Begin typing your search above and press return to search.

ఎక్స్ సంచలనం.. సినిమా మొత్తం చూసేయొచ్చు

ఇదిలా ఉండగా.. తాజాగా సరికొత్త సంచలనానికి తెర తీస్తోంది ఎక్స్.

By:  Tupaki Desk   |   22 May 2024 4:38 AM GMT
ఎక్స్ సంచలనం.. సినిమా మొత్తం చూసేయొచ్చు
X

ఆరంభంలో అడుగులు తడబడినప్పటికీ.. కాలం గడిచేకొద్దీ అంతకంతకూ బలమైన.. ప్రభావవంతమైన సోషల్ మీడియా ప్లాట్ పాంగా మారుతోంది ఎక్స్ అలియాస్ ట్విటర్. తన పేరును మార్చుకున్న తర్వాత నుంచి మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ పూర్వ ట్విటర్ ను కొనుగోలు చేసిన తర్వాత నుంచి దాని రూపాన్ని.. తీరును మార్చేయటం తెలిసిందే. గడిచిన కొంతకాలంగా ఎక్స్ దూసుకెళుతోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా సరికొత్త సంచలనానికి తెర తీస్తోంది ఎక్స్. ఇప్పటివరకు సెకన్లు.. నిమిషాల నిడివి ఉన్న వీడియోల్ని మాత్రమే ప్లే చేసే వీలున్న ఎక్స్ లో ఇకపై పూర్తి నిడివి సినిమాల్ని చూసే వీలు కల్పించనుంది. ఎక్స్ చందాదారులు తమ సినిమాలు.. టీవీ సీరియళ్లను పోస్టు చేయొచ్చని.. వాటిని మానెటైజ్ చేయటం ద్వారా డబ్బులు కూడా సంపాదించొచ్చంటూ భారీ ఆఫర్ ఇచ్చేశారు. అంటే.. యూట్యూబ్ కు పోటీ వీడియో స్ట్రీమింగ్ ను అందుబాటులోకి తెస్తున్నట్లుగా చెరప్పాలి.

ఇదిలా ఉంటే.. పోస్టు చేసిన సినిమాలకు ఒకసారి ఫీజు చెల్లించే విధానాన్ని తీసుకురావాలంటూ ఒక యూజర్ కోరారు. అలా చేస్తే ప్రజలు సబ్ స్కైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదని.. కోరుకున్న సినిమాలను కొనుక్కోవచ్చని చెబుతున్నారు. అదే జరిగితే ఎక్స్ నిజమైన సినిమా వేదిక అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మెరుగైన వీడియో ప్లేయింగ్ యంత్రాంగం అవసరమని.. అది త్వరలోనే తీరాలని కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. తన సోదరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మస్క్.. ఎక్స్ లో రానున్న ఫీచర్ గురించి ప్రస్తావించటం తెలిసిందే. తన సోదరితో షేర్ చేసుకున్న వీడియో స్ట్రీమింగ్ అంశంపై పెద్ద ఎత్తున ప్రతిస్పందనలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రకటనల్నిటార్గెటెడ్ యూజర్లకు అందేలా చేయటం కోసం సరికొత్త ఏఐ సిస్టంను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా మస్క్ చెబుతున్నారు. ప్రకటనకర్తలు ఎవరైనా సరే.. తమ ప్రకటనల్ని ఎవరికి చేరవేయాలన్న అంశాన్ని సింఫుల్ గా చెప్పేస్తే.. తమ అత్యాధునిక ఏఐ వ్యవస్థ సెకన్ల వ్యవధిలో సమాచారాన్ని ఇవ్వటమే కాదు.. వారి జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలకు ఎక్స్ వేదికగా మారుతుందని చెప్పక తప్పదు.