పుష్పరాజ్‌పై టీచర్ ఫైర్.. కారణం షాకింగ్
నిజమే పిల్లలపై సినిమాలు ప్రభావం చూపుతున్న మాట వాస్తవమే అయినా, ప్రధానోపాధ్యాయురాలు చెప్పినట్టు పేరెంట్ కంట్రోల్ లేకపోవడం, తమ చుట్టూ ఉన్న అవ్యవస్థ (సమాజం) ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుంది.
By: Tupaki Desk | 23 Feb 2025 6:04 AM GMTసినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే చెడగొడతాయనడం అన్యాయం. సినిమాలు సమాజాన్ని, పిల్లల్ని నాశనం చేస్తున్నాయని ఆరోపిస్తూ యూసఫ్ గూడ (హైదరాబాద్) ప్రభుత్వ పాఠశాల ప్రధానోపధ్యాయురాలు ఆరోపించిన తీరు ప్రస్తుతం సినీవర్గాల్లో చర్చగా మారింది. పుష్ప 2 తన పాఠశాల విద్యార్థులలో సగం మందిని చెడిపోయిన ఆకతాయిలుగా మార్చిందని ఆమె వాదించారు.
ఇటీవల విద్యా కమిషన్‌తో జరిగిన సమావేశంలో హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాల వల్ల పిల్లలు చెడిపోతున్నారనే ఆరోపణ అందరినీ ఆశ్చర్యపరిచింది.
నిజానికి సినిమాలు చూసి చెడిపోయారని ఆరోపించడం సరైనదేనా? అనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమైంది. సినిమాలు నాశనం చేస్తున్నాయని ఆరోపించిన ఆ ప్రధానోపాధ్యాయురాలు ఇదే సమావేశంలో పిల్లలపై సమాజం ప్రభావం గురించి కూడా చర్చించారు. పిల్లలు వీధిలో ఉపయోగించే బూతు భాషను స్కూల్ లోను ఉపయోగిస్తున్నారని అన్నారు. చెత్త హెయిర్ స్టైల్ తో వస్తుంటే, దానిని మార్చుకోవాలని చెప్పినా వినడం లేదని ఆరోపించారు. తల్లిదండ్రులు కూడా దీనిని పట్టించుకోవడం లేదని, పిల్లలపై పేరెంట్ కట్టడి లేదని కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి పిల్లలను మార్చడం తమ వల్ల కాదని కూడా చేతులెత్తేసారు.
నిజమే పిల్లలపై సినిమాలు ప్రభావం చూపుతున్న మాట వాస్తవమే అయినా, ప్రధానోపాధ్యాయురాలు చెప్పినట్టు పేరెంట్ కంట్రోల్ లేకపోవడం, తమ చుట్టూ ఉన్న అవ్యవస్థ (సమాజం) ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుంది. వారు చదవాలా వద్దా? మంచి భాష మాట్లాడాలా వద్దా? సుగుణ శీలుడుగా ఉండాలా వద్దా? అనేది చాలా వరకూ తల్లిదండ్రుల కట్టడి నుంచి వస్తుంది. కానీ చాలా మంది పిల్లలకు పేరెంట్ కట్టడి లేదని ప్రధానోపాధ్యాయురాలే స్వయంగా చెప్పారు. సగం మంది విద్యార్థులు పుష్ప సినిమా చూసి చెడిపోతే, మిగతా సగం మంది పిల్లలు కచ్ఛితంగా పేరెంట్ కంట్రోల్ లో ఉండటం వల్ల చెడిపోలేదని భావించాల్సి ఉంటుంది. మొదట పిల్లలపై దృష్టి సారించాల్సింది తల్లిదండ్రులే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
తప్పు చేసిన పిల్లల్ని దండించేందుకు లేదా మందలించేందుక ఒకప్పుడు టీచర్లకు అధికారం ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. పిల్లలతో సున్నితంగా చెప్పి వదిలేయాలి. నిజానికి ఇది టీచర్లకు పెను సవాల్ లాంటిది. పిల్లల చెడు ప్రవర్తన చూసి కోపం వస్తున్నా కానీ, ఎమోషనల్ బ్లాకేజ్ కి గురి కావాల్సి ఉంటుంది. సస్పెన్షన్ భయంతో చెడ్డ పిల్లల విషయంలోను తాము ఏమీ చేయలేని పరిస్థితి ఉందని ప్రధానోపాధ్యాయురాలు వాపోయారు. అయితే ఇన్ని సవాళ్ల మధ్య కూడా పిల్లలలో సానుకూల మార్పును తెచ్చి, దండన లేకుండా సున్నితంగా వారించడం ద్వారా పిల్లలను సరిదిద్దేవారే నిజమైన ఉపాధ్యాయులు.