మూవీ రివ్యూ : 'ముఫాసా: ది లయన్ కింగ్'
By: Tupaki Desk | 20 Dec 2024 3:59 AM GMT'ముఫాసా: ది లయన్ కింగ్' మూవీ రివ్యూ
తెలుగు గాత్రదానం: మహేష్ బాబు-సత్యదేవ్-అయ్యప్ప పి.శర్మ-బ్రహ్మానందం-ఆలీ-శేషు తదితరులు
సంగీతం: హాన్స్ జిమ్మర్
ఛాయాగ్రహణం: జేమ్స్ లాక్స్టన్
స్క్రీన్ ప్లే: జెఫ్ నాథన్సన్
నిర్మాణం: డిస్నీ
దర్శకత్వం: బారీ జెన్కిన్స్
హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ నుంచి యానిమేషన్ సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తారు. ఈ చిత్రాలను పిల్లలు ఎలా కేరింతలు కొడతారో.. వాటిని చూస్తున్నపుడు పెద్దవాళ్లు కూడా పిల్లలైపోయి అంతే ఆనందపడతారు. ఇప్పుడు డిస్నీ సంస్థ నుంచి వచ్చిన కొత్త యానిమేటెడ్ మూవీ.. ముఫాసా: ది లయన్ కింగ్. రెండుసార్లు ఒకే కథతో 'ది లయన్ కింగ్' సినిమా తీసి అలరించిన డిస్నీ సంస్థ.. ఇప్పుడు దాని ప్రీక్వెల్ గా 'ముఫాసా'ను తీర్చిదిద్దింది. తెలుగులో ప్రధాన పాత్రకు మహేష్ బాబు గాత్రదానం చేయడంతో ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయింది. మరి 'ది లయన్ కింగ్' లాగే 'ముఫాసా' కూడా మెప్పించిందా.. దీని ప్రత్యేకతలేంటి.. తెలుసుకుందాం పదండి.
కథ:
పెద్ద సింహం కొడుకైన ముఫాసా చిన్నప్పట్నుంచి చాలా చురుగ్గా ఉంటాడు. వేగంలో.. తెలివిలో తనకు తానే సాటి. ఐతే ఓ వరదలో కొట్టుకుపోయి తల్లిదండ్రులకు దూరమైన ముఫాసా.. దూరంగా వేరే రాజ్యంలో అనాథలా పెరుగుతాడు. ఆ రాజ్యానికి అధిపతి అయిన ఒబాసికి ముఫాసా అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ అతడి భార్య-కొడుకు.. ముఫాసాను చేరదీస్తారు. ముఫాసా పెరిగి పెద్దయ్యాక కూడా ఒబాసి మీద అయిష్టత తగ్గదు. అలాంటి సమయంలోనే ప్రమాదకర తెల్ల సింహాలు ఒబాసి భార్య మీద దాడి చేస్తాయి. ఆ దాడి నుంచి కాపాడే ప్రయత్నంలో ఆ తెల్లసింహాల రాజు కొడుకును ముఫాసా చంపేస్తాడు. దీంతో రాజు అతడిపై కక్షగట్టి అతడి వాళ్లందరినీ అంతం చేయడానికి బయల్దేరతాడు. మరి తెల్లసింహాల నుంచి ముఫాసా తప్పించుకున్నాడా.. వాటితో పోరాడి గెలిచాడా.. ఇంతకీ తన తల్లిదండ్రులు ఏమయ్యారు.. వారిని ముఫాసా కలుసుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
జంతువులు మాట్లాడితే.. మనలా హావభావాలు పలికిస్తే.. అవి కూడా అనుబంధాలు ఆప్యాయతలతో విరాజిల్లితే.. వాటి మధ్య కుట్రలు కుతంత్రాలు.. ఆధిపత్య పోరాటాలు సాగితే.. ఇలాంటి ఊహలకే రూపం ఇచ్చి యానిమేషన్లో అద్భుతాలు చేస్తుంటారు హాలీవుడ్ ఫిలిం మేకర్స్. తెరపై జంతువులు మనలా మాట్లాడుతుంటే.. హావభావాలు పలికిస్తుంటే చూడ్డం గమ్మత్తుగా ఉంటుంది. అందులోనూ మనకు బాగా పరిచయం ఉన్న ఆర్టిస్టులు ఈ యానిమేటెడ్ సినిమాల్లో జంతువుల పాత్రలకు గాత్రదానం చేస్తే అది ఇంకా గమ్మత్తుగా అనిపిస్తుంది. 'ముఫాసా'లో ప్రధాన పాత్రకు మహేష్ బాబు వాయిస్ ఇవ్వడం అత్యంత ఆసక్తి రేకెత్తించిన అంశం. మహేష్ వాయిస్ లో ముఫాసా పాత్రను చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులు కచ్చితంగా ఓ మంచి అనుభూతితో బయటికి వస్తారు. మహేష్ ఎంతో మనసు పెట్టి.. కథ-పాత్రలోని భావోద్వేగాలకు తగ్గట్లుగా అతను సంభాషణలు పలికిన విధానం 'ముఫాసా' తెలుగు వెర్షన్ ప్రత్యేకత. ఇక దృశ్యపరంగా 'ముఫాసా' ఒక విజువల్ వండర్ అనిపిస్తుంది. యానిమేటెడ్ మూవీ అనే భావన రాకుండా సహజత్వం ఉట్టిపడేలా ఈ కథకు దృశ్యరూపం ఇచ్చిన తీరు కూడా అబ్బురపరుస్తుంది. ఐతే ఇవన్నీ బాగానే ఉన్నా.. ఒక భిన్నమైన కథను చూడాలని ఆశించే ప్రేక్షకులను మాత్రం ఇది నిరాశపరుస్తుంది. చాలా సాధారణమైన.. రొటీన్ కథకు విజువల్ మెరుపులతో ఎంత మాయ చేయాలని చూసినా.. ఆశించిన మంచి అనుభూతి అయితే కలగదు.
అద్భుతమైన విజువల్ ఎఫెక్టుల మధ్య 'ముఫాసా' చూస్తున్నంతసేపూ నిజంగా మనం ఓ అడవిలో జంతువుల మధ్య సంచరిస్తున్న భావన కలుగుతుంది. ఎక్కడా అసహజంగా అనిపించకుండా చక్కగా కుదిరిన విజువల్ ఎఫెక్టులు సినిమాకు ప్రధాన ఆకర్షణ కాగా.. యానిమేటెడ్ రూపంలో జంతువుల్ని సృష్టించి.. వాటితో డైలాగులకు తగ్గట్లుగా హావభావాలు పలికించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. పలికే ప్రతి మాటకు తగ్గట్లుగా జంతువుల హావభావాలు చూస్తుంటే.. అవి నిజమైన జంతువులేనా.. వాటికి నిజంగానే మాటలు వచ్చేశాయా అన్న భ్రమలు కలగడం ఖాయం. ఐతే కేవలం విజువల్ ఎఫెక్టులతో కంటికి ఇంపైన దృశ్యాలు చూపించి పంపేయకుండా కొంచెం భిన్నమైన.. ఆసక్తికరమైన కథను చెప్పడానికి ప్రయత్నించి ఉంటే బాగుండేది. బలమైన ఎమోషన్ లేని ఒక మామూలు కథతోనే సరిపెట్టేయడం నిరాశ పరుస్తుంది.
చిన్నతనంలో తల్లిదండ్రులకు దూరమయ్యే ఓ కొడుకు.. ఆ బిడ్డను చేరదీసి తన కొడుకుతో పాటు ఇంకో బిడ్డలా పెంచే ఓ తల్లి.. ఆ అనాథ అంటే అస్సలు నచ్చని తండ్రి.. ఇలా 'ముఫాసా'లోని పాత్రలన్నీ మనుషులను పోలినట్లే ఉంటాయి. వాటి మధ్య సన్నివేశాలు.. ఎమోషన్లు అన్నీ కూడా సగటు ఫ్యామిలీ డ్రామాను తలపిస్తాయి. విజువల్ గా ఎంత మెప్పిస్తున్నప్పటికీ.. కథగా మాత్రం 'ముఫాసా' ఏ దశలోనూ ఎగ్జైట్ చేయదు. విలన్ తో హీరో గొడవ.. వారి మధ్య పోరాటం కూడా చాలా సాధారణంగా అనిపిస్తుంది. కథలో బలమైన ఎమోషన్ లేకుండా విజువల్ గా ఎంత మాయాజాలం చేసినా మనసు నిండదు. ఇందులో కథ కూడా ఒక తీరుగా నడవదు. అసలు హీరో సరైన లక్ష్యాన్ని నిర్దేశించే ప్రయత్నమే జరగలేదు. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేకెత్తించని విధంగా సాగే కథనం బోర్ కొట్టిస్తుంది. అక్కడక్కడా కొన్ని ఎపిసోడ్లు బాగున్నా.. కథ పరంగా మాత్రం ఎగ్జైట్మెంట్ కలిగించదు 'ముఫాసా'.
అసందర్భోచితంగా.. విసుగు పుట్టించేలా పెట్టిన పాటలు సినిమాకు పెద్ద మైనస్. అవేమైనా వినసొంపుగా ఉన్నాయా అంటే అదీ లేదు. డైలాగులనే పాట రూపంలో ఎలా పడితే అలా పాడించేశారు. ఐతే డైలాగులు మాత్రం భలే గమ్మత్తుగా అనిపించేలా ఆసక్తికరంగా రాశారు. చాలా చోట్ల సంభాషణల్లో చమత్కారం కనిపిస్తుంది. బ్రహ్మానందం-ఆలీ-జబర్దస్త్ శేషు గాత్రదానం చేసిన పాత్రలతో బాగానే నవ్వించగలిగారు. విలన్ పాత్రకు అయ్యప్ప పి.శర్మ చెప్పిన డబ్బింగ్ కూడా బాగుంది. సాంకేతిక హంగులకేమీ సినిమాలో లోటు లేదు. ముఫాసా పాత్ర అనుకున్నంత బలంగా లేకపోయినా.. మహేష్ వాయిస్ ద్వారా దాని లోపాలను కొంత కవర్ చేశాడు. మొదట్లో వచ్చే వరద సన్నివేశాలు.. క్లైమాక్సులో విజువల్ ఎఫెక్ట్స్.. భారీతనం ఆకట్టుకుంటాయి. మొత్తంగా చెప్పాలంటే 'ముఫాసా' దృశ్యపరంగా మెప్పించినా.. కథాకథనాల్లో మాత్రం నిరాశపరుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం.. మహేష్ గాత్రం కోసం 'ముఫాసా'పై ఓ లుక్కేయొచ్చు కానీ.. అంచనాలు తక్కువ పెట్టుకుంటే మంచిది.
చివరగా: ముఫాసా: కంటికి ఇంపే మనసుకు కాదు
రేటింగ్- 2.5/5