతాన్ని విచారిస్తున్న పోలీసులకు కొత్త విషయాలుబయటకు వస్తున్నాయి. ఆయన్ను హత్య చేసి.. ప్రమాదవశాత్తు మరణించినట్లుగా స్కెచ్ వేసిన జీఆర్ కన్వెన్షన్ యజమాని దరిద్రపుగొట్టు ప్లాన్ గురించి వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు సైతం అవాక్కు అవుతున్నారు. కోట్లాది రూపాయిల్ని కొల్లగొట్టాలన్న దుర్మార్గపు బుద్దితో అతడు వేసిన ఎత్తుల్ని పోలీసులు తెలుసుకుంటున్నారు.
సినీ నిర్మాత అంజిరెడ్డితో పదిహేను రోజుల పరిచయమే రాజేశ్ కు ఉంది. తమకున్న ఆస్తుల్ని అమ్మేసి.. అమెరికాకు వెళ్లాలనుకుంటున్న వారి గురించి తెలుసుకున్న రాజేశ్.. వాటిని అమ్మేసేందుకు సాయం చేస్తానన్న పేరుతో వారికి దగ్గరయ్యాడు. కేవలం పదిహేను రోజుల పరిచయాన్ని అడ్డు పెట్టుకొని.. అంజిరెడ్డిని చంపేసి.. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించటం.. వారికున్న ఆస్తిని తప్పుడు మార్గంలో కొట్టేయాలన్న పెద్ద ఎత్తు వేశాడు. అయితే.. అతడు చేసిన పాపం బద్ధలైంది.
హత్య చేసేందుకు ప్లాన్ చేసిన రాజేశ్.. అంజిరెడ్డి ఇంటికి తరచూ వెళ్లి.. వారి ఇంటిని కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బుల్ని సిద్దంగా ఉందన్న మాటను గట్టిగా చెప్పేవాడు. అంజిరెడ్డి భార్యకు వినిపించేలా.. ఆమెకు అర్థమయ్యేలా ఈ సంభాషణ చేసేవాడు. ఎందుకిలా అంటే.. అంజిరెడ్డిని చంపేసి.. తాను అనుకున్నట్లుగా ఇంటి పత్రాల మీద సంతకాలు చేయించుకొని.. తాను అంజిరెడ్డికి డబ్బులు ఇచ్చేసినట్లుగా పోలీసులకు ఆయన భార్య చేతనే సాక్ష్యం చెప్పాల్సించాలని భావించాడు.
ఇందులో భాగంగా సెప్టెంబరు 29న అంజిరెడ్డికి ఫోన్ చేసిన రాజేశ్.. రెజిమెంటల్ బజార్ లోని జీఆర్ కన్వెన్షన్ హాలుకు రప్పించాడు. రూ.2.5 కోట్లు ఇచ్చినట్లుగా తాను అప్పటికే సిద్ధం చేసిన పత్రాల మీద సంతకాలు చేయాలని ఒత్తిడి చేయగా.. అందుకు ససేమిరా అన్న అంజిరెడ్డిని ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. అనంతరం ప్రమాదవశాత్తు మరణించినట్లుగా చిత్రీకరించే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ఇతగాడి నేరచరిత్ర గురించి ఆరా తీస్తున్న పోలీసులకు.. గతంలో ఒక యువతి ఆత్మహత్యకు కూడా రాజేశ్ కారణమన్న కేసు కూడా నమోదైనట్లుగా గుర్తించారు.