ఆ టైటిల్స్ మారిస్తే ఏంట్రా బాబు...?
తెలుగులో తమిళ్ సినిమా లు డబ్ అవ్వడం కొత్తేం కాదు. అయితే గతంలో తమిళ్ సినిమాలు తెలుగు లో వచ్చినప్పుడు టైటిల్స్ ని తెలుగు లోనే పెట్టేవారు
By: Tupaki Desk | 7 Oct 2023 3:30 PM GMTతెలుగులో తమిళ్ సినిమా లు డబ్ అవ్వడం కొత్తేం కాదు. అయితే గతంలో తమిళ్ సినిమాలు తెలుగు లో వచ్చినప్పుడు టైటిల్స్ ని తెలుగు లోనే పెట్టేవారు. కానీ ఈ మధ్య కాలంలో అక్కడ ఇక్కడ ఒకే టైటిల్ కాన్సెప్ట్ తో సినిమాలను చేస్తున్నారు. కొన్ని తమిళ పదాలను తెలుగు లో కనీసం అనువదించకుండా అదే టైటిల్ అంటున్నారు.
కొన్ని ఇంగ్లీష్ పదాలను టైటిల్ గా పెట్టిన సినిమాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ తమిళ పదాలు టైటిల్స్ గా ఉన్న సినిమాలను అదే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం విడ్డూరంగా ఉంది. విజయ్ ఆంటోనీ 'రత్తం' ను అదే టైటిల్ తో తెలుగు లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
తాజాగా శివ కార్తికేయన్ కొత్త సినిమా అయలాన్ ను కూడా అదే టైటిల్ తో తెలుగు లో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. సంక్రాంతికి తమిళ్ బాక్సాఫీస్ తో పాటు తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు గాను అయలాన్ ను విడుదల చేయబోతున్నట్లు శివ కార్తికేయన్ అధికారికంగా ప్రకటించాడు.
అక్కడ ఇక్కడ ఒకే టైటిల్ ఉండాలి అనుకున్నట్లయితే ఇంగ్లీష్ టైటిల్ లేదా మరేదైనా తెలుగు వారికి కూడా అర్థం అయ్యే టైటిల్ ను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. కానీ తమిళ టైటిల్ ను దాని అర్థం కూడా తెలియని టైటిల్ ను తెలుగు లో డబ్బింగ్ చేసిన సినిమాకు పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సినీ వర్గాల వారు విమర్శిస్తున్నారు.