Begin typing your search above and press return to search.

ఆ పాత్ర కోసం వాళ్ళని అడుక్కోవాల్సి వచ్చింది: మృణాల్‌ ఠాకూర్‌

అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

By:  Tupaki Desk   |   1 Aug 2024 3:15 AM GMT
ఆ పాత్ర కోసం వాళ్ళని అడుక్కోవాల్సి వచ్చింది: మృణాల్‌ ఠాకూర్‌
X

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి, సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోన్న అందాల భామ మృణాల్ ఠాకూర్. 'సీతా రామం' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే తెలుగు యువ హృదయాలను కొల్లగొట్టింది. ఇదే క్రమంలో 'హాయ్‌ నాన్న' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని, క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటుగా హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటోంది. ఇందులో భాగంగా ఆమె ''పూజా మేరీ జాన్‌'' అనే బాలీవుడ్ మూవీలో నటించింది. అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

'పూజా మేరీ జాన్‌' సినిమా గురించి మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితమే షూటింగ్ అయిపోయిందని, బహుశా ఈ ఏడాదిలో రిలీజ్ కావొచ్చని తెలిపింది. ఇందులో పాత్ర కోసం ప్రొడ్యూసర్స్ తో ఫైట్ చేశానని, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళను అడుక్కున్నానని చెప్పింది. “నేను నటించిన సినిమాలలో ‘పూజా మేరీ జాన్’ అనే చిత్రం కూడా ఉంది. అది ఇంకా విడుదల కాలేదు. ఈ మూవీలో రోల్ నాకు బాగా నచ్చింది. ఎప్పటి నుంచో ఇలాంటి పాత్రలో నటించాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఆ క్యారక్టర్ నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. కానీ ఆ పాత్ర కోసం మరొక నటిని తీసుకోవాలని చూస్తున్నారని తెలిసి నేను నిర్మాతలతో గొడవ పడ్డాను’’ అని మృణాల్ వెల్లడించింది.

“ఈ సినిమాలో ఆ పాత్ర కోసం నేను ఎంతో పోరాడాను. అనేక ఆడిషన్లు ఇచ్చాను.. స్క్రీన్ టెస్ట్‌లలో పాల్గొన్నాను. నేను ఆ రోల్ కోసం లిటరల్ గా అడుక్కోవలసి వచ్చింది. మేము ఈ మూవీని 2 సంవత్సరాల క్రితమే చిత్రీకరించాం. ఈ ఏడాది విడుదల అవుతుందని ఆశిస్తున్నాను. నాకు బాగా గుర్తుంది.. ‘సీతా రామం’ చివరి రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత, వెంటనే విమానంలో వెళ్లి మరుసటి రోజు ఉదయం నేను ఈ సినిమా స్క్రీన్ టెస్ట్ లో పాల్గొన్నాను'' అని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది.

మహారాష్ట్రలో పుట్టి పెరిగిన మృణాల్ ఠాకూర్.. టెలివిజన్‌ ఇండస్ట్రీ ద్వారా కెరీర్‌ స్టార్ట్ చేసింది. కాలేజీ రోజుల్లోనే స్టార్ ప్లస్ కోసం ఓ సీరియల్ నటించింది. 'కుంకుమ్ భాగ్య' అనే ధారావాహికతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది 'కుంకుమ భాగ్య' పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేయబడింది. 2014లో 'హలో నందన్‌' అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ మీద పరిచయమైంది. ఆ తర్వాత సుమారు నాలుగేళ్లకు 'లవ్ సోనియా' అనే హిందీ సినిమాలో నటించే అవకాశం అందుకున్న మృణాల్.. 'సూపర్ 30' 'బాట్లా హౌస్' 'ఘోస్ట్ స్టోరీస్' 'తూఫాన్' 'ధమాకా' వంటి చిత్రాలతో హిందీ ఆడియన్స్ ను అలరించింది. 'జెర్సీ' హిందీ రీమేక్ లోనూ నటించింది.

2022లో వచ్చిన 'సీతా రామం' సినిమా మృణాల్‌ ఠాకూర్ కెరీర్ నే మార్చేసింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కు జోడీగా నటించింది. సీతా మహాలక్ష్మీగా ప్రిన్సెస్ నూర్జహాన్ గా అందరినీ ఆకట్టుకుంది. నానితో కలిసి 'హాయ్‌ నాన్న' సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ.. 'ది ఫ్యామిలీ స్టార్' మూవీతో ప్లాప్ తెలుగులో ప్లాప్ రుచి చూసింది. ఇటీవల 'కల్కి 2898 ఏడీ' సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం 'పూజా మేరీ జాన్‌'తో పాటుగా 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ప్రభాస్, హను కాంబోలో తెరకెక్కనున్న సినిమాలోనూ మృణాల్‌ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.