AIతో మాయలో సినిమా పనులు.. ఇదెక్కడి మాస్ మామ!
ప్రస్తుతం మనం కృత్రిమ మేధ యుగంలో ఉన్నాం. ఎక్కడ చూసినా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్- AI గురించే చర్చ నడుస్తోంది
By: Tupaki Desk | 14 March 2024 6:30 AM GMTప్రస్తుతం మనం కృత్రిమ మేధ యుగంలో ఉన్నాం. ఎక్కడ చూసినా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్- AI గురించే చర్చ నడుస్తోంది. కొన్ని నెలలుగా ప్రతి రంగంలోకి కూడా ఏఐ ప్రవేశిస్తోంది. తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ప్రపంచానికే షాక్ కు గురిచేస్తోంది. అయితే ఇది కేవలం ప్రారంభమని.. రానున్న కాలంలో ఏఐ మరిన్ని అద్భుతాలు సృష్టిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోందని చెప్పవచ్చు. సోషల్ మీడియా సైట్స్ మొదలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వరకు అన్నీ ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే టెక్ దిగ్గజాలన్నీ ఏఐ వినియోగాన్ని మొదలుపెట్టేశాయి. అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా ఏఐ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది.
ఇటీవల పలు సినిమాల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు ఆయా మూవీ మేకర్స్. గతేడాది నాని హీరోగా నటించిన హాయ్ నాన్నలో ఓ సీన్ కోసం ఫారిన్ లేడీ వాయిస్ ను ఏఐ ద్వారానే క్రియేట్ చేశారు. లాల్ సలామ్ మూవీకి గాను మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఇలానే చేశారు. ఏఐ సాయంతో వాయిస్ కాదు ఓ తెలుగు మూవీ కోసం లిరికల్ వీడియో కూడా సృష్టించారు.
ఇప్పుడు ఈ టెక్నాలజీని వాడి ఏకంగా పలు సినిమాలకు గాను డబ్బింగ్ చెప్పిస్తున్నారట మేకర్స్. ఒక్కసారిగా విని షాకయ్యారా.. కానీ ఇది నిజమే. త్వరలో రిలీజ్ కానున్న పలు తెలుగు సినిమాలకు ఇదే జరిగిందట. ఒకటో రెండో డైలాగులు ఉన్న క్యారెక్టర్ల డబ్బింగ్ ను ఏఐతో మేకర్స్ చెప్పించారట. డబ్బింగ్ ఆర్టిస్టులకు ఇచ్చే రెమ్యూనరేషన్లు సేవ్ చేసేందుకు ఇలా చేస్తున్నారట.
ఈ విషయం ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. భవిష్యత్తులో సినిమా హీరోలు కూడా ఏఐ టెక్నాలజీకి అలవాటు పడతారమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు నెటిజన్లు. బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఏఐనే ఫాలో అవుతారని అంటున్నారు. అయితే ఏఐతో ఎవరి వాయిస్ అయినా ఈజీగా క్రియేట్ చేయవచ్చు. ఒరిజినల్ కు ఏఐ వాయిస్ కూడా ఎలాంటి తేడా ఉండదు. అసలు డౌట్ కూడా రాదు. మరి ఫ్యూచర్ లో ఏఐ.. సినీ రంగంలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.