ఒక్క రోజు ఆఫర్ తో సందడే సందడి
చాలా రోజుల క్రితం విడుదల అయిన సినిమాలకు మొదలు నేడు విడుదల అయిన సినిమాల వరకు ప్రతి ఒక్క సినిమాకు మల్టీ ప్లెక్స్ ల్లో ఫుల్ ఆక్యుపెన్సీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 13 Oct 2023 9:47 AM GMTనలుగురు సభ్యులు ఉన్న ఒక ఫ్యామిలీ మల్టీ ప్లెక్స్ లో సినిమాకు వెళ్లాలి అంటే మధ్య తరగతి నలుగురు సభ్యుల ఫ్యామిలీ నెలకు సరిపోయే డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే మల్టీ ప్లెక్స్ ల్లో సామాన్యుల కంటే ఎగువ మధ్య తరగతి వారు లేదంటే డబ్బున్న వారు మాత్రమే కనిపిస్తారు. పేద వారికి, మధ్య తరగతి వారికి మల్టీ ప్లెక్స్ ల్లో సినిమా చాలా భారంగా మారింది.
మధ్య తరగతి వారు, పేద వారు కూడా ఒక రోజు మల్టీ ప్లెక్స్ లో సినిమా చూడాలనే ఉద్దేశ్యంతోనో... లేదా వారిపై దయతోనే కానీ జాతీయ చలన చిత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది అక్టోబర్ 13న మల్టీ ప్లెక్స్ ల్లో కేవలం ఏ టికెట్ అయిన కూడా రూ.99 లకే లభిస్తుంది. గత ఏడాది ఈ ఒక్క రోజు ఆఫర్ గురించి పెద్దగా ప్రచారం లేకపోవడం వల్ల జనాలు ఎగబడలేదు. కానీ ఈసారి మల్టీప్లెక్స్ ల్లో సందడే సందడి అన్నట్లుగా ఉంది.
చాలా రోజుల క్రితం విడుదల అయిన సినిమాలకు మొదలు నేడు విడుదల అయిన సినిమాల వరకు ప్రతి ఒక్క సినిమాకు మల్టీ ప్లెక్స్ ల్లో ఫుల్ ఆక్యుపెన్సీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఒక్క రోజు మాత్రమే మల్టీ ప్లెక్స్ ల్లో రూ.99 లు కనుక సాధ్యం అయినంత ఎక్కువ మంది ఇదే రోజు ఏదో ఒక సినిమా ను చూడాలని భావిస్తున్నట్లుగా టాక్.
సినిమా ఏదైనా పర్వాలేదు.. ఒక్క సారి అయినా మల్టీ ప్లెక్స్ కి వెళ్లాలి, అక్కడ సినిమా చూస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్స్ పీరియన్స్ చేయాలనే ఉద్దేశ్యంతో సామాన్యులు ఎక్కువ మంది నేడు మల్టీ ప్లెక్స్ థియేటర్ల ముందు క్యూ కట్టారు. ఈ జాతీయ చలన చిత్ర దినోత్సవం ఏమో కానీ ముందు ముందు ఏడాదికి కనీసం అయిదు నుంచి పది సార్లు అయినా ఈ ఆఫర్ పెట్టాలని కొందరు కోరుకుంటున్నారు. రెగ్యులర్ రోజుల్లో రూ.250 నుంచి మొదలుకుని రూ.500... రూ.1000 వరకు ఉండే రేట్లు స్పెషల్ డే పేరుతో రూ.99 లకే రావడం నిజంగా హర్షనీయం కదా...!