Begin typing your search above and press return to search.

మళ్లీ రూ.99 లకే మల్టీప్లెక్స్ లో సినిమా

గడచిన ఇరవై ఏళ్ల కాలంలో సినిమా టికెట్ల రేట్లు విపరీతంగా పెరిగిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   18 Sep 2024 9:31 AM
మళ్లీ రూ.99 లకే మల్టీప్లెక్స్ లో సినిమా
X

గడచిన ఇరవై ఏళ్ల కాలంలో సినిమా టికెట్ల రేట్లు విపరీతంగా పెరిగిన విషయం తెల్సిందే. ముఖ్యంగా మద్య తరగతి కుటుంబం మొత్తం కలిసి మల్టీప్లెక్స్ ల్లో సినిమా చూసే పరిస్థితి లేదు. సింగిల్‌ స్క్రీన్స్ లో సైతం సినిమాలు చూడాలంటే వందలకు వందలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాంతో మద్యతరగతి వారు, పేద వారు కనీసం మల్టీప్లెక్స్‌ వైపు చూసే పరిస్థితి లేదు. ఒక ఫ్యామిలీ మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే రూ.1500 ఉండాల్సిందే. అందుకే చాలా మంది సినిమాలు చూడాలంటేనే ఆసక్తి చూపడం లేదు. అందుకే ఓటీటీ లకు ఆధరణ పెరిగింది.

మల్టీప్లెక్స్ కు వెళ్లే పరిస్థితి లేని వారి కోసం అన్నట్టుగా సంవత్సరంలో ఒక్కరోజు రూ.99 లకే టికెట్‌ ను అందిస్తున్నారు. సెప్టెంబర్‌ 20న సినిమా డే సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌ లు అన్నింటిలోనూ కేవలం రూ.99 లకే సినిమా చూడవచ్చు. గతంలోనూ ఇదే విధంగా అన్ని మల్టీప్లెక్స్ లు రూ.99 లకు టికెట్‌ పెట్టడం ద్వారా చాలా మంది ఉపయోగించుకున్నారు. ఈ సంవత్సరం కూడా సినిమా డే సందర్భంగా పెద్ద ఎత్తున మల్టీప్లెక్స్ ల్లో ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు మల్టీప్లెక్స్‌ అసోషియేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుందని అధికారికంగా ప్రకటన వచ్చింది.

దేశంలోని మొత్తం 4 వేల మల్టీప్లెక్స్ ల్లో సెప్టెంబర్‌ 20వ తారీకున కేవలం రూ.99 లకే సినిమాను చూడవచ్చు. సినిమాతో సంబంధం లేదు, స్క్రీన్‌ తో సంబంధం లేదు. ఏ సినిమాకు వెళ్లినా, ఏ స్క్రీన్‌ లో చూసినా కేవలం రూ.99 అంటూ ప్రకటన వచ్చింది. మొత్తానికి మల్టీప్లెక్స్ లకు వెళ్లాలని డబ్బులు లేక వెళ్లలేక పోయిన వారికి సినిమా డే ఆఫర్ కచ్చితంగా బంపర్ ఆఫర్ అనడంలో సందేహం లేదు. ముందు ముందు కూడా ఇలాంటి ప్రత్యేక రోజుల్లో మల్టీ ప్లెక్స్ లు ఆఫర్‌ లు పెడితే బాగుంటుంది అంటూ సినీ ప్రేమికులు, మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పీవీఆర్‌ ఐనాక్స్‌, సినీ పోలీస్‌, మిరాజ్‌, సిటీ ఫ్రెడ్‌, ఏషియన్‌ సినిమాస్‌, మూవీ టైమ్‌, డిలైట్ వంటి మల్టీప్లెక్స్ చైన్‌ థియేటర్లు అన్నీ ఈ ఆఫర్‌ ను అందిస్తున్నాయి. తెలుగు లో మత్తు వదలరా 2 సినిమా ఉంది. ఆ ఒక్క సినిమాకు పాజిటివ్ టాక్‌ ఉంది. కనుక సెప్టెంబర్‌ 20న తెలుగు ప్రేక్షకులు మల్టీ ప్లెక్స్‌ ల్లో ఆ సినిమా చూసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొన్ని థియేటర్ లలో నాని, ప్రియాంక మోహన్ నటించిన సరిపోదా శనివారం సినిమా ఉంది. ఈ సినిమాకూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది కనుక ఆఫర్ డే రోజు రూ.99 లకు నాని సినిమాను చూడవచ్చు.