వెయ్యి కోట్లు.. అందరూ లెక్కలు తప్పాయి
షారుక్ తర్వాత బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' టాలీవుడ్ నుంచి ప్రభాస్ 'సలార్' వంటి సినిమాలు కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు కొల్లగొడతాయని రిలీజ్ కి ముందు ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ అలా జరగలేదు.
By: Tupaki Desk | 7 Jan 2024 4:30 PM GMTఒకప్పుడు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమా థియేటర్స్ లో ఎన్ని రోజులు ఆడుతుందో అని చూసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే అది ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని లెక్కలేసుకుంటున్నారు అభిమానులు. ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్న సరికొత్త ట్రెండ్ కూడా ఇదే. ప్రస్తుతం సౌత్ సినిమాల రేంజ్ కూడా భారీగా పెరిగిపోయింది.
ఒకప్పుడు రూ.100 కోట్లు కూడా కలెక్ట్ చేయని సౌత్ సినిమాలు ఇప్పుడు రూ.500 నుంచి రూ.1000 కోట్లు.. రూ.2000 కోట్లకు దగ్గరగా వెళుతున్నాయి. అలా టాలీవుడ్ నుంచి మొట్టమొదటిసారి 2017లో రాజమౌళి 'బాహుబలి 2' తో ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్ల గ్రాస్ అందుకొని అరుదైన ఘనత సాధించాడు. మళ్లీ 2022లో 'RRR' తో తన విజయాన్ని పునరావృతం చేశాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లను రాబట్టింది.
RRR తర్వాత బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ గత సంవత్సరం రూ.1000 కోట్ల క్లబ్ లో చేరాడు. వరుసగా రెండు సినిమాలతో ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అందులో 'పఠాన్' రూ.1050 కోట్లు కలెక్ట్ చేస్తే 'జవాన్' రూ.1164 కోట్లు రాబట్టింది. షారుక్ తర్వాత బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' టాలీవుడ్ నుంచి ప్రభాస్ 'సలార్' వంటి సినిమాలు కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు కొల్లగొడతాయని రిలీజ్ కి ముందు ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ అలా జరగలేదు.
'టైగర్ 3' ఫుల్ రన్ లో బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.450 కోట్లు వసూలు చేయగా 'సలార్' ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లతో థియేట్రికల్ రన్ ని ముగించుకుంది. మరోవైపు ఎవరు ఊహించని విధంగా సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్లో లో వచ్చిన 'యానిమల్' రూ.1000 కోట్ల మార్కుకు దగ్గరగా వచ్చింది. యానిమల్ బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లు రాబట్టింది. ఇక షారుక్ నటించిన రీసెంట్ మూవీ 'డంకీ' బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం రూ.500 కోట్ల మార్కును దాటలేకపోయింది.
ఇక ఈ ఏడాది బాక్సాఫీస్ లో 1000 కోట్ల మార్కును అందుకునే సినిమాల్లో 'పుష్ప2' ముందు వరుసలో ఉంది. సినిమాపై వరల్డ్ వైడ్ గా విపరీతమైన హైప్ ఉండడంతో కచ్చితంగా వెయ్యి కోట్లు కొల్లగొడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. 'పుష్ప 2' తర్వాత రాజమౌళి - మహేష్ బాబు ప్రాజెక్ట్ అవలీలగా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని చెప్పవచ్చు.