ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి
ఇప్పటివరకూ తన ముగ్గురు వారసుల కోసం 3500 కోట్ల వరకూ ఖర్చు చేశారని లెక్కలు గడుతున్నారు.
By: Tupaki Desk | 7 July 2024 5:41 AM GMTఆసియా రిచెస్ట్ బిజినెస్ మేన్ ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఏ రేంజులో ఉంటుందో ఎవరైనా చెప్పాలా? అతడు ఇప్పటికే తన పెద్ద కొడుకు, కుమార్తెలకు వివాహం చేశాడు. ఈ రెండు పెళ్లిళ్ల కోసం భారీ మొత్తాలను వెచ్చించి ప్రపంచంలోనే మరో పెళ్లి ఇలా జరగదు! అనేంతగా తన ప్రేమను ఆవిష్కరించాడు. అంబానీ తన గత రికార్డులను తానే బ్రేక్ చేస్తూ ఇప్పుడు తన రెండో కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి షాకింగ్ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నాడు. ఈ పెళ్లి కోసం ఇప్పటికే దాదాపు 1000 కోట్లు పైగా ఖర్చు చేసిన ముఖేష్ అంబానీ, ఇప్పుడు మరో 500కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారని తెలిసింది. ఓవరాల్ గా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల పెళ్లి కోసం అంబానీ కుటుంబం 1500 కోట్లు పైగా ఖర్చు చేస్తోందని సమాచారం.
2018లో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ పెళ్లి కోసం 830కోట్లు ఖర్చయిందని కథనాలొచ్చాయి. ఒక్కో వివాహ ఆహ్వాన పత్రికకు 3లక్షలు ఖర్చు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలు అంబానీల పెళ్లికి హాజరయ్యారు. అత్యంత ఖరీదైన గాయకులలో ఒకరైన బియాన్స్ అంబానీ కుమార్తె వివాహ వేడుకలో ప్రదర్శన ఇచ్చారు. దీనికోసం దాదాపు 60 కోట్లు చెల్లించారని కథనాలొచ్చాయి. బాలీవుడ్ నుంచి ప్రముఖులంతా ఈ పెళ్లికి అటెండయ్యారు.
2019లో ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ వివాహం జరిగింది. దీనికోసం ఏకంగా 1050 కోట్లు ఖర్చు చేశారని ప్రచారమైంది. ఒక్క స్విట్జర్లాండ్‌లోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ 3 రోజుల ఫంక్షన్‌కు 800 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం. దీని తరువాత వివాహం ముంబైలో మరో 3 రోజుల పాటు జరగగా.. దీనికి గూగుల్ CEO, బ్రిటిష్ ప్రధాని కూడా హాజరయ్యారు.
2024లో ఇప్పుడు రెండో కొడుకు అనంత్ అంబానీ తన చిరకాల స్నేహితురాలు రాధికా మర్చెంట్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు. జూలై 12న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. ఇప్పటికే కన్నుల పండుగగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇంతకుముందే రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటి వరకు 1260 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కథనాలొస్తున్నాయి. పెళ్లి కార్యక్రమం పూర్తయ్యే నాటికి మొత్తం ఖర్చు 1500 కోట్లు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ కుబేరులు ఎందరు ఉన్నా కానీ ముఖేష్ అంబానీ రేంజులో పెళ్లిళ్లు ఎవరూ చేయరని ముచ్చటించుకునేలా అనంత్ అంబానీ పెళ్లి జరుగుతోంది. దీనికోసం అంబానీలు పెడుతున్న ఖర్చు చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటివరకూ తన ముగ్గురు వారసుల కోసం 3500 కోట్ల వరకూ ఖర్చు చేశారని లెక్కలు గడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిళ్లలో నం.1 మన భారతీయుడైన ముఖేష్ అంబానీ చేసిన పెళ్లి అని కూడా గర్వంగా చెబుతున్నారు.