Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : మిస్టర్ ప్రెగ్నెంట్

By:  Tupaki Desk   |   18 Aug 2023 10:30 AM GMT
మూవీ రివ్యూ : మిస్టర్ ప్రెగ్నెంట్
X

‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ రివ్యూ

నటీనటులు: సయ్యద్ సోహెల్-రూప కొడవయూర్-సుహాసిని-వైవా హర్ష-బ్రహ్మాజీ-రాజా రవీంద్ర తదితరులు

సంగీతం: శ్రవణ్ భరద్వాజ్

ఛాయాగ్రహణం: నిజార్ షఫీ

మాటలు: చలమాజి-శ్రీనివాస్ వింజనంపాటి

నిర్మాతలు: అప్పిరెడ్డి-రవీందర్ సజ్జల-అభిషేక్ రెడ్డి బొబ్బాల

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి

‘బిగ్ బాస్’ షోతో వచ్చిన పాపులారిటీతో హీరోగా మారిన వాళ్లలో సయ్యద్ సోహెల్ ఒకడు. ఒక మగాడు గర్భం ధరించడం అనే వైవిధ్యమైన పాయింట్ మీద రూపొందిన అతడి కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి రేకెత్తించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గౌతమ్ (సోహెల్) ఒక అనాథ. చిన్నతనంలోనే తండ్రిని.. పెరిగి పెద్దవుతున్న దశలో త్లలిని కోల్పోయిన అతను కష్టపడి ఒక స్థాయికి చేరుకుంటాడు. టాటూ స్పెషలిస్ట్ అయిన గౌతమ్ ను మహి (రూప కొడువయూర్) స్కూల్ రోజుల నుంచి ప్రేమిస్తుంటుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోడు. చివరికి తన మీద మహికి ఉన్న ప్రేమను అర్థం చేసుకుని.. పిల్లలు కనకూడదన్న షరతు మీద ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ మహి అనుకోకుండా గర్భవతి అవుతుంది. ఐతే తన జీవితంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా మహి బిడ్డను కనడానికి గౌతమ్ ఒప్పుకోడు. చివరికి ఆమె గర్భాన్ని తనే మోస్తానని పట్టుబడతాడు? ఇంతకీ అతడి పట్టుదలకు కారణమేంటి? మరి భార్యను ఒప్పించి అతను గర్భం ధరించాడా? బిడ్డను కన్నాడా? అన్న ప్రశ్నలకు సమాధానం తెర మీదే తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అని టైటిల్ పెట్టి.. హీరో గర్భంతో ఉన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే ప్రేక్షకులకు ఒక విచిత్రమైన భావన కలిగే ఉంటుంది. ఈ పాయింట్ క్యూరియాసిటీ కలిగించడంతో పాటు కొంత ఇబ్బందికరంగా కూడా అనిపించి ఉంటుంది. బిడ్డను మోసి కనడంలో ఉండే కష్టమేంటో తెలుసు కాబట్టి తెర మీద ప్రెగ్నెంట్ లేడీస్ కాసేపు కనిపిస్తేనే మనసుకు కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటిది ఒక మగాడు ప్రెగ్నెంట్ అవతారం ఎత్తితే.. సినిమా అంతా ఆ పాయింట్ మీదే నడుస్తుంటే ఒక రకమైన ‘ఆడ్’ ఫీలింగ్ కలగడం ఖాయం. అదే సమయంలో హీరో అలా చేయడానికి కారణమేంటో తెలుసుకోవాలన్న ఆసక్తికి తోడు.. శాస్త్రీయంగా ఈ మార్పిడిని తెరపై ఎలా చూపిస్తారో అన్న క్యూరియాసిటీ కలుగుతుంది. ఐతే ఈ విషయాల్లో ప్రేక్షకుల ఆసక్తిని ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ కొంతమేరే నిలబెట్టగలిగింది. ప్లాట్ పాయింట్ చుట్టూ నడిపిన కొంత డ్రామా ఎంగేజింగ్ గా అనిపించినా.. ఓవరాల్ గా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది. కాన్సెప్ట్.. కొన్ని ఎమోషనల్ సీన్లను మినహాయిస్తే సినిమా మెప్పించలేకపోయింది.

ఒక కొత్త పాయింట్ ఎంచుకున్నపుడు.. ఒక ప్రయోగం చేస్తున్నపుడు.. సినిమా నడతే వేరుగా ఉండాలి. ఆరంభం నుంచి ప్రేక్షకులను వేరే మూడ్ లోకి తీసుకెళ్లాలి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో కొత్త పాయింట్లను డీల్ చేస్తే కుదరదు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ విషయంలో ఇదే తప్పు జరిగింది. ఒక మగాడు ప్రెగ్నెంట్ కావడం అనే షాకింగ్ పాయింట్ ను ఆశించినంత కొత్తగా ప్రెజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి. కొత్త సీన్లు రాసుకోవడానికి.. ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేయడానికి అవకాశమున్న కథ అయినప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నం చేయకుండా చాలా వరకు రొటీన్ గానే సినిమాను నడిపించేశాడు దర్శకుడు. ముఖ్యంగా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగిన హీరో.. అతడి కోసం వెంటపడే హీరోయిన్.. వీరి మధ్య ప్రేమాయణం నేపథ్యంలో వచ్చే ఆరంభ సన్నివేశాలు చూస్తేనే ఒక ‘పాత’ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు పాయింట్లోకి వెళ్లే వరకు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సాధారణంగా అనిపిస్తుంది. హీరో పట్టుబట్టి ప్రెగ్నెంట్ కావడం వెనుక కారణాలు కొంత సహేతుకంగానే అనిపించినా.. జస్ట్ గూగుల్ చేసి దీనికి రెడీ అయిపోవడం.. డాక్టర్ని కూడా ఈజీగా కన్విన్స్ చేసేయడం.. ఈ ప్రాసెస్ కూడా ఈజీగానే జరిగిపోవడం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. ఈ ఎపిసోడ్ కూడా శాస్త్రీయ కోణంలో ప్రేక్షకులను ఒప్పించేలా రూపొందలేదు. కాకపోతే ఒక మగాడు ప్రెగ్నెంట్ కావడం అనే పాయింట్ మీద ఉన్న ఆసక్తి వల్ల అక్కడి నుంచి కథలో ప్రేక్షకులు కొంత ఇన్వాల్వ్ అవుతారు. ఈ ఎపిసోడ్ వరకు ఎంగేజింగ్ గా అనిపిస్తుంది.

హీరో ప్రెగ్నెంట్ అయ్యాక వచ్చే శారీరక మార్పులు.. బిడ్డను మోయడంలో అతను పడే ఇబ్బందులు.. సమాజం దృష్టిలో దాన్ని కవర్ చేయడానికి పడే పాట్లు.. ఈ నేపథ్యంలో సాగే ద్వితీయార్ధం సోసోగా అనిపిస్తుంది. ఈ కష్టాలు.. ఇబ్బందులు అన్నీ కూడా ఏమంత కొత్తగా అనిపించవు. ప్రేక్షకులు ఈజీగా గెస్ చేయగలిగే సీన్లే పడ్డాయి చాలా వరకు. ఒక దశ దాటాక మెలో డ్రామా ఎక్కువైపోయి.. కథనం ముందుకు కదలక.. ముగింపు కోసం ఎదుర చూడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మధ్యలో బ్రహ్మాజీతో చేయించిన కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. పూర్తిగా గ్రాఫ్ పడిపోతున్న దశలో క్లైమాక్స్ సినిమాను కొంతమేర నిలబెట్టింది. తన వెంట పడి వేధిస్తున్న మీడియాకు.. సమాజానికి ప్రశ్నలు సంధిస్తూ.. ఒక బిడ్డను కనడంలో ఒక మహిళ పడే బాధను వివరిస్తూ హీరో ఇచ్చే స్పీచ్ కదిలిస్తుంది. ఈ సీన్లో బలమైన డైలాగులు రాశారు. సినిమాను ముగించిన తీరు కూడా బాగుంది. ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసే ఈ ఎపిసోడ్ ను మినహాయిస్తే ద్వితీయార్ధం భారంగానే అనిపిస్తుంది. వైవిధ్యమైన.. సాహసోపేతమైన పాయింట్ ఎంచుకున్న దర్శకుడు.. నరేషన్లో కూడా అంతే వైవిధ్యం చూపించి ఉంటే ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఒక స్పెషల్ మూవీగా నిలిచేది. కొంచెం ఓపిక చేసుకుని.. కాన్సెప్ట్.. కొన్ని ఎమోషనల్ సీన్ల కోసం అయితే ఈ సినిమాపై ఓ లుక్కేయొచ్చు.

నటీనటులు:

ఎలాంటి ఇమేజ్ లేకపోయినా సరే.. ఒక హీరో ప్రెగ్నెంట్ పాత్ర పోషించడం అంటే చిన్న విషయం కాదు. సోహెల్ కు ఈ విషయంలో అభినందనలు చెప్పాలి. ఆ పాత్రను అతను కన్విన్సింగ్ గా చేశాడు. ఎమోషనల్ సీన్లలో సోహెల్ ప్రతిభ తెలుస్తుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో అతను బాగా నటించాడు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ రూప కొడువయూర్ కూడా చక్కగా నటించింది. గ్లామర్ హీరోయిన్ల లుక్స్ లేకపోయినా.. తన నటనతో హావభావాలతో ఆమె బలమైన ముద్ర వేసింది. ఆమె మంచి నటి అని చాటే సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. డాక్టర్ పాత్రలో సుహాసిని పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఆమె పాత్ర సినిమాకు బలం. హీరో ఫ్రెండు పాత్రలో వైవా హర్ష మెప్పించాడు. రాజా రవీంద్ర.. బ్రహ్మాజీ ఓకే అనిపించారు.

సాకేంతిక వర్గం:

సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్ పాటల్లో తన ప్రత్యేకతను చాటలేకపోయాడు. పాటలు సోసోగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఓకే. కొన్ని చోట్ల అవసరానికి మించిన ఫీల్ రాబట్టడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆర్ఆర్ ఓకే అనిపిస్తుంది. నిజార్ షఫీ ఛాయాగ్రహణం బాగుంది. ఈ సినిమా స్థాయికి నిర్మాణ విలువలు మెరుగ్గానే అనిపిస్తాయి. సోహెల్ లాంటి హీరోను పెట్టి ఇలాంటి సాహసోపేత సినిమా తీసిన నిర్మాతలు అభినందనీయులు. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఎంచుకున్న పాయింట్ బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్లను అతను బాగా డీల్ చేశాడు. కానీ తన నరేషన్లో కొత్తదనం మాత్రం లేదు. చాలా వరకు ఒక టెంప్లేట్లో సినిమాను నడిపించేశాడు. దర్శకుడిగా అతడి పనితనానికి యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: మిస్టర్ ప్రెగ్నెంట్.. కాన్సెప్ట్ ఓకే కానీ!

రేటింగ్- 2.25/5