సీనియర్ నటుడిపై విరుచుకుపడ్డ తండ్రి కూతుళ్లు
దీనికి కారణం కొన్నేళ్ల క్రితం కేబీసీ రియాలిటీ షోలో సోనాక్షి రామాయణంపై సింపుల్ ప్రశ్నకు ఆన్సర్ చేయలేకపోవడమే.
By: Tupaki Desk | 18 Dec 2024 6:21 AM GMTతెలిసో తెలియకో, అవగాహన ఉండో లేకో.. మీడియా ముందు ఏదైనా కామెంట్ చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. అలాంటి ఒక కామెంట్ కారణంగా బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా తండ్రి కూతుళ్లతో చీవాట్లు తినాల్సి వస్తోంది. శక్తిమాన్ గా సుప్రసిద్ధుడైన ముఖేష్ జీ ఇటీవల నటి సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా పెంపకాన్ని ఆక్షేపించారు. కూతురి పెంపకం సరిగా లేదని విమర్శించారు. దీనికి కారణం కొన్నేళ్ల క్రితం కేబీసీ రియాలిటీ షోలో సోనాక్షి రామాయణంపై సింపుల్ ప్రశ్నకు ఆన్సర్ చేయలేకపోవడమే.
పాత విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ నటుడు ముఖేష్ ఖన్నా సూటిగా శత్రుఘ్న సిన్హాను విమర్శించారు. పురాణేతిహాసం రామాయణం గురించి కుమార్తెకు నేర్పించలేదని షాట్ గన్ శత్రుఘ్న గురించి ఎత్తి చూపాడు. అయితే అతడి వ్యాఖ్యలకు సోనాక్షి ధీటుగా స్పందించింది. తన తండ్రిని అంటే సహించేది లేదని హెచ్చరించింది. నాకు నా కుటుంబానికి నష్టం కలిగిస్తూ పదే పదే అదే సంఘటనను తెరపైకి తేవడాన్ని సోనాక్షి తప్పు పట్టింది. దీనిని ఆపాలని కూడా ముఖేష్ ఖన్నాను కోరింది. నటుడు ముఖేష్ ఉద్ధేశపూర్వకంగా తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాడని సోనాక్షి సీరియస్ అయ్యారు. రాముడు బోధించిన క్షమా గుణం నేర్చుకోవాలని ముఖేష్ కి సూచించారు సోనాక్షి.
ఇప్పుడు సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా దీనిపై స్పందించారు. ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తన పిల్లలందరూ తనకు గర్వకారణమని శతృఘ్న అన్నారు. సోనాక్షి మంచి హిందువు కాబట్టి ఎవరి దగ్గరా ఎలాంటి సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం లేదని అన్నారు. నా కుమార్తె (సోనాక్షి) 'రామాయణం'పై ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోవడం వల్ల ఎవరికైనా సమస్య ఉందని నేను అనుకోను. ముందుగా ఈ వ్యక్తి రామాయణం సంబంధిత విషయాలలో నిపుణుడా? అతడి అర్హత ఏమిటి? అతడిని హిందూ మతానికి సంరక్షకుడిగా ఎవరు నియమించారు? అంటూ షాట్‌గన్ శత్రుఘ్న సూటిగా ప్రశ్నించారు.
''నా ముగ్గురు పిల్లల గురించి నేను చాలా గర్వపడుతున్నాను. సోనాక్షి తనంతట తానుగా స్టార్ గా ఎదిగింది. నేను తన కెరీర్‌ను ప్రారంభించాల్సిన అవసరం రాలేదు. ఏ తండ్రి అయినా గర్వించే కుమార్తె'' అంటూ సోనాక్షిని ఆకాశానికెత్తేశారు శత్రుఘ్న. రామాయణంపై ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోతే సోనాక్షిని మంచి హిందువు కాదు అని ప్రకటించలేరు.. తనను అనర్హురాలిని చేయలేరు.. ఎవరి నుంచి సర్టిఫికేట్ అవసరం లేదు.. అని అన్నారు.