పిక్‌టాక్ : స్టార్ హీరోతో క్రికెట్ స్టార్
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్, మహేంద్ర సింగ్ ధోనీ కలిసి బిగ్ స్క్రీన్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ను చూశారు.
By: Tupaki Desk | 24 Feb 2025 5:31 AM GMTఇండియా - పాకిస్తాన్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా టీవీల ముందు కూర్చుంటారు. తాజాగా ఆదివారం రాత్రి దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ రెండు జట్ల మద్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఇండియాదే పై చేయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోసారి చరిత్ర పునరావృతం అయింది. ఎప్పటిలాగే ఐసీసీ ట్రోఫీ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరి ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, ఆయనతో పాటు ఎంతో మంది సినీ స్టార్స్ సైతం మ్యాచ్ సందర్భంగా సోషల్ మీడియాలో సందడి చేశారు.
దుబాయిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియానికి వెళ్లారు. సుకుమార్ సైతం దుబాయిలో జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లారు. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దుబాయిలో మ్యాచ్ చూసిన వారు మాత్రమే కాకుండా టీవీల ముందు క్రికెట్ మ్యాచ్ చూసిన సెలబ్రెటీల ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్, మహేంద్ర సింగ్ ధోనీ కలిసి బిగ్ స్క్రీన్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ను చూశారు. వీరితో పాటు అభిమానులు కూడా జత చేరారు. మ్యాచ్‌ను చాలా సమయం వీరిద్దరు కలిసి చూశారని సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్ట్‌లు షేర్ చేశారు.
టీం ఇండియా మాజీ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ కలయిక అందరి దృష్టిని ఆకర్షిస్తే, అది ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కావడంతో ఆ కలయికకి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. ధోనీ, సన్నీ డియోల్ మధ్య సన్నిహిత్యం ఉంది. ఆ సన్నిహిత్యంతోనే ఇలా కీలక మ్యాచ్‌ను చూశారు అంటూ వారి అభిమానులు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. వీరిద్దరి అభిమానులు వీరి ఫోటోలను, వీడియోలను షేర్ చేశారు.
గత కొన్నాళ్లుగా సక్సెస్ లేక ఢీలా పడ్డ సన్నీ డియోల్‌కి గదర్ 2 సూపర్ హిట్‌ను తెచ్చి పెట్టింది. దాంతో మళ్లీ సన్నీ డియోల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో జాట్ అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాను ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. టీం ఇండియాకు దూరం అయిన ధోనీ ఇంకా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. 2025 మార్చ్‌లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ సీజన్ ధోనికి చివరిది కావచ్చు అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు.